Krishna Godavari Floods : గలగలా గోదావరి, బిరబిరా కృష్ణమ్మ, ప్రాజెక్టులకు జలకళ- భద్రాచలం వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక జారీ
Krishna Godavari Floods : తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలకు కురుస్తున్నాయి. అలాగే ఎగువ నుంచి వరద పోటెత్తడంతో ప్రాజెక్టులు జలకళ సంతరించుకున్నాయి. కృష్ణా, గోదావరి ప్రాజెక్టులు నిండు కుండల్లా మారుతున్నాయి.
Krishna Godavari Floods : తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు కృష్ణా, గోదావరి నదులకు క్రమంగా వరద ప్రవాహం పెరుగుతోంది. జూరాల ప్రాజెక్టు వద్ద కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది. ప్రస్తుతం జూరాల ఇన్‌ఫ్లో 92 వేల క్యూసెక్కులు ఉండగా, ఔట్ ఫ్లో 1.71 లక్షల క్యూసెక్కులుగా ఉంది. జూరాల ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటిమట్టం 318.51 మీటర్లు, వరద పోటెత్తడడంతో నీటి మట్టం 317.17 మీటర్లకు చేరుకుంది. వరద ఉద్ధృతి క్రమంగా పెరుగుతుండడంతో జూరాల 17 గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. జూరాల ప్రాజెక్టు నీటి నిల్వ సామర్థ్యం 9.66 టీఎంసీలు కాగా, ప్రస్తుతం జలశయాలంలో నీటి నిల్వ 7.04 టీఎంసీలుగా ఉందని అధికారులు ప్రకటించారు.
బిరబిరా కృష్ణమ్మ పరుగులు
జూరాల ప్రాజెక్టుకు ఎగువ నుంచి వరద పోటెత్తడంతో దిగువకు నీరు విడుదల చేస్తుంది. జూరాల నుంచి శ్రీశైలం ప్రాజెక్టుకు వరద ప్రవాహం పెరుగుతోంది. జూరాల నుంచి 96,141 క్యూసెక్కుల వరద శ్రీశైలం ప్రాజెక్టుకు చేరుతోంది. శ్రీశైలంలో ఆదివారం సాయంత్రానికి నీటి మట్టం 821.20 అడుగులు కాగా, నీటి నిల్వ 41.6978 టీఎంసీలుగా నమోదైంది. శ్రీశైలం జలాశయం పూర్తి స్థాయి నీటిమట్టం 885 అడుగులు, పూర్తిస్థాయి నీటి నిల్వ 215.807 టీఎంసీలు.
విజయవాడలోని ప్రకాశం బ్యారేజీకి వరద కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది. ప్రకాశం బ్యారేజీకి ఎగువ నుంచి 13,634 క్యూసెక్కుల వరద వస్తుంది. ప్రకాశం బ్యారేజీ 17 గేట్లను ఒక అడుగు మేర ఎత్తి సముద్రంలోకి 12,325 క్యూసెక్కుల నీటిని వదిలారు. అలాగే కాలువల ద్వారా మరో 1,309 క్యూసెక్కుల వరద నీటిని విడుదల చేస్తున్నారు. ప్రకాశం బ్యారేజీ నీటి మట్టం ప్రస్తుతానికి 12 అడుగులుగా ఉంది.
గలగలా గోదావరి
ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో గోదావరికి వరద పెరుగుతోంది. భద్రాచలం దగ్గర గోదావరి ఉద్ధృతి పెరుగుతోంది. తాజాగా భద్రాచలం వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం 43 అడుగులకు చేరింది. దీంతో దిగువన పోలవరానికి 8,85,224 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. వరద ఉద్ధృతి పెరుగుతుండడంతో లోతట్టు ప్రాంతాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. పోలవరం ప్రాజెక్టుకు వరద ఉద్ధృద్ధి పెరుగుతోంది. ప్రాజెక్టు స్పిల్ వే వద్ద నీటిమట్టం 31.9 మీటర్లకు చేరింది. 8,37,179 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ధవళేశ్వరం వద్ద గోదావరి ఉద్ధృతి పెరుగుతుండడంతో 175 గేట్లు ఎత్తివేసి వరద నీటిని సముద్రంలోకి విడుదల చేస్తున్నారు.
భద్రాచలం వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక
భద్రాచలం వద్ద గోదావరి నది మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. గంట గంటకూ గోదావరి వరద ఉద్ధృతి పెరుగుతోంది. దీంతో ఓవైపు అధికారులు, మరో వైపు లోతట్టు ప్రాంతాల ప్రజల్లో ఆందోళన మొదలైంది. ఆదివారం భద్రాచలం వద్ద గోదావరి నది ప్రవాహం సాయంత్రం 43 అడుగులకు చేరుకున్నట్లు సీడబ్ల్యుసీ అధికారులు తెలియజేశారు. ఈ రాత్రికి 44 నుంచి 45 అడుగులకు నీటి మట్టం చేరుకునే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. దీంతో జిల్లా కలెక్టర్, ఎస్పీ సహా అధికార యంత్రాంగం విరామం లేకుండా సహాయక చర్యలు చేపడుతున్నారు. ఎప్పటికప్పుడు పరిస్థితిని గమనిస్తూ క్షేత్ర స్థాయి సిబ్బందిని అప్రమత్తం చేస్తున్నారు. మరోవైపు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పెద్దవాగు ప్రాజెక్టుకు గండి పడిన ప్రాంతాన్ని పరిశీలించారు. తాజా పరిస్థితులపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. గండి కారణంగా నష్టపోయిన పంటల వివరాలను వెంటనే సేకరించాలని అధికారులను ఆదేశించారు.
మళ్లీ పెరుగుతున్న తాలిపేరు
తాలిపేరు ప్రాజెక్టు వద్ద మధ్యాహ్నం వరకు తగ్గుముఖం పట్టిన వరద మళ్లీ పెరగడం ప్రారంభించింది. ఈ నేపథ్యంలో ప్రాజెక్టు 25 గేట్లను ఎత్తి 59,267 క్యూసెక్కుల వరద నీటిని గోదావరిలోకి విడుదల చేస్తున్నారు. ఇదిలా ఉండగా ప్రాజెక్ట్ పూర్తి స్థాయి నీటి మట్టం 74 మీటర్లు కాగా, ప్రస్తుత నీటి మట్టం 70.96 మీటర్లకు చేరుకుంది. కాగా ఇన్ ఫ్లో 61,873 క్యూసెక్కులు, అవుట్ ఫ్లో 59,267 క్యూసెక్కులు ఉన్నట్లు అధికారులు తెలుపుతున్నారు. నది ఉద్ధృతి రీత్యా పరీవాహక ప్రాంత గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని నీటిపారుదల శాఖ అదికారులు హెచ్చరిస్తున్నారు.
ఉరకలేస్తున్న కిన్నెరసాని
భద్రాద్రి జిల్లాలోని తాలిపేరు ప్రాజెక్టు తర్వాత మరో ప్రాజెక్ట్ గా ఉన్న పాల్వంచ కిన్నెరసాని జలాశయానికి సైతం భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. కిన్నెరసాని ప్రాజెక్టు పూర్తి సామర్థ్యం 407 అడుగులు కాగా ప్రస్తుతం 403.30 అడుగులకు నీటిమట్టం చేరుకున్నట్లు అధికారులు స్పష్టం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆదివారం సాయంత్రం 6గం నుంచి డ్యామ్ 4 గేట్లు ఎత్తి 16 వేల క్యూసెక్కుల వరద నీటిని దిగువకు విడుదల చేయనున్నట్లు అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో కిన్నెరసాని పరివాహక ప్రాంత ప్రజలు సైతం అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు.
రిపోర్టింగ్ - కాపర్తి నరేంద్ర, ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రతినిధి.
సంబంధిత కథనం