AP Telangana : భద్రాచలం విలీన గ్రామాల సమస్య తీరేనా...? సీఎంల సమావేశంపై సర్వత్రా ఆసక్తి..!
Telugu State Chief Ministers Meeting : ఏపీ, తెలంగాణ ముఖ్యమంత్రుల కీలక భేటీకి సర్వం సిద్దమైంది. విభజన అంశాలే ప్రధాన అజెండగా చర్చ జరగనుంది. అయితే భద్రాచలం పరిధిలో ఉన్న పలు గ్రామాల విలీన సమస్యలకు కూడా పరిష్కారం దొరుకుతుందా అన్న ఆసక్తి నెలకొంది.
పదేళ్లుగా భద్రాచలం ప్రజలు పడుతున్న విభజన బాధలకు ముగింపు పలికేనా.? ఐదు పంచాయతీల సమస్యకు ముఖ్యమంత్రుల సమావేశంలో పరిష్కారం లభిస్తుందా.? ఇప్పుడు ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఇదే ఆసక్తి నెలకొంది.
సుదీర్ఘ కాలం పాటు జరిగిన ప్రత్యేక రాష్ట్ర పోరాట ఫలితంగా ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రంలో చిట్ట చివరి నియోజకవర్గమైన భద్రాచలానికి ఆనాడు మొదలైన విభజన కష్టాలు నేటికీ తీరలేదు. పది సంవత్సరాలు గడిచినా ఆ సమస్యలు సంక్లిష్టంగానే ఉండటంతో దక్షిణ అయోధ్యగా పేరుగాంచిన భద్రాచల దివ్య క్షేత్రం అనేక రకాల ఇబ్బందులతో సతమతమవుతోంది. చివరికి చెత్త పోసుకునే స్థలం కూడా లేకుండా అభివృద్ధికి ఆమడ దూరాన నిలిచింది.
దక్షిణ అయోధ్యగా పేరుగాంచిన భద్రాద్రి రాముడు సైతం తన భూముల విషయంలో వివాదాలకు కేంద్ర బిందువుగా నిలిచారంటే విభజన కష్టాలు ఏ స్థాయిలో ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. రాష్ట్ర విభజన అనంతరం ప్రత్యేక ఆర్డినెన్స్ ద్వారా అప్పటి కేంద్ర ప్రభుత్వం పోలవరం ముంపు పేరుతో అతి పెద్ద నియోజకవర్గంగా ఉన్న భద్రాచలం నియోజకవర్గాన్ని ముక్కలుగా చేసి అరణ్య అందాలకు నెలవుగా విరాజిల్లిన చింతూరు విఆర్ పురం, కూనవరం, భద్రాచలం(కొంత భాగాన్ని) మండలాలను ఆంధ్రలోకి విలీనం చేయడంతో పాటు భద్రాచలం పట్టణానికి విభజన సమస్యలను తెచ్చి పెట్టింది.
ప్రధానంగా భద్రాచలం పట్టణానికి అనుకుని ఉన్న ఎట్టపాక, కన్నాయిగూడెం, పిచ్చుకలపాడు, గుండాల, పురుషోత్తపట్నం పంచాయతీలను సైతం ఆంధ్రాలో విలీనం చేయడంతో భద్రాచలం పట్టణానికి చెత్త వేసుకునే చోటు కూడా లేకుండా పోయింది. దీంతో పాటు భద్రాచల పట్టణ విస్తరణకు అవకాశం లేకుండా పోయింది. అంతేకాకుండా పురుషోత్తపట్నంలో ఉన్నటువంటి రామయ్య భూములు సైతం కబ్జాకు గురి కావడంతో దేవస్థానం అధికారులకు పురుషోత్తపట్నం రైతులకు మధ్య చిన్నపాటి యుద్ధమే జరిగిందని చెప్పాలి.
ఈ నేపథ్యంలో భద్రాచలం పట్టణంతో పాటు రామాలయ అభివృద్ధి జరగాలంటే కచ్చితంగా ఐదు పంచాయతీలను తిరిగి భద్రాచలంలో విలీనం చేయడం తప్ప వేరే మార్గం లేదని సాక్షాత్తు తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కూడా స్పష్టం చేసిన విషయం తెలిసిందే.
నాటి నుంచి ఎన్నో పోరాటాలు….
ఐదు పంచాయతీలను తెలంగాణలో కలపాలని రాష్ట్రం ఏర్పడ్డ నాటి నుంచి అప్పటి ఎమ్మెల్యే సున్నం రాజయ్య నేతృత్వంలో ఆమరణ నిరాహార దీక్ష సైతం చేపట్టారు. సీపీఐ(ఎం) ఆధ్యర్యంలో దశల వారీగా ఎన్నో పోరాటాలు, ఉద్యమాలు చేస్తూనే ఉన్నారు. అన్ని రాజకీయ పక్షాలను కలుపుకుని ముఖ్యమంత్రులను, గవర్నర్ ను సైతం కలిసి వినతులు అందించడమే కాక గత సంవత్సరం చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ భద్రాచల పర్యటన సందర్భంగా కూడా ఈ ప్రాంత ప్రజలు ఐదు పంచాయతీలను తెలంగాణలో కలిపేందుకు సహకరించాలని విన్నవించిన విషయం తెలియంది కాదు.
మారుతున్న రాజకీయ సమీకరణల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఏర్పడ్డ వెంటనే ఆంధ్రప్రదేశ్ ని పునర్మించేందుకు అన్ని అంశాలపై ప్రత్యేక దృష్టి పెట్టిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విభజన సమస్యలపై కూడా ప్రత్యేక దృష్టి పెట్టారని తెలుస్తుంది. అందులో భాగంగానే నేడు జరిగే ఇద్దరు ముఖ్యమంత్రుల సమావేశంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
విభజన సమస్యలపై చర్చించేందుకు రావలసిందిగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి చంద్రబాబు నాయుడు లేఖ రాయటం ఈ ప్రాంత ప్రజల్లో ఆశలను రేకెత్తిస్తోంది. చంద్రబాబు నాయుడు స్పందనకు ప్రతిస్పందనగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా వెంటనే మంత్రివర్గంతో చర్చించి నేడు జరిగే భేటీలో చర్చించాల్సిన విషయాలపై ఒక నిర్ణయానికి వచ్చారని తెలుస్తుంది.
కృష్ణా, గోదావరి నీటి సంపకంతో పాటు హైదరాబాద్ ఆస్తుల పంపకం, ఉద్యోగుల విభజన అంశాలను చర్చిస్తూనే భద్రాచల అభివృద్ధికి ఆటంకంగా నిలిచిన ఐదు పంచాయతీల విషయాన్ని కూడా ఇరు రాష్ట్ర ముఖ్యమంత్రులు చర్చిస్తారని రాజకీయ నాయకులు అభిప్రాయపడుతున్నారు. ఇదిలా ఉండగా ఇప్పటికే ఐదు పంచాయతీల ప్రజలు భద్రాచలంలో విలీనం చేయాలని కోరుతూ స్థానిక శాసన సభ్యులు తెల్లం వెంకటరావుకు సైతం వినతిపత్రం అందించారు.
ఐదు పంచాయతీల ప్రజలు కూడా తెలంగాణకే మొగ్గు చూపడంతో ఈ ప్రాంత ప్రజల పోరాటానికి బలం చేకూరింది. ఏదేమైనప్పటికీ ఎన్నో ఏళ్లుగా ఈ ప్రాంత ప్రజలు చేస్తున్న పోరాటాలకు నేడు జరిగే సమావేశంలో ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉందని తెలుస్తుంది.