Bhadrachalam Godavari Flood : భద్రాచలం వద్ద గోదావరి ఉద్ధృతి, 40.20 అడుగులకు చేరిన నీటిమట్టం
Bhadrachalam Godavari Flood : భద్రాచలం వద్ద గోదావరి వరద పోటెత్తుతుంది. ఎగువ నుంచి భారీగా వరద ప్రవాహం వస్తుండడంతో భద్రాచలం వద్ద ప్రస్తుతం 40.20 అడుగులకు నీటి మట్టం చేరింది.
Bhadrachalam Godavari Flood : ఎగువ నుంచి వరద పోటెత్తడంతో గోదావరి నది ఉగ్రరూపం దాల్చుతుంది. మహారాష్ట్ర, చత్తీస్ గడ్ రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు గోదావరిలో వరద అంతకంతకు పెరుగుతోంది. భద్రాచలం వద్ద గంట గంటకు వరద ఉద్ధృతి పెరుగుతుంది. తాజాగా భద్రాచలం వద్ద 40.20 అడుగులకు గోదావరి నీటిమట్టం చేరింది. ఆదివారం మధ్యాహ్నం 2 గంటలకు గోదావరి నీటి మట్టం 40.20 అడుగులుగా నమోదయిందని సీడబ్ల్యూసీ అధికారులు స్పష్టం చేశారు. భద్రాచలం వద్ద నీటి మట్టం 43 అడుగులు దాటితే తొలి ప్రమాద హెచ్చరికను జారీ చేయనున్నారు. అలాగే 48 అడుగులకు చేరితే రెండో ప్రమాద హెచ్చరికను జారీ చేస్తారు. 53 అడుగులకు నీటి మట్టం చేరితే మూడో ప్రమాద హెచ్చరికను జారీ చేయనున్నారు. దిగువ పోలవరానికి 7,36,224 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు.
1986లో గరిష్ట వరద
భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం భారీగా పెరిగిన సందర్భాలు గతంలో చోటుచేస్తున్నాయి. 1986 సంవత్సరంలో చరిత్రలోనే గరిష్టంగా 75.60 అడుగులకు గోదావరి నీటిమట్టం చేరింది. ఇది రికార్డు స్థాయి నీటిమట్టంగా గోదావరి చరిత్రలో నిలిచిపోయింది. కాగా 2022 లో కురిసిన భారీ వర్షాలకు 71.30 అడుగులకు గోదావరి నీటిమట్టం పెరిగింది. ఇక 1990లో 70.3 అడుగులకు, 2006లో 66.9 అడుగులకు, 1976లో 63.9 అడుగులకు భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం నమోదయింది.
తగ్గుముఖం పడుతున్న తాలిపేరు
గోదావరి నీటిమట్టం అంతకంతకు పెరుగుతుండగా తాలిపేరు ప్రాజెక్టు నీటిమట్టం క్రమంగా తగ్గుముఖం పడుతుంది. ఎగువ ప్రాంతంలో వర్షాలు తగ్గుముఖం పట్టడంతో తాలిపేరు ప్రాజెక్ట్ నీటిమట్టం తగ్గుముఖం పడుతుందని అధికారులు చెబుతున్నారు. కాగా తాలిపేరు ప్రాజెక్టు 25 గేట్ల ద్వారా 55,232 క్యూసెక్కుల వరదను గోదావరి నదిలోకి విడుదల చేస్తుండడంతో ఈ ప్రాజెక్టు నీటిమట్టం క్రమంగా తగ్గుతున్నట్లు తెలుస్తోంది.
రిపోర్టింగ్ - కాపర్తి నరేంద్ర, ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రతినిధి
సంబంధిత కథనం