Rains in Telangana : ఎడతెరిపి లేని వర్షం, ఎగువ నుంచి వరద - గోదావరి బేసిన్ ప్రాజెక్టులకు జలకళ
Rains in Telangana : అల్పపీడన ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఇక ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా వానలు పడుతుండగా…జలాశయాలకు స్వల్పంగా వరద నీరు వచ్చి చేరుతోంది.
అల్పపీడన ప్రభావంతో ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ఓ మోస్తరు నుంచి భారీ వర్షం కురుస్తుంది. ఎడతెరిపి లేకుండా ముసురులా వర్షం పడుతుంది. పెద్దపల్లి జిల్లా మంథని డివిజన్ మినహా మిగతా ప్రాంతాల్లో సాధారణ వర్షపాతమే నమోదైంది. రెండు రోజుల భారీ వర్ష సూచనతో పెద్దపల్లి జిల్లాలో కరీంనగర్ జగిత్యాల రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఆరంజ్ అలర్ట్ ప్రకటించారు. వర్షాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.
మంథనిలో జోరు వాన..
ఉమ్మడి జిల్లాలో మంథని డివిజన్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. గత మూడు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. జలాశ్యాలని జలకలను సంతరించుకున్నాయి. మంథని సమీపంలోని సింగరేణి ఓపెన్ కాస్ట్ బొగ్గు గని నుంచి వస్తున వరద నీరు పంట పొలాలను ముంచెత్తడంతో కన్నాల గ్రామానికి చెందిన రైతులు ఆందోళనకు దిగారు. పొలాల్లో ఇసుక మేటలు వేయడంతో పంటలు పండేదెట్ల అని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు పంట నష్టాన్ని అంచనా వేసి ఆదుకోవాలని కోరుతున్నారు.
సింగరేణి లో బొగ్గు ఉత్పత్తికి అంతరాయం..
ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో సింగరేణికి అపా నష్టం సంభవించింది. మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలతో రామగుండం రీజియన్ లోని ఓపెన్ కాస్ట్ బొగ్గు గనుల్లో నీళ్ళు నిలిచి బొగ్గు ఉత్పత్తికి అంతరాయం ఏర్పడింది. రోజుకు 80 వేల మెట్రిక్ టన్నుల బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. ఓపెన్ కాస్ట్ గనుల్లో రోడ్లన్నీ బురదమయంగా మారడంతో వాహనాలన్నీ ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. రామగుండం ఎన్టీపీసీ కి కావలసిన బొగ్గును స్టాక్ యార్డు నుండి సింగరేణి యాజమాన్యం సప్లై చేస్తుంది.
గోదావరి తీరంలోని ప్రాజెక్టులకు జలకళ
స్థానికంగా వర్షం తక్కువే ఉన్నా ఎగువన కురుస్తున్న వర్షాలతో గోదావరి నదిలో క్రమంగా వరద పెరుగుతుంది. దీంతో గోదావరి నదిపై నిర్మించిన ప్రాజెక్టులకు జలకళ సంతరించుకుంది. శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టుకు క్రమక్రమంగా వరద పెరుగుతుంది. అదేవిధంగా కాళేశ్వరం ఎత్తిపోతల పథకం లో భాగంగా సుందిళ్ల వద్ద నిర్మించిన పార్వతి బ్యారేజీకి, అన్నారం సరస్వతి బ్యారేజ్ క్రమంగా వరద పెరుగుతుంది. ఇక కాలేశ్వరం దిక్కున మేడిగడ్డ వద్ద నిర్మించిన లక్ష్మీ బ్యారేజ్ కి వరద పోటెత్తింది. గోదావరి ప్రాణహిత నదుల ద్వారా వస్తున్న వరద ఉధృతంగా ఉండడంతో మేడిగడ్డ బ్యారేజ్ అన్ని గేట్లు ఎత్తి దిగువకు నీటిని వదులుతున్నారు.
మానేర్ కు స్వల్పంగా వరద…
ముసురులా కురుస్తున్న వర్షంతో లోయర్ మానేర్ డ్యామ్, మధ్య మానేర్ రిజర్వాయర్ కు స్వల్పంగా వరద వచ్చి చేరుతుంది. డెడ్ స్టోరేజ్ లో ఉన్న రెండు డ్యామ్ లకు నిన్నటి నుంచే స్వల్పంగా వరద నీరు వచ్చి చేరుతుంది. కరీంనగర్ సమీపంలోని లోయర్ మానేర్ డ్యామ్(ఎల్ఎండి) పూర్తిస్థాయి నీటి సామర్థ్యం 24 టిఎంసిలు కాగ ప్రస్తుతం 5.08 టిఎంసిలకు చేరింది నీటిమట్టం. ఎల్ఎండికి ఇన్ ఫ్లో 389 క్యూసెక్కులు ఉంది.
ఇక రాజన్న సిరిసిల్ల జిల్లాలోని మిడ్ మానేర్ రిజర్వాయర్ (ఎంఎంఆర్) పూర్తిస్థాయి నీటి సామర్థ్యం 27 టిఎంసిలు కాగ, ప్రస్తుతం 5.57 టిఎంసీలకు చేరింది నీటిమట్టం. మిడ్ మానేర్ కు ఇన్ ఫ్లో 236 క్యూసెక్కులు ఉంది. ఇక ఎగువ మానేర్ నర్మాల ప్రాజెక్టు కు సైతం స్వల్పంగా వరద నీరు వచ్చి చేరుతుంది. సాధారణం కంటే కాస్త ఎక్కువ వర్షపాతం నమోదు అయినట్లు అధికారుల లెక్కలు చెబుతున్నాయి.
జోరందుకున్న వరినాట్లు..
మొన్నటి వరకు వర్షాభావ పరిస్థితులతో వేసిన పంటలు ఎండిపోయే పరిస్థితి నెలకొనగా తాజాగా కురుస్తున్న వర్షాలతో అన్నదాతల్లో ఆనందం నెలకొంది. నీటి వసతి ఉన్న రైతులు ఇప్పటికే వరినార్లు పోసుకోగా ఈ వర్షాలతో నాట్లు వేసే పనిలో నిమగ్నమయ్యారు. వరుణుడి కరుణ కోసం ఇంతకాలం ఎదురుచూసిన రైతులు గత రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా ముసురులా కురుస్తున్న వర్షాలతో అన్నదాతలు హర్షం వ్యక్తం చేస్తు సాగుబడి పనులు ముమ్మరం చేశారు.
మరో రెండు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. లోతట్టు ప్రాంత ప్రజలు జాగ్రత్తగా ఉండాలని కోరుతున్నారు.