Karimnagar Water Problem : కరీంనగర్ కు తప్పని తాగునీటి కష్టాలు, అడుగంటిన లోయర్ మానేర్ డ్యామ్-karimnagar lower manair dam water reaches dead storage people demand solve drink water problem ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Karimnagar Water Problem : కరీంనగర్ కు తప్పని తాగునీటి కష్టాలు, అడుగంటిన లోయర్ మానేర్ డ్యామ్

Karimnagar Water Problem : కరీంనగర్ కు తప్పని తాగునీటి కష్టాలు, అడుగంటిన లోయర్ మానేర్ డ్యామ్

HT Telugu Desk HT Telugu
Mar 24, 2024 08:05 PM IST

Karimnagar Water Problem : ఈ వేసవిలో కరీంనగర్ లో తాగునీటి కష్టాలు తప్పలే కనిపించడంలేదు. లోయర్ మానేర్ డ్యామ్ లో నీళ్లు డెడ్ స్టోరేజ్ కి చేరుకున్నాయి. దీంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు. సాగునీటిని ఆపి ముందు తాగునీటికి ప్రాధాన్యం ఇవ్వాలని కోరుతున్నారు.

అడుగంటిన లోయర్ మానేర్ డ్యామ్
అడుగంటిన లోయర్ మానేర్ డ్యామ్

Karimnagar Water Problem : కరీంనగర్ కు తాగునీటి కష్టాలు తప్పేలా లేవు. వేసవి ఆరంభంలోనే నగర సమీపంలోని లోయర్ మానేర్ డ్యామ్(ఎల్ఎండీ)(Lower Manair Dam)లో నీళ్లు అడుగంటాయి. డెడ్ స్టోరేజ్ కి వాటర్ చేరడంతో అందరినీ ఆందోళనకు గురిచేస్తుంది. నీటి నిలువలు పడిపోవడంతో నగరంలో బోర్ వెల్స్(Borewells) కూడా సరిగా పనిచేయడం లేదు. కరీంనగర్ తోపాటు పలు గ్రామాలకు తాగునీటి సమస్య(Summer Water Problem) తలెత్తే పరిస్థితి ఏర్పడింది. 24 టీఎంసీ నీటి నిల్వ సామర్థ్యం గల లోయర్ మానేర్ డ్యామ్ లో ప్రస్తుతం 5.3 టీఎంసీల నీళ్లు మాత్రమే ఉన్నాయి. అందులో కొంత సాగునీటికి మరికొంత ఆవిరై పోతుంది. వారం పదిరోజులైతే మూడు నుంచి 4 టీఎంసీ నీళ్లు మాత్రమే ఉండే పరిస్థితి నెలకొంది. దీంతో బూస్టర్ లకు నీళ్లు అందుక కరీంనగర్, మానకొండూర్ అసెంబ్లీ నియోజకవర్గాల్లోని పలు గ్రామాలకు నగరానికి మంచినీరు సప్లై నిలిచిపోయే అవకాశాలు ఉన్నాయి. అధికారులు అప్రమత్తమై తక్షణ చర్యలు చేపడితే తప్ప, సమస్య నుంచి బయటపడే పరిస్థితి లేదు. వేసవి ఆరంభంలోనే పరిస్థితి ఇలా ఉంటే మే, జూన్ వరకు పరిస్థితి ఎలా ఉంటుందోనని సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది.

సాగుకు నీళ్లు ఆపి...తాగడానికి ఇవ్వండి

ఎల్ఎండీలో వాటర్ డెడ్ స్టోరేజ్(Water Dead Storage) కు చేరిందనే సమాచారంతో ఎమ్మెల్యే గంగుల కమలాకర్, మాజీ ఎంపీ వినోద్ కుమార్, మేయర్ సునీల్ రావు డ్యామ్ ను సందర్శించారు. అడుగంటిన నీటి మట్టాన్ని పరిశీలించి ఆందోళన వ్యక్తం చేశారు. 25 ఏళ్ల రాజకీయ జీవితంలో ఎప్పుడూ మార్చి మాసంలో నీటి నిల్వలు పడిపోవడం చూడలేదన్నారు ఎమ్మెల్యే గంగుల కమలాకర్. కేసీఆర్ ప్రభుత్వ హాయంలో తాగునీటి అవసరాలు తీర్చిన తర్వాతే దిగువకు సాగునీరు అందించాలనే జీవో ఇచ్చారని గుర్తు చేశారు. మిషన్ భగీరథ(Mission Bhagiratha) కోసం LMD లో 13 టీఎంసీలు, మిడ్ మానేర్ డ్యామ్(MMD) లో 6.5 టిఎంసీల నీటి నిల్వలు తగ్గకుండా చూశారని తెలిపారు. కాళేశ్వరం జలాలతో ఎల్ఎండీ, ఎంఎండీ రిజర్వాయర్లను నింపడంతో మండు వేసవిలో రెండు డ్యామ్ లు నిండు కుండలా కనిపించడంతో కరీంనగర్ (Karimnagar Water Supply)లో ప్రతి రోజు 24/7 గంటలు నీటి సప్లై చేశామని తెలిపారు. బూస్టర్ల ద్వారా నీరు అందించడం సాధ్యంకాదని అధికారులు చెప్పడంతో సీఎం స్పందించి ఎల్ఎండీ నుంచి దిగువకు సాగు నీటి విడుదల నిలిపి వేయించాలని డిమాండ్ చేశారు. ఎల్ఎండీలో ప్రస్తుతం ఉన్న 5 టీఎంసీలకు మరో రెండు టీఎంసిల నీళ్లను మిడ్ మానేర్ నుంచి విడుదల చేస్తే నగర ప్రజలకు రోజుకు గంట నీళ్లు ఇవ్వొచ్చని తెలిపారు. ఆ దిశగా ప్రభుత్వం వెంటనే చర్యలు చేపట్టాలని కోరారు.

కాళేశ్వరం ఎఫెక్ట్ తో నీటి కటకట

బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కాళేశ్వరం ఎత్తిపోతల పథకం(Kaleshwaram Project) ప్రస్తుతం నిలిచిపోవడంతో వాటర్ ప్రాబ్లం రోజు రోజుకు తీవ్రమవుతుంది. గత అక్టోబర్ లో కాళేశ్వరం ప్రాజెక్టులో అంతర్భాగమైన మేడిగడ్డ(Medigadda Project) లక్ష్మి బ్యారేజ్ మూడు పిల్లర్లు కుంగడంతో కాళేశ్వరం ప్రాజెక్టు డ్యామేజ్ అయింది. అదే సమయంలో అసెంబ్లీ ఎన్నికలు జరగడం బీఆర్ఎస్ ఓటమిపాలై కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో కాళేశ్వరం ప్రాజెక్టు కుదేలైంది. మరమ్మతులు చేయాల్సిన ప్రభుత్వం, విచారణ పేరుతో కాలయాపన చేస్తూ కేసీఆర్(KCR) ను నిందించేందుకు అసలు మేడిగడ్డ బ్యారేజ్ పనికిరాదని ప్రచారం చేస్తుంది. మేడిగడ్డ బ్యారేజ్ లో నీటి నిల్వ ఉంటేనే కాళేశ్వరం ఎత్తిపోతల పథకం ద్వారా గోదావరి నీటిని(Godavari Water) ఎత్తిపోసి డ్యామ్ లను నింపే అవకాశం ఉంది. ప్రస్తుతం మేడిగడ్డ బ్యారేజ్ డ్యామేజ్ తో నీటిని ఎత్తిపోసే అవకాశం లేదని ప్రభుత్వం స్పష్టం చేస్తుంది. కావాలనే కాంగ్రెస్ ప్రభుత్వం కాళేశ్వరం ఎత్తిపోతలను నిలిపివేసి బీఆర్ఎస్ ను కేసీఆర్ ను బద్నాం చేస్తుందని బీఆర్ఎస్ నేత మాజీ ఎంపీ బోయినిపల్లి వినోద్ కుమార్ ఆందోళన వ్యక్తం చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టుతో నీటి సప్లై చేయడం వీలు కాకుంటే ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించి నీటి సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు.

రిపోర్టింగ్ : హెచ్.టి తెలుగు కరస్పాండెంట్, కరీంనగర్

WhatsApp channel