Hyderabad Heavy Rains : హైదరాబాద్ లో కుండపోత వర్షం, చెరువుల్లా మారిన రోడ్లు-భారీగా ట్రాఫిక్ జామ్-hyderabad heavy rains lashed city waterlogged roads causing huge traffic jam ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Hyderabad Heavy Rains : హైదరాబాద్ లో కుండపోత వర్షం, చెరువుల్లా మారిన రోడ్లు-భారీగా ట్రాఫిక్ జామ్

Hyderabad Heavy Rains : హైదరాబాద్ లో కుండపోత వర్షం, చెరువుల్లా మారిన రోడ్లు-భారీగా ట్రాఫిక్ జామ్

Bandaru Satyaprasad HT Telugu
Jul 14, 2024 09:17 PM IST

Hyderabad Heavy Rains : హైదరాబాద్ లో కుండపోత వర్షం కురిసింది. దీంతో భారీగా వర్షపు నీరు రోడ్లపై చేరి చెరువులను తలపిస్తున్నాయి. పలు ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది.

హైదరాబాద్ లో కుండపోత వర్షం, చెరువుల్లా మారిన రోడ్లు-భారీగా ట్రాఫిక్ జామ్
హైదరాబాద్ లో కుండపోత వర్షం, చెరువుల్లా మారిన రోడ్లు-భారీగా ట్రాఫిక్ జామ్

Hyderabad Heavy Rains : హైదరాబాద్ ను వర్షం ముంచెత్తింది. భారీ వర్షంతో నగరంలోని రోడ్లు చెరువుల్లా మారాయి. ఆదివారం సాయంత్రం సిటీలోని పలు ప్రాంతాల్లో భారీగా వర్షం కురిసింది. సికింద్రాబాద్, బేగంపేట్, ప్యారడైజ్, చిలకలగూడ, ప్యాట్నీ, చింతల్, సుచిత్ర, బాలానగర్, ఐడీపీఎల్, జీడిమెట్ల, మారేడుపల్లి, అడ్డగుట్ట, మియాపూర్‌, చందానగర్‌, లింగంపల్లి, కేపీహెచ్‌బీ, ప్రగతి నగర్, బాచుపల్లి, కూకట్‌పల్లి, మూసాపేట, హైదర్‌ నగర్‌, కుషాయిగూడ, మల్కాజిగిరి, చర్లపల్లి, దమ్మాయిపేట, కీసర, నిజాంపేట, నేరేడ్మెట్‌, అమీర్‌పేట్‌, ఎర్రగడ్డ, ఈఎస్‌ఐ, సనత్‌నగర్‌, బోరబండ, పంజాగుట్ట, జూబ్లీహిల్స్‌, ఉప్పల్‌ సహా నగరంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది.

బయటకు రావొద్దు

హైదరాబాద్ లో కుండపోత వర్షానికి లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలమయం అయ్యాయి. రోడ్లపై భారీగా వర్షపు నీరు చేరడంతో ట్రాఫిక్ జామ్ అయ్యింది. దీంతో వాహనదారులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. భారీ వర్షంతో పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. దీంతో జీహెచ్ఎంసీ అధికారులు అప్రమత్తం అయ్యారు. మరో గంట సేపు కుండపోత వర్షం కురిసే అవకాశముందని వాతావరణ కేంద్రం హెచ్చరికలతో అత్యవసరమైతే తప్ప ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావొద్దని జీహెచ్‌ఎంసీ మేయర్‌ విజయలక్ష్మి నగర ప్రజలను విజ్ఞప్తి చేశారు. అత్యవసర సహాయం కోసం 040-21111111, 9000113667 నెంబర్లను సంప్రదించాలని సూచించారు. జోనల్ కమిషనర్లు, ఈవీడీఎం టీమ్‌లతో మేయర్ గద్వాల విజయలక్ష్మి, నగర కమిషనర్ ఆమ్రపాలి టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. నాళాల వద్ద ప్రమాద హెచ్చరికల సూచికలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఈదురు గాలులకు చెట్లు విరిగిపడే ప్రమాదం ఉండడంతో ఈవీడీఎం తమ సిబ్బందితో అందుబాటులో ఉండాలని సూచించారు. వాటర్ లాగింగ్ ప్రాంతాలను గుర్తించి సమస్యలను సత్వరమే పరిష్కరించాలని ఆదేశఇంచారు. భారీ వర్షం నేపథ్యంలో ప్రజలు బయటకు రావొద్దని ఆమ్రపాలి కోరారు. జీహెచ్ఎంసీ డీఆర్ఎఫ్ బృందాలను రంగంలోకి దింపింది.

పలు ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ జామ్

నగరంలోని ప్రధాన రోడ్లపై భారీగా వర్షం నీరు చేరడంతో పలు చోట్ల ట్రాఫిక్‌ జామ్‌ అయింది. వరద ప్రవాహానికి యూసుఫ్‌గూడ శ్రీకృష్ణనగర్‌లో ఓ కారు కొట్టుకుపోయింది. సైబరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్ అయ్యింది. నెక్టార్ గార్డెన్, సిటీ వైన్స్, శిల్పారామం, ఎన్ఐఏ, పర్వత్ నగర్ రోడ్లపై భారీగా నీరు నిలిచిపోవడంతో... నీటిని తొలగించేందుకు జీహెచ్ఎంసీ సిబ్బంది ప్రయత్నిస్తున్నారు. ట్రాఫిక్ రద్దీ ఎక్కువగా ఉన్నందున సీవోడీ జంక్షన్‌ను వైపు వాహనదారులు రావొద్దని ట్రాఫిక్ పోలీసులు సూచించారు. అలాగే మైత్రీవనం, ఎస్ఆర్ నగర్ , నాంపల్లి, షేక్ పేట్, ఆసిఫ్ నగర్, ఎన్ఎమ్.డీసీ, టోలీచౌకీ మార్గంలో భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యిందని పోలీసులు తెలిపారు. భారీ వర్షానికి పంజాగుట్ట పీవీఆర్ లో కల్కి షో నిలిపివేశారు. థియేటర్ సీలింగ్ నుంచి వర్షపు చినుకులు ప్రేక్షకుల మీద పడడంతో కల్కి షోను నిలిపివేశారు. నగరంలో భారీగా వర్షం కురుస్తుండడంతో ప్రిన్సిపల్ సెక్రటరీ దాన కిషోర్ నగరంలోని అనేక ప్రాంతాలను తనిఖీ చేశారు. ఇంజినీరింగ్ సిబ్బంది, మాన్‌సూన్ ఎమర్జెన్సీ టీమ్‌లతో సమన్వయం చేస్తున్నారు.

Whats_app_banner

సంబంధిత కథనం