Tight doors, window: వర్షంతో ఇంటి తలుపులు, కిటికీలు పట్టట్లేదా? చప్పుడు కూడా తగ్గించే టిప్స్-simple remedies for struck doors and windows move freely ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Tight Doors, Window: వర్షంతో ఇంటి తలుపులు, కిటికీలు పట్టట్లేదా? చప్పుడు కూడా తగ్గించే టిప్స్

Tight doors, window: వర్షంతో ఇంటి తలుపులు, కిటికీలు పట్టట్లేదా? చప్పుడు కూడా తగ్గించే టిప్స్

Koutik Pranaya Sree HT Telugu
Jul 14, 2024 03:49 PM IST

Tight doors, window: ఇంటి తలుపులు, కిటికీ తలుపులు తెరుచుకోవట్లేదా? వర్షాకాలంలో వచ్చే ఈ సమస్య కొన్ని చిట్కాలు పాటిస్తే తీరిపోతుంది. అవేంటో చూడండి.

బిగుతుగా ఇంటి తలుపులు
బిగుతుగా ఇంటి తలుపులు (shutterstock)

వర్షాకాలం మొదలవ్వగానే చాలా ఇళ్లలో కనిపించే సమస్య తలుపులు, కిటికీలు సరిగ్గా మూసుకోకపోవడం. ఎంత గట్టిగా బిగించినా ఓ పట్టాన అవి పట్టవు. వర్షం వల్ల గాల్లో ఎక్కువగా ఉండే తేమ దానికి కారణం. చెక్కతో చేసిన తలుపులు ఈ తేమను పీల్చుకుని వ్యాకోచం చెందుతాయి. దాంతో అవి సరిగ్గా మూయలేం. కొన్ని తలుపుల నుంచి శబ్దాలు కూడా వస్తుంటాయి. తలుపులకుండే గొలుసులు, గొళ్లాలు సరిగ్గా పట్టని సమస్య మీ ఇంట్లోనూ ఉంటే ఈ చిట్కాలు పాటించండి.

హెయిర్ డ్రయ్యర్:

ఈ మధ్య హడావుడి జీవన శైలి వల్ల జుట్టు ఆరబెట్టుకునే సమయం కూడా ఉండట్లేదు. అందుకే దాదాపు అందరిళ్లలో హెయిర్ డ్రైయర్ ఉంటోంది. దాన్ని ఈ తలుపుల సమస్యకు వాడుకోవచ్చు. కిటికీలు, ఇంటి తలుపులు ఎక్కడైతే కాస్త తేమగా అనిపిస్తాయో లేదంటే అంచుల దగ్గర కాసేపు హెయిర్ డ్రైయర్ తో డ్రై చేసి చూడండి. కాస్త ఉబ్బినట్లున్న తలుపులు కూడా సెట్ అయిపోతాయి. వేడిగాలి వల్ల తలుపుల్లో ఉన్న తేమ ఆవిరి అయిపోవడమే దానికి కారణం. తలుపులు సులువుగా మూసుకుంటాయి.

గడియ:

తలుపుకు మధ్యలో ఉండే గడియ పట్టకపోయినా, పై భాగంలో ఉండే క్లిప్ పట్టకపోయినా అందులో ఆవనూనె లేదా మెషిన్ ఆయిల్ వేయండి. దీంతో అవి సులువుగా కదులుతాయి. అలాగే తలుపులు వేస్తున్నప్పుడు చప్పుడు వస్తున్నా కూడా ఆచోట కాస్త నూనె వేయండి. చాలా సులువుగా తలుపులు వేయొచ్చు. చప్పుడు కూడా రాదు.

తేమ చేరకుండా జాగ్రత్తలు:

తలుపులు తేమను పీల్చుకోవడం వల్లే ఉబ్బిపోయి సరిగ్గా పట్టవు. అందుకే తలుపులకు మైనం రాయవచ్చు. దీంతో అవి తేమ పీల్చుకోవు. అలాగే తలుపుకులకు ప్రైమింగ్ చేసి పెయింట్ వేయడం కూడా మంచి మార్గం. దాంతో నీళ్ల వల్ల తలుపులు పాడుకాకుండానూ ఉంటాయి. కనీసం మూడు నుంచి నాలుగు సంవత్సరాలకొకసారి తలుపులకు పెయింటింగ్ వేయడం వల్ల అవి పాడవ్వవు.

ఉబ్బకుండా:

వర్షం వల్ల తలుపులు ఉబ్బిపోకుండా వర్షాకాలం మొదలయ్యే ముందే తలుపులకు కిటికీలకు నూనె, పారాఫిన్ వ్యాక్స్ పూత వేయాలి. దీంతో అది తేమ రాకుండా నిరోధిస్తుంది.

తలుపులను శుభ్రం చేయడం:

తలుపులను శుభ్రం చేయడానికి తడిగుడ్డను వర్షాకాలంలో అస్సలు వాడకండి. పొడి గుడ్డ వాడండి. లేదంటే రెండు చుక్కల నూనెను తలుపు మీద వేసి దాన్ని అంతటా తుడిచినట్లు చేయండి. మెరుపుతో పాటూ తలుపులూ తేమ పీల్చుకోకుండా నూనె కాపాడుతుంది.

Whats_app_banner