Hair dryer usage tips: హెయిర్ డ్రైయర్ వాడేటపుడు ఈ తప్పులు చేయకండి.. జుట్టు రాలడానికి కారణాలవే..
Hair dryer usage tips: జుట్టు కోసం డ్రైయర్ వాడే అలవాటు సర్వసాధారణం. అయితే దాన్ని సరైన పద్ధతిలో వాడకపోతే జుట్టుకు హాని జరుగుతుంది. అలా జరగకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకోండి.
జుట్టు సిల్కీగా, స్మూత్ గా ఉండాలని ఎవరికుండదు. అందుకే కదా ఏవేవో ప్రయోగాలు చేస్తుంటాం. అయితే మనం తెలీకుండా చేసే కొన్ని తప్పుల వల్ల జుట్టు చాలా దెబ్బతింటుంది. ముఖ్యంగా జుట్టుకోసం వాడే డ్రైయర్ ను సరైన పద్ధతిలో వాడకపోతే ఇబ్బందే. జుట్టు నిర్జీవంగా మారుతుంది.
ఈ తప్పులు చేయొద్దు..
1. జుట్టు మరీ తడిగా ఉన్నప్పుడు హెయిర్ డ్రైయర్ వాడద్దు:
నీళ్లు వడిచేంత తడిగా జుట్టు ఉన్నప్పుడు డ్రైయర్ అస్సలు వాడొద్దు. అలా తడిగా ఉన్నప్పుడు డ్రైయర్ వాడితే జుట్టు బలహీనంగా, నిర్జీవంగా మారుతుంది. జుట్టు తడిగా ఉన్నప్పుడు అది తేమను పీల్చుకుని జుట్టు బయటి కణాలు ఉబ్బేలా చేస్తుంది. ఆ సమయంలో వేడి గాలి తగిలితే నీరు వేగంగా ఆవిరైపోయి, కణాలు ముడుచుకునేలా చేస్తుంది. అలా జుట్టు బలహీనంగా మారుతుంది. కాబట్టి డ్రైయర్ వాడే ముందు కాస్త జుట్టు ఆరిపోయేలా చూసుకోవాలి.
2. మరీ ఎక్కువగా డ్రైయర్ వాడటం
ప్రతిరోజూ డ్రైయర్ వాడటం మంచిది కాదు. కాబట్టి అవసరమున్నప్పుడు మాత్రమే హెయిర్ డ్రైయర్ ఉపయోగించాలి.
3. టవెల్ తో జుట్టును గట్టిగా కొట్టడం
తలస్నానం చేసిన వెంటనేే తలకు చుట్టుకోవాలి. అయితే జుట్టు తుడిచేటప్పుడు వేగంగా, దురుసుగా రుద్దకూడదు. అలా చేయడం వల్ల జుట్టు బలహీనపడుతుంది. అలాగే మెత్తటి టవెల్ వాడాలి. టవెల్ ను తల నుంచి తీసి మెల్లగా అదుముతూ జుట్టు తుడుచుకోవాలి. మైక్రో ఫైబర్ టవెల్ వాడటం ఉత్తమం. మంచి టవెల్ వాడితే డ్రైయర్ అవసరం లేకుండానే జుట్టు ఆరుతుంది కూడా.
4. ఒకేసారి జుట్టు మొత్తానికి డ్రైయర్ పెట్టడం
జుట్టును కొన్ని భాగాలుగా విడదీసి డ్రై చేసుకోవాలి. అలాకాకుండా ఒకేసారి జుట్టంతా డ్రైయర్ గాలి పెట్టుకుంటూ పోతే ఆరిన జుట్టు మీద తడిజుట్టు పడి, మళ్లీ మనకు తెలీకుండానే ఇంకోసారి డ్రై చేస్తాం. అలా పలుమార్లు వేడిగాలి తగులుతుంది. అందుకనే భాగాలుగా విభజించి కొంచెం కొంచెంగా జుట్టు డ్రై చేసుకోవాలి.
5. హీట్ ప్రొటెక్టెంట్ వాడాలి
దీర్ఘకాలం జుట్టు ఆరోగ్యంగా ఉండాలంటే జుట్టుకు తప్పకుండా హీట్ ప్రొటెక్టంట్ వాడాలి. దువ్వెన సాయంతో కానీ, చేత్తో కానీ దాన్ని రాసుకున్నాకే జుట్టుకు వేడి పరికరాలు, డ్రైయర్లు వాడాలి.
6. మాడుకు మరీ దగ్గరగా డ్రైయర్ వాడటం
హడావుడిగా ఉన్నప్పుడు జుట్టు తొందరగా ఆరిపోవాలని, మరీ దగ్గరగా డ్రైయర్ పెట్టి వాడుతుంటాం. దానివల్ల జుట్టు తొందరగా ఆరిపోవచ్చు కానీ, మాడు ఆరోగ్యం, జుట్టు ఆరోగ్యం దెబ్బతింటుంది.
7. రోజులో పలుమార్లు వాడటం
రోజుకు ఒక్కసారి కన్నా ఎక్కువగా డ్రైయర్ వాడటం హానికరం. జుట్టు వేడి వల్ల జరిగిన హాని నుంచి మరమ్మతు అయ్యేలోపే మరోసారి జుట్టుకు వేడి ఉపయోగిస్తే జుట్టు ఆరోగ్యం పూర్తిగా దెబ్బతింటుంది.