Green Channel Traffic: తప్పెవరిది? గ్రీన్ ఛానల్ చిక్కులు.. ట్రాఫిక్ సిఐపై వేటు..
Green Channel Traffic: డీజీపీ కాన్వాయ్ కోసం సాధారణ వాహనాలను నిలిపి వేసిన ఘటనలో విజయవాడలో ట్రాఫిక్ సిఐపై వేటు పడింది.
Green Channel Traffic: ఉన్నతాధికారుల మెప్పు కోసం కింది స్థాయి అధికారులు తీసుకునే నిర్ణయాలకు ఓ ట్రాఫిక్ సిఐ బలయ్యారు. విజయవాడలో గత కొన్నేళ్లుగా ప్రజలకు గ్రీన్ ఛానల్ ట్రాఫిక్ నిబంధనలు చుక్కలు చూపిస్తున్నాయి. వివిఐపి మూమెంట్ పేరుతో సాధారణ ప్రజలకు ట్రాఫిక్ ఆంక్షలు నిత్యం నరకం చూపిస్తున్నాయి.
ముఖ్యమంత్రి, గవర్నర్ వంటి ప్రముఖులతో పాటు మంత్రులు కూడా భారీ కాన్వాయ్‌లతో జనానికి విసుగు తెప్పిస్తున్నారు. ఏపీ డీజీపీగా గౌతమ్ సవాంగ్ ఉన్నప్పటి నుంచి ఆయన కాన్వాయ్‌కు గ్రీన్ ఛానల్ ప్రోటోకాల్ కల్పిస్తున్నారు. డీజీపీ మారిన తర్వాత కూడా ఈ ఆనవాయితీ కొనసాగిస్తుండటంతో జనం అల్లాడి పోతున్నారు. డీజీపీ అధికారిక నివాసం విజయవాడలో ఉంటుంది. ఆయన కార్యాలయం మంగళగిరిలో ఉంటుంది.
ప్రతి రోజు ఉదయం పది గంటలకు డీజీపీ కాన్వాయ్‌లో ఐదారు వాహనాలు ఇంటి నుంచి బయల్దేరగానే రోడ్లపై ట్రాఫిక్ నిలిపివేస్తారు. నగర రోడ్లతో పాటు జాతీయ రహదారి మీద కూడా వాహనాలను నిలిపివేయడం పోలీసులకు అలవాటుగా మారింది. ఎన్ని విమర్శలు వచ్చినా ఈ విషయంలో పోలీసులు ఏ మాత్రం పట్టనట్టు కొన్నేళ్లుగా వ్యవహరిస్తున్నారు.
డీజీపీ ఉదయం ఇంటి నుంచి కార్యాలయానిక వెళ్లే సమయంలో, తిరిగి ఇంటికి వచ్చే సమయంలో, ముఖ్యమైన పనులు ఉన్నపుడు తాడేపల్లిలో సిఎం నివాసానికి వెళ్లే సమయంలో రోడ్లపై సాధారణ జనం వెళ్లకూడదు అన్నట్లు పోలీసులు వ్యవహరిస్తున్నారు. ఉదయం స్కూళ్లు, కార్యాలయాలకు వెళ్లే ఉద్యోగులు, విద్యార్ధులు ట్రాఫిక్‌లో చిక్కుకుపోయి ఇబ్బందులకు గురవుతున్నా పోలీసులు ఏ మాత్రం ఖాతరు చేయలేదు.
ఈ క్రమంలో ఇటీవల నగరంలో వివిఐపిల రాకపోకల సందర్బంగా డీజీపీ కాన్వాయ్ కొద్దిసేపు ట్రాఫిక్‌లో చిక్కుకు పోవడంతో కొందరు పోలీసుల్ని బాధ్యుల్ని చేసి వారిపై వేటు వేశారు. అసలు డీజీపీ కాన్వాయ్ కోసం ట్రాఫిక్ ఆపడంతోనే జనం ఇబ్బందులకు గురవుతున్నారనే సంగతి మాత్రం విస్మరిస్తున్నారు.
కింది స్థాయి అధికారి బలి…
ఈ క్రమంలోనే 2 ట్రాఫిక్ సిఐ క్రిస్టోఫర్ విధుల్లో నిర్లక్ష్యం వహించినందుకు ఏలూరు రేంజికి బదిలీ చేసినట్లు విజయవాడ సీపీ కాంతిరాణా తాతా ప్రకటించారు. విజయవాడ నగరంలో ప్రముఖుల పర్యటనల సందర్భముగా ప్రజలకు, వాహనదారులకు ఏ విధమైన అసౌకర్యము కలుగకుండా ట్రాఫిక్ నియంత్రిస్తున్నట్లు ప్రకటించారు.
ప్రముఖ వ్యక్తులు వచ్చినపుడు, ఉన్నతాధికారులు వెళ్ళుచున్నప్పుడు మాత్రము జంక్షన్ల వద్ద ట్రాఫిక్ క్రమబద్దీకరిస్తున్నట్లు తెలిపారు. ట్రాఫిక్ క్లియర్ చేసే విషయంలో సిబ్బందికి పలుమార్లు సూచనలు ఇచ్చారని తెలిపారు.
డి.జి.పి. రాజేంద్రనాథ్ రెడ్డి సైతం ట్రాఫిక్ ఆపి ప్రజలకు అసౌకర్యం కలిగించొద్దని పలు సూచనలు చేసినారు.బందరు రోడ్డులో ఎక్కువ సమయం ట్రాఫిక్ నిలిపి ప్రజలకు అసౌకర్యం కలుగ చేస్తున్నందున సదరు సి.ఐ. కే.క్రిస్టోఫర్‌ను 2వ ట్రాఫిక్ పిఎస్ నుండి బదిలీ చేసి ఏలూరు రేంజి కార్యాలయానికి పంపినట్లు ప్రకటించారు.
నగరంలో ప్రముఖుల పర్యటన సందర్భముగా ఎక్కువ సమయం ట్రాఫిక్ నిలిపి ప్రజలకు అసౌకర్యము కలిగించవద్దని సీపీ కాంతి రాణా తాతా ట్రాఫిక్ అధికారులకు సూచించారు. పోలీస్ శాఖలో దిగువ స్థాయి అధికారులు మాత్రం తమపై చర్యలు తీసుకోవడాన్ని తప్పు పడుతున్నారు. విఐపిలకు, ఉన్నతాధికారులకు గ్రీన్ ఛానల్ ఇవ్వాలని ఆదేశాలు ఇచ్చే వారే కింది స్థాయి వారిని బలి చేస్తున్నారని అక్రోశం వ్యక్తం చేస్తున్నారు.