Varadhi traffic: వారధిపై న్యాయమూర్తి నదీ పూజలు, నిలిచిన ట్రాఫిక్
Varadhi traffic: కృష్ణానదికి పూజలు నిర్వహించడానికి వారధిపై న్యాయమూర్తి కాన్వాయ్ వాహనాలు నిలపడంతో ట్రాఫిక్ నిలిచిన ఘటన విజయవాడలో జరిగింది. ఏపీ హైకోర్టు న్యాయమూర్తి నదికి పూజలు చేయడానికి వారధిపై వాహనాలను నిలపడంతో ట్రాఫిక్ అంతరాయం కలిగింది.
Varadhi traffic: విజయవాడలో అత్యంత రద్దీగా ఉండే వారధి మార్గంలో కృష్ణా నదికి పూజలు నిర్వహించడం కోసం హైకోర్టు న్యాయమూర్తి ఒకరు వాహనాలను నిలపడంతో శుక్రవారం ఉదయం ట్రాఫిక్ సమస్యలు తలెత్తాయి. ఏపీ హైకోర్టు న్యాయమూర్తి ఒకరు కృష్ణా నదికి పూజలు చేయడానికి కృష్ణా వారధిపై వాహనాలను నిలిపారు.
దీంతో తాడేపల్లి నుంచి విజయవాడ వచ్చే వంతెనపై నిత్యం ట్రాఫిక్ రద్దీ ఉంటుంది. ఈ మార్గంలో వాహనాలు ఏ మాత్రం వేగం తగ్గించినా వెనుక వచ్చే వాహనాలు బారులు తీరుతాయి. రెండు వరుసల్లో ఉండే వంతెనపై ఎలాంటి ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా విజయవాడ, గుంటూరు జిల్లాల పోలీసులు పదుల సంఖ్యలో వారధి మీద విధుల్లో ఉంటారు.
ప్రతి నిమిషం వందలాది వాహనాలు గుంటూరు జిల్లా నుంచి విజయవాడలోకి ప్రవేశిస్తుంటారు. ఉదయం 8 నుంచి 10.30లోపు ఈ రద్దీ మరింత ఎక్కువగా ఉంటుంది. పీక్ అవర్స్‌లో ట్రాఫిక్ బ్లాక్ కాకుండా పోలీసులు నిత్యం శ్రమిస్తుంటారు. వారధి సామర్ధ్యానికి మించి ట్రాఫిక్ ఉండటంతో వాహనాలను ఏ మాత్రం ఆగకుండా కాపలా కాస్తుంటారు. విఐపిలు కూడా ఇదే మార్గంలో విజయవాడకు రావాల్సి ఉండటంతో వారధి మీద విధుల నిర్వహణ పోలీసులకు కత్తిమీద సాములా ఉంటుంది.
శుక్రవారం ఉదయం 10.40 ప్రాంతంలో వారధి మధ్యలో ఐదారు కార్లు, హైకోర్టు న్యాయమూర్తి అధికారిక వాహనం, ఓ ట్రావెల్స్ బస్సు వారధి మధ్యలో నిలిపారు. దీంతో ఆ మార్గంలో వచ్చే వాహనాలు మొత్తం నెమ్మదిగా ముందుకు కదలాల్సి వచ్చింది. పోలీస్ ఎస్కార్ట్ వాహనాలతో కలిపి దాదాపు పది వాహనాలను వారధిపై నిలపడంతో ఆ మార్గంలో ప్రయాణించే భారీ రవాణా వాహనాలు, ఆర్టీసీ బస్సులు, ద్విచక్రవాహనాలు, కార్లు వారధి మీద మెల్లగా ప్రయాణించాల్సి వచ్చింది. సాధారణంగా రోడ్డు ప్రమాదాలు జరిగిన సమయాల్లో మాత్రమే వారధిపై ట్రాఫిక్ బ్లాక్ అవుతుంటుంది. వాటిని వెంటనే తొలగించడానికి వారధికి రెండు వైపులా పోలీసులు భారీ క్రేన్లను అందుబాటులో ఉంచుతారు.
శుక్రవారం న్యాయమూర్తి నదికి మొక్కులు తీర్చుకునే క్రమంలో పూజలు చేయడం కోసం వాహనాలు నిలిపారు. దీంతో ట్రాఫిక్ నిలిచిపోవడంతో జనం ఉసూరుమంటూ వెళ్లాల్సి వచ్చింది. హైదరాబాద్‌లో శుక్రవారం సాయంత్రం జరిగే శుభకార్యం కోసం బంధుమిత్ర పరివారంతో కలిసి వెళుతున్న న్యాయమూర్తి కుటుంబం నదికి మొక్కులు తీర్చుకోడానికి ఆ మార్గంలో ఆగినట్లు పోలీసులు తెలిపారు. కృష్ణానదికి మొక్కులు చెల్లించుకోడానికి ప్రకాశం బ్యారేజీ వద్ద ఘాట్‌లతో పాటు హైదరాబాద్ మార్గంలో ఇబ్రహీంపట్నం వద్ద కూడా అవకాశం ఉంటుంది.
ట్రాఫిక్ అంతరాయం లేకుండా నదికి మొక్కులు చెల్లించుకునే వీలున్నా రోడ్డు మధ్యలో జనాలకు ఇబ్బంది కలిగేలా వాహనాలను నిలిపి మొక్కులు చెల్లించుకోవడంపై నిట్టూర్చడం తప్ప ఏమి చేయలేని పరిస్థితి. విజయవాడ, గుంటూరు నగరాల మధ్య ప్రయాణించే పోలీస్ ఉన్నతాధికారులు కూడా ఇలాగే వ్యవహరిస్తుంటారు. తాము ప్రయాణించే సమయంలో ట్రాఫిక్ మొత్తం నిలిపి వేసి, జనం ఇబ్బంది పడతారని ఏ మాత్రం ఆలోచించకుండా వ్యవహరిస్తుంటారు.