AP Rain Alert : తరుముకొస్తున్న వాయుగుండం.. కంటతడి పెట్టిస్తున్న రైతుల కష్టాలు-farmers worried as heavy rain forecast for ap ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Ap Rain Alert : తరుముకొస్తున్న వాయుగుండం.. కంటతడి పెట్టిస్తున్న రైతుల కష్టాలు

AP Rain Alert : తరుముకొస్తున్న వాయుగుండం.. కంటతడి పెట్టిస్తున్న రైతుల కష్టాలు

Basani Shiva Kumar HT Telugu
Nov 26, 2024 12:33 PM IST

AP Rain Alert : ఓవైపు పంటలు చేతికొచ్చాయి. వరికోతలు ప్రారంభం అయ్యాయి. మరోవైపు వాయుగుండం తరుముకొస్తుంది. దీంతో అన్నదాత తీవ్ర ఆందోళన చెందుతున్నాడు. పంటలను కాపాడుకోవడానికి నానాతంటాలు పడుతున్నాడు. ముఖ్యంగా తీరప్రాంతాల రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

రైతుల కష్టాలు
రైతుల కష్టాలు

బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ఏపీ రైతులను కంటతడి పెట్టిస్తోంది. వరి పంట చేతికొచ్చే సమయంలో వర్షాలు కురిస్తే.. పంటలు పాడవుతాయని అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. వాయుగుండం ప్రభావంతో 27, 28 నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. దీంతో రైతుల్లో ఆందోళన మరింత పెరిగింది. పంటను కాపాడుకోవడానికి అన్నదాతలు కష్టాలు పడుతున్నారు.

CTA icon
మీ నగరంలో వాతావరణం తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి

ఇదే అదనుగా..

ఓవైపు వాయుగుండం ముంచుకొస్తున్న తరుణంలో.. వరికోత యంత్రాలకు డిమాండ్ ఎర్పడింది. యంత్రాల యజమానులు కూడా రైతలనుంచి డబ్బులు దోచేస్తున్నారు. సాధారణంగా గంటకు రూ.3 నుంచి రూ.4వేల వరకు ఉంటుంది. ఇప్పుడు రూ.5వేల వరకూ వసూలు చేస్తున్నారని రైతులు చెబుతున్నారు. చేసేదేంలేక.. పంటను కాపాడుకోవడానికి ఎక్కువ డబ్బులు ఇచ్చి వరి కోపిస్తున్నామని చెబుతున్నారు.

యంత్రాలతో వరికోయించి.. ధాన్యాన్ని ట్రాక్టర్లలో పొలాల నుంచి బయటకు తరలిస్తున్నారు. రోడ్డు వెంబడి, దారి ఉన్న పొలాల్లో ధాన్యం సులువుగా బయటకు వస్తోంది. కానీ.. బురదమయంగా ఉన్న పొలాల్లో ధాన్యం మాత్రం అక్కడే ఉంటోంది. దీంతో ఆ రైతులు ఆందోళన చెందుతున్నారు. కల్లాల్లోనే వడ్లను రాశులుగా పోసి.. పరదాలు కప్పే ప్రయత్నాలు చేస్తున్నారు.

పూర్తిగా కొనుగోళ్ల ఎక్కడ..

ప్రస్తుతం ఇంకా కొనుగోళ్లు పూర్తిగా ప్రారంభం కాలేదు. మరోవైపు వర్షం నుంచి కాపాడుకునే పరిస్థితి లేదు. దీంతో రైతులు ధాన్యాన్ని అడ్డగోలుగా అమ్మేస్తున్నారు. తేమ శాతం ఎక్కువగా ఉన్న కారణంగా 75 కేజీల బస్తాను రైతుల నుంచి రూ.1400 నుంచి రూ.1450 ధరకు వ్యాపారులు కొనుగోలు చేస్తున్నారు. గతేడాది మిగ్‌జాం తుపాన్‌ కారణంగా.. డిసెంబరు 3, 4వ తేదీల్లో భారీ వర్షాలు కురిశాయి. అప్పుడు రైతులు నష్టపోయారు. ఇప్పుడు అదే భయంతో తక్కువ డబ్బులకు అమ్మెస్తున్నారు.

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలపడి వాయుగుండంగా మారింది. తూర్పు హిందూ మహాసముద్రంపై తీవ్ర అల్పపీడనం పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ.. దక్షిణ బంగాళాఖాతం, దానిని ఆనుకుని ఉన్న తూర్పు హిందూ మహా సముద్రం మధ్య భాగాలపై వాయుగుండంగా రూపాంతరం చెందింది.

దక్షిణ బంగాళాఖాతం, తూర్పు హిందూ మహాసముద్రం మధ్య భాగాల్లో కేంద్రీకృతమైన వాయుగుండం, గంటకు 30కిమీ వేగంతో కదులుతోంది. వాయుగుండం ప్రస్తుతానికి ట్రింకోమలీకి ఆగ్నేయంగా 530 కిమీ, నాగపట్నానికి 810 కిమీ, పుదుచ్చేరికి 920 కిమీ, చెన్నైకి ఆగ్నేయంగా 1000 కిమీ దూరంలో కేంద్రీకృతమైంది. 2 రోజుల్లో వాయువ్య దిశగా తమిళనాడు- శ్రీలంక తీరాల వైపు వెళ్లే అవకాశం ఉంది. దీని ప్రభావంతో శుక్రవారం వరకు దక్షిణకోస్తా, రాయలసీమలో కొన్నిచోట్ల పిడుగులతో కూడిన తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు, దక్షిణకోస్తాలో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసేందుకు అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది.

Whats_app_banner