Traffic Restrictions నిఘా వర్గాల హెచ్చరికల మాటేమిటో కానీ ఏపీ పోలీసుల వ్యవహార శైలి మాత్రం సామాన్య ప్రజానీకానికి నిత్యం నరకం చూపిస్తుంది. ముందస్తు ప్రకటనలు, సమాచారం ఇవ్వకుండానే దారి మళ్లింపు, ట్రాఫిక్ నిలిపివేతలతో జనాన్ని ముప్పతిప్పలు పెడుతుంటారు. ముఖ్యమంత్రి మొదలుకుని డిజిపి, ఇతర వివిఐపిల ప్రోటోెకాల్‌తో విజయవాడ-తాడేపల్లి మధ్య ప్రజలకు రోజు చిక్కులు సాధారణం అయిపోయాయి. ఇక న్యాయమూర్తులతో పాటు గవర్నర్ వంటి వారు ప్రయాణించే సమయంలో కూడా సాధారణ ప్రజానీకానికి సమస్యలు తప్పవు. గ్రీన్ ఛానల్ పేరుతో ట్రాఫిక్ నిలిపివేయడం, ప్రజలు తిట్టుకుంటూ వేచి ఉండటం సాధారణం అయిపోయింది.
ట్రాఫిక్ ఆంక్షల కారణంగా ప్రజలకు ఎదురవుతున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ముఖ్యమంత్రి ప్రజల్ని ఇబ్బంది పెట్టొద్దని పలుమార్లు పోలీస్ ఉన్నతాధికారులకు సూచిస్తున్న వారి వైఖరిలో మాత్రం లేదు. ప్రభుత్వ కార్యాలయాలను విపక్షలు ముట్టడించడానికి పిలుపునిస్తే ఎలాంటి ప్రకటన లేకుండా ట్రాఫిక్ మళ్లింపు నిర్ణయిస్తారు. పొరపాటున ఎవైనా సంఘాలు చలో తాడేపల్లి అంటూ సిఎం నివాసం ఉన్న ప్రాంతంలో ఆందోళనకు పిలుపునిస్తే ఆ రోజు చుట్టు పక్కల వ్యాపారాలు మూతబడాల్సిందే.
తాజాగా ఎస్సీ సంక్షేమ పథకాలను పునరుద్ధరించాలని టీడీపీ, దళిత సంఘాలు ఆందోళనకు పిలుపునివ్వడంతో జాతీయ రహదారిపై ట్రాఫిక్ మళ్లించారు. దీంతో కృష్ణా వారధి మొదలుకుని చెన్నై వైపు వెళ్లే మార్గంలో వాహనాలు నిలిచిపోయాయి. సాంఘిక సంక్షేమ శాఖ కమిషనర్ కార్యాలయాన్ని ముట్టడించేందుకు పిలుపునివ్వడంతో జాతీయ రహదారిపై ముళ్ల కంచెలు వేసి ట్రాఫిక్ నిలిపివేశారు.
తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో ఉన్న ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్లే ఉద్యోగులు ఎటు వెళ్లాలో అర్థం కాక వాహనాలను నిలపడంతో కృష్ణానది వంతెనపై వాహనాలు బారులు తీరాయి. గంటల తరబడి ఈ తతంతం కొనసాగింది. ముందస్తు ఏర్పాట్లు, ప్రకటనలు లేకుండా పోలీసులు అప్పటికప్పుడు ట్రాఫిక్ మళ్లించడంపై ప్రజల్లో ఆగ్రహం వ్యక్తమవుతున్నా పోలీసులు పట్టనట్టు వ్యవహరిస్తున్నారు.
ముఖ్యమంత్రి నివాసం ఉన్న ప్రాంతాన్ని హైసెక్యూరిటీ జోన్‌గా పరిగణించి అక్కడ ఆంక్షలు అమలు చేస్తే అర్థమున్నా, కిలోమీటర్ దూరంలో కూడా ముళ్ల కంచెలు వేసి ట్రాఫిక్‌ను అడ్డుకోవడంపై ప్రజల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. వివిఐపిలు ఇళ్ల నుంచి బయటకు రాకపోతేనే తాము ప్రశాంతంగా బతుకుతామనే భావన సాధారణ ప్రజల్లో పెరుగుతోంది. ముఖ్యమంత్రి పర్యటనల్లో పరదాలు కట్టడం, సిఎం ఇంటి నుంచి బయటరావడానికి గంట ముందే ఆంక్షలు విధించడం వంటి చర్యలు ప్రజల్లో వ్యతిరేకత పెంచుతాయని నిఘా అధికారులు గుర్తించలేకపోతున్నారు.
గతంలో ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ఉన్న సమయంలో కూడా మితిమీరిన ట్రాఫిక్ ఆంక్షల వల్ల సాధారణ ప్రజానీకంలో వ్యతిరేకత పెరగడానికి కారణమైందని విస్మరిస్తున్నారు. భద్రత పేరుతో పోలీసుల అతి చేష్టలతో అసలుకే మోసం వస్తుందని గుర్తించలేకపోతున్నారు. ఏ నిబంధనల ప్రకారం వివిఐపిలు వెళ్లే సమయంలో సాధారణ ప్రజానీకాన్ని అడ్డుకుంటున్నారని ప్రశ్నిస్తే మాత్రం పోలీస్ బాస్‌ల నుంచి సమాధానం దొరకదు. సోషల్ మీడియాను ప్రచారం కోసం విపరీతంగా వాడుకునే ఏపీ పోలీస్ శాఖ ట్రాఫిక్ ఆంక్షల గురించి మాత్రం పట్టించుకోదు. ఎప్పుడు ఎక్కడ ట్రాఫిక్ మళ్లిస్తారో, ఎందుకు మళ్లిస్తున్నారో, ప్రత్యామ్నయ మార్గాలు ఏమిటో మాత్రం చెప్పరు. హైదరాబాద్ పోలీసులు ఈ విషయంలో చాలా మెరుగ్గా వ్యవహరించడం గమనార్హం.
టాపిక్