Heavy Rains in Khammam : ఖమ్మంలో ఎడతెరపిలేని వాన - భద్రాచలం వద్ద 30 అడుగులు దాటిన గోదావరి
Heavy Rains in Khammam : ఖమ్మం జిల్లాలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఎడతెరపి లేకుండా కురుస్తున్న వానలకు వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం క్రమంగా పెరిగిపోతోంది.
Heavy Rains in Khammam : బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారడంతో ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. గడిచిన రెండు రోజులుగా ఎడతెరపి లేకుండా కురుస్తున్న వానలకు వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి.
ఇప్పటికే పెద్దవాగు ప్రాజెక్టుకు భారీగా వరద నీరు పోటెత్తడంతో గండిపడి దిగువన ఉన్న ప్రాంతాలు నీట మునిగాయి. దీంతో 4 వేల కుటుంబాలను అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలించారు. కాగా భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం క్రమక్రమంగా పెరుగుతుంది.
మహారాష్ట్ర, చత్తీస్గడ్ రాష్ట్రాల్లో కురుస్తున్న వర్షాలకు భద్రాచలం వద్ద గోదావరి ప్రవాహం ఉదృత రూపం దాలుస్తోంది. ప్రస్తుతం 30.5 అడుగుల కు నీటిమట్టం చేరింది. మరో మూడు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశాలు ఉండడంతో గోదావరి నీటిమట్టం మరింతగా పెరిగే అవకాశాలు ఉన్నాయని సిడబ్ల్యుసి అధికారులు హెచ్చరిస్తున్నారు. 2
022లో భద్రాచలం వద్ద గోదావరి ఉగ్రరూపం దాల్చి అల్లకల్లోలం సృష్టించింది. తాజాగా అదే స్థాయికి గోదావరి పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. నిన్న సాయంత్రం 26 అడుగుల మేరకు చేరిన నీటిమట్టం ఉదయానికి అమాంతం 30 అడుగులు దాటింది. 43 అడుగులు దాటితే మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేసే అవకాశం ఉంది. గోదావరి మరింతగా పెరిగితే తీసుకోవాల్సిన చర్యలపై జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్, జిల్లా ఎస్పీ రోహిత్ రాజు అధికారులతో సమీక్షిస్తున్నారు.
గోదావరి పరివాహక ప్రాంత మండలాల్లో ప్రజలను ఇప్పటికే అప్రమత్తం చేశారు. ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలని హెచ్చరికలు జారీ చేశారు. మరోవైపు తాలిపేరు ప్రాజెక్టుకు కూడా భారీగా వరద పోటెద్దుతోంది. 20 గేట్లను ఇప్పటికే పైకెత్తి వరద నీటిని దిగువ ప్రాంతానికి వదులుతున్నారు. ఈ ప్రాజెక్టు సామర్ధ్యం 72 అడుగులు కాగా ఇప్పటికే 70 అడుగులకు నీరు చేరింది. దీంతో గేట్లను ఎట్టాల్సిన అనివార్య పరిస్థితి ఏర్పడింది.
కిన్నెరసానికీ వరద..
భారీ వర్షాల కారణంగా కిన్నెరసాని రిజర్వాయర్ లోకి భారీగా వరద నీరు చేరుతుండడంతో అక్కడ ప్రస్తుత పరిస్థితిని జిల్లా ఎస్పీ రోహిత్ రాజు పరిశీలించారు. అధికారులను ప్రాజెక్ట్ ఇన్ ఫ్లో, అవుట్ ఫ్లో, స్టోరేజ్ తదితర వివరాలను అడిగి తెలుసుకున్నారు.
అనంతరం కిన్నెరసాని నది పరివాహక లోతట్టు ప్రాంతాలను సందర్శించారు. రాబోయే రెండు రోజులు కూడా భారీ వర్షాలు ఉన్న నేపథ్యంలో లోతట్టు ప్రాంత ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని ఈ సందర్బంగా కోరారు. పాల్వంచ రూరల్ పోలీస్ స్టేషన్ అధికారులు, సిబ్బంది నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండాలని సూచించారు.
కిన్నెరసాని నది గేట్లు ఓపెన్ చేసే సమయాల్లో లోతట్టు ప్రాంత ప్రజలను అప్రమత్తం చేస్తూ ఉండాలని సూచించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రజలకు అందుబాటులో ఉండాలని తెలిపారు. పోలీస్ స్టేషన్ పరిధిలోని ప్రతి గ్రామం నుంచి ఎప్పటికప్పుడు పరిస్థితిని గురించి సమాచారాన్ని సేకరించి అవసరమైతే అక్కడికి చేరుకొని ప్రజలకు అండగా ఉండాలని తెలియజేసారు. అనంతరం రాజాపురం, యానాంబైలు గ్రామాల మధ్యలో నిర్మాణంలో ఉన్న బ్రిడ్జ్ ను ఆయన సందర్శించారు.
రిపోర్టింగ్ - కాపర్తి నరేంద్ర, ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రతినిధి.