AP Rains : ఏపీపై అల్పపీడనం ఎఫెక్ట్, రేపు ఈ జిల్లాల్లో మోస్తరు వర్షాలు-amaravati depression effect on andhra pradesh rains forecast in many districts says apsdma ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Ap Rains : ఏపీపై అల్పపీడనం ఎఫెక్ట్, రేపు ఈ జిల్లాల్లో మోస్తరు వర్షాలు

AP Rains : ఏపీపై అల్పపీడనం ఎఫెక్ట్, రేపు ఈ జిల్లాల్లో మోస్తరు వర్షాలు

Bandaru Satyaprasad HT Telugu
Jul 20, 2024 08:40 PM IST

AP Rains : అల్పపీడనం ప్రభావంతో ఏపీలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. మరో మూడు రోజులు వర్షాల కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తుంది. తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.

ఏపీపై అల్పపీడనం ఎఫెక్ట్, రేపు ఈ జిల్లాల్లో మోస్తరు వర్షాలు
ఏపీపై అల్పపీడనం ఎఫెక్ట్, రేపు ఈ జిల్లాల్లో మోస్తరు వర్షాలు

AP Rains : ఏపీలో గత రెండు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం... అల్పపీడనంగా బలహీనపడింది. ఇవాళ సాయంత్రం 5.30 గంటల సమయంలో ఒడిశా తీరప్రాంతంపై అల్పపీడనం బాగా బలహీనపడిందని వాతావరణ శాఖ తెలిపింది. ఒడిశా, ఛత్తీస్‌గఢ్ మీదుగా మరింత వాయువ్య దిశలో కదులుతూ...మరో 24 గంటల్లో అల్పపీడనం క్రమంగా బలహీనపడుతుందని పేర్కొంది. వాయుగుండం ప్రభావంతో ఏపీలో మరో మూడు రోజులు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం అంచనా వేసింది.

రేపు ఈ జిల్లాల్లో వర్షాలు

రేపు(ఆదివారం) పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, కర్నూలు, నంద్యాల జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ రోణంకి కూర్మనాథ్ తెలిపారు. అలాగే శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, నెల్లూరు, అనంతపురం, శ్రీసత్యసాయి, వైయస్ఆర్, అన్నమయ్య జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు.

సిద్ధంగా ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు

ఎగువ నుంచి వస్తున్న వరద, భారీవర్షాల నేపథ్యంలో గోదావరికి వరద ప్రవాహం చేరుతున్నందున ముందస్తుగా ప్రభావితం చూపే జిల్లాల అధికారులను అప్రమత్తం చేసినట్లు తెలిపారు. సీఎం చంద్రబాబు ఆదేశాలతో రాష్ట్రంలో భారీ వర్షాలు, వరద ప్రభావిత జిల్లాలకు రెస్క్యూ, రిలీఫ్ ఆపరేషన్స్ కు మొత్తంగా రూ.21.5 కోట్ల నిధులు మంజూరు చేసినట్లు తెలిపారు. ఎప్పటికప్పుడు వరద ప్రవాహాన్ని పర్యవేక్షిస్తూ అధికారులకు తీసుకోవాల్సిన చర్యలపై సూచనలు ఇస్తున్నామని, వరద ఉద్ధృతి ప్రభావం చూపే జిల్లాల అధికారులతో సమన్వయ చేసుకుని సహాయక చర్యలకు మూడు ఎన్డీఆర్ఎఫ్ ( 1కోనసీమ, 1తూర్పుగోదావరి, 1అల్లూరి), మూడు ఎస్డీఆర్ఎఫ్ (2ఏలూరు, 1 అల్లూరి) బృందాలు పంపినట్లు తెలిపారు.

ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

సహాయక బృందాలు ఓబియమ్ బోట్స్, లైఫ్ బాయ్స్, లైఫ్ జాకెట్స్, రోప్స్, ఆస్కా లైట్ ఇతర రక్షణ పరికరాలతో సిద్ధంగా ఉన్నాయన్నారు. గోదావరి పరీవాహక ప్రాంత ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. సహాయక చర్యల్లో అధికారులకు సహకరించాలని, బోట్లు, మోటర్ బోట్లు, స్టీమర్లలతో నదిలో ప్రయాణించడం, వరద నీటిలో ఈతకు వెళ్లడం, చేపలు పట్టడం, స్నానాలకు వెళ్లడం చేయవద్దని సూచించారు. లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

రైతన్నలకు అపారనష్టం

వాయుగుండం ప్రభావంతో శనివారం ఏపీలోని పలు జిల్లాల్లో చాలా చోట్ల తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిశాయని వాతావరణశాఖ తెలిపింది. ఒకట్రెండు చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిశాయని పేర్కొంది. ఉమ్మడి గోదావరి జిల్లాల పాటు విశాఖ, శ్రీకాకుళం జిల్లాల్లో భారీ వర్షాలకు ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఏజెన్సీ ప్రాంతాల్లో కొండ వాగులు పొంగుతున్నాయి. వేల ఎకరాల్లో పంట నష్టం వాటిల్లిందని రైతులు వాపోతున్నారు. లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. ముంపు ప్రాంతాల్లోని ప్రజలను అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. గోదావరి నుంచి 4 లక్షల క్యూసెక్కులకు పైగా వరద నీటిని సముద్రంలోకి వదిలేస్తున్నారు. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో భారీ వర్షాలతో వేల ఎకరాల్లో నాట్లు నీటమునిగాయి.

Whats_app_banner

సంబంధిత కథనం