Bhadrachalam Flood: భద్రాచలం వద్ద మళ్లీ పెరిగిన గోదావరి వరద ప్రవాహం, కొనసాగుతున్న ఒకటో నంబర్ హెచ్చరిక-the flood flow of godavari which has receded at bhadrachalam is likely to increase again ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Bhadrachalam Flood: భద్రాచలం వద్ద మళ్లీ పెరిగిన గోదావరి వరద ప్రవాహం, కొనసాగుతున్న ఒకటో నంబర్ హెచ్చరిక

Bhadrachalam Flood: భద్రాచలం వద్ద మళ్లీ పెరిగిన గోదావరి వరద ప్రవాహం, కొనసాగుతున్న ఒకటో నంబర్ హెచ్చరిక

HT Telugu Desk HT Telugu

Bhadrachalam Flood: భద్రాద్రి వద్ద గోదావరి నీటి మట్టం 47.25 అడుగులకు చేరింది. ప్రస్తుతం గోదావరి వరద ప్రవాహం తగ్గుముఖం పట్టినా మళ్లీ పెరిగే అవకాశాలు ఉన్నాయని అధికారులు చెబుతున్నారు.

భద్రాచలంలో మళ్లీ పెరుగుతున్న గోదావరి వరద ప్రవాహం

Bhadrachalam Flood: మూడ్రోజుల పాటు ఉగ్ర రూపం చూపించి మెల్లగా శాంతించిన గోదావరి మళ్లీ పరవళ్లు తొక్కుతోంది. భద్రాచలం వద్ద క్రమంగా మళ్లీ నీటి మట్టం పెరుగుతోంది. బుధవారం ఉధృతి తగ్గి 46.4 అడుగులకు చేరుకోవడంతో అధికారులు రెండో ప్రమాద హెచ్చరికను ఉపసంహరించుకున్నారు.

మొదటి ప్రమాద హెచ్చరిక మాత్రమే కొనసాగుతుండగా గురువారం ఉదయం నుంచి మళ్లీ వరద ఉధృతి ప్రారంభమైంది. క్రమంగా పెరుగుతూ ఉదయం 11 గంటల సమయానికి 47.5 అడుగులకు చేరుకుంది. ఈ నీటి మట్టం తిరిగి మరింత పెరిగే అవకాశం ఉందని సీ డబ్ల్యు సీ అధికారులు చెబుతున్నారు.

అధికారుల అంచనా ఆధారంగా ప్రస్తుత పరిస్థితిని గమనిస్తే 51 నుంచి 52 అడుగుల వరకు మళ్లీ గోదావరి వరద పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇదే జరిగితే మళ్లీ రెండో ప్రమాద హెచ్చరికను జారీ చేయాల్సి వస్తుంది. అయితే గోదావరి మళ్లీ పెరగడానికి కారణాలను విశ్లేషిస్తే.. లోయర్ కాళేశ్వరం( చత్తీస్గడ్ కురిసిన వర్షాలు)లో కురుస్తున్న వర్షాలే కారణంగా చెబుతున్నారు.

అలాగే మహారాష్ట్రలో కురిసిన భారీ వర్షాలకు గోదావరి పెరుగుతుందని కూడా విశ్లేషిస్తున్నారు. కానీ భద్రాచలం వద్ద పెరగడానికి గల కారణాలు లోయర్ కాలేశ్వరం ప్రాంతంలో కురిసిన వర్షాలేనని తెలుస్తోంది. మహారాష్ట్రలో పుట్టిన గోదావరి సముద్రంలో కలిసే సుమారు 1400 కిలోమీటర్ల ప్రాంతాన్ని తెలంగాణలోని కాలేశ్వరం ప్రాంతాన్ని మధ్య భాగంగా గుర్తించి రెండు భాగాలుగా విభజించారు.

అవి 1. అప్పర్ కాళేశ్వరం 2. లోయర్ కాలేశ్వరం. అప్పర్ కాలేశ్వరం ప్రాంతంలో అనేక ప్రాజెక్టులు ఉండటం వల్ల మహారాష్ట్రలో, మహారాష్ట్రకు దిగువన కాలేశ్వరం వరకు వర్షాలు కురిసినా ప్రాజెక్టులు అన్ని నిండిన తర్వాతే వరద నీటిని లోయర్ కాళేశ్వరానికి విడుదల చేస్తారు. కానీ లోయర్ కాళేశ్వరం (కాలేశ్వరానికి దిగునున్న ప్రాంతంలో) వద్ద వర్షాలు కురిస్తే ఆ వరద నీరు సరాసరి గోదావరిలోకి వచ్చి చేరుతుంది.

కేవలం తాలిపేరు ప్రాజెక్టు మినహా గోదావరి నీటిని స్టాక్ చేసేందుకు పెద్దగా ప్రాజెక్టులు లేకపోవడంతో దిగువ కాళేశ్వరంలో కురిసిన వర్షాలకు సైతం గోదావరి వరద ప్రవాహం పెరిగే అవకాశం ఉంది. ఈ కారణంగా మళ్లీ వరద ఉధృతి పెరుగుతున్నట్లు అంచనా వేస్తున్నారు.

(రిపోర్టింగ్ - కాపర్తి నరేంద్ర, ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రతినిధి)