Manair River : గోదావరి గలగల, మానేరు వెలవెల - ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో విచిత్ర పరిస్థితి…!
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో విచిత్ర పరిస్థితి నెలకొంది. గోదావరి గలగల పారుతుంటే ఎగువన మానేరు వెలవెలబోతుంది. వర్షాకాలం ప్రారంభం నుంచి ఇప్పటివరకు అర టీఎంసీ నీళ్ళు కూడా లోయర్ మానేర్ డ్యామ్ కు చేరకపోగా, మిడ్ మానేర్ కు మాత్రం ఒక్క టీఎంసీ నీరు చేరింది.
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ప్రధాన నీటి వనరు మానేరు. మానేరు పై నిర్మించిన ఎగువ మానేర్, మధ్య మానేర్, లోయర్ మానేర్ డ్యామ్ ల్లో నీళ్లు ఉంటే ఉమ్మడి కరీంనగర్ జిల్లాకే కాదు పొరుగున ఉన్న వరంగల్, ఖమ్మం, సిద్దిపేట జిల్లాల్లో నీటి కష్టాలు తీరుతాయి. కానీ ప్రస్తుతం మానేర్ డ్యాముల్లో నీళ్లు లేని, ఆశించిన స్థాయిలో వర్షాలు లేక వరదరాని పరిస్థితి కనిపిస్తోంది. వర్షాకాలం ఆరంభం నుంచి అంటే జూన్ 1 నుంచి ఇప్పటి వరకు వర్షాల ఆధారంగా లోయర్ మానేర్ డ్యామ్ కు అర టీఎంసీ నీళ్లు రాగ, మిడ్ మానేర్ కు ఒక టీఎంసీ నీరు వచ్చి చేరింది.
ఇక అప్పర్ మానేర్ నర్మాల ప్రాజెక్టు కు మాత్రం వెయ్యి క్యూసెక్కుల నీరు కూడా రాని పరిస్థితి. దీంతో మానేర్ డ్యాములు వెలవెలబోగా, దిగువన ఉన్నటువంటి గోదావరిలో మాత్రం వరద ఉధృతి కొనసాగుతుంది.
ఇటీవల ఎగువన మహారాష్ట్ర ఆదిలాబాద్ జిల్లాలో కురిసిన భారీ వర్షాలతో గోదావరి వరద ప్రవాహం కొనసాగుతోంది. దీంతో శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టుకు భారీగా వరద నీరు వచ్చి చేరడంతో 20.175 టీఎంసీల నీటి నిలువ సామర్థ్యంగల ఎల్లంపల్లి ప్రాజెక్టు జలకళను సంతరించుకుంది. ప్రస్తుతం 15 టిఎంసీల నీళ్ళు ఉన్నాయి. ఇప్పటికే 9టిఎంసీల నీటిని మిడ్ మానేర్ కు ఎత్తిపోతల ద్వారా తరలించారు.
ఎల్లంపల్లి ప్రాజెక్టు దిగువన కాళేశ్వరం ప్రాజెక్టులలో భాగంగా గోదావరిపై నిర్మించిన సుందిళ్ళ వద్ద పార్వతి బ్యారేజ్, అన్నారం వద్ద సరస్వతి బ్యారేజ్ కి స్వల్పంగా వరద ఉండగా మేడిగడ్డ వద్ద లక్ష్మీ బ్యారేజ్ కి భారీగా వరద కొనసాగుతుంది. త్రివేణి సంగమం కాళేశ్వరం దిగున మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజ్ ఉండడంతో గోదావరి తో పాటు ప్రాణహిత నది నుంచి భారీగా వరద నీరు వచ్చి చేరుతుండడంతో మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజ్ అన్ని గేట్లు ఎత్తి రోజుకు ఎనిమిది లక్షలకు పైగా క్యూసెక్కుల నీటిని దిగువకు వృధాగా వదలతున్నారు.
మానేర్ కు ఎల్లంపల్లి ప్రాజెక్టే దిక్కు…
శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు కు పైనుంచి రోజుకు ఒక టీఎంసీ నీరు వచ్చి చేరుతుంది. దీంతో శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి రోజుకు ఒక టీఎంసీ నీటిని కాళేశ్వరం ప్రాజెక్టులోని నంది పంప్ హౌస్, గాయత్రి పంప్ హౌస్ ద్వారా మిడ్ మానేర్ కు నీటిని లిఫ్ట్ చేస్తున్నారు. శ్రీపాదఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి రోజుకు ఒక టీఎంసీ చొప్పున నీటిని లిఫ్ట్ చేస్తుండడంతో మిడ్ మానేర్ రిజర్వాయర్ జళకళను సంతరించుకుంది. 27.5 టీఎంసీల నీటి నిలువ సామర్థ్యం గల మిడ్ మానేర్ లో ప్రస్తుతం 15 టీఎంసీలకు నీరు చేరింది.
ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి నంది పంప్ హౌస్ ద్వారా 12,600 క్యూసెక్కుల నీటిని నాలుగు పంపుల ద్వారా ఎగువన ఉన్న గాయత్రి పంప్ హౌస్ కు తరలిస్తున్నారు. గాయిత్రి పంప్ హౌస్ లోని నాలుగు పంపుల ద్వారా 12,600 క్యూసెక్కుల నీటిని లిఫ్ట్ చేసి ఎస్సారెస్పీ వరద కాలువ ద్వారా మిడ్ మానేర్ కు తరలిస్తున్నారు. పది రోజుల నుంచి రోజుకు ఒక టీఎంసీ చొప్పున ఇప్పటివరకు మిడ్ మానేర్ కు ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి 10 టీఎంసీల నీటిని తరలించారు.
మరో ఐదు టీఎంసీల నీరు తరలించిన తర్వాత మిడ్ మానేర్ లో 20 టీఎంసీలకు నీరు చేరుకోగానే ఎడారిని తలపిస్తున్న ఎల్ఎండి కి మిడ్ మానేర్ నుంచి 10 టిఎంసీల నీటిని తరలించాలని నిర్ణయించారు. శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్ట్ నీటితో మిడ్ మానేర్, లోయర్ మానేర్ డ్యాంలను పూర్తిస్థాయిలో నింపి ఉమ్మడి కరీంనగర్, వరంగల్, ఖమ్మం, సిద్దిపేట జిల్లాల నీటి కష్టాలను తీర్చే పనిలో ప్రభుత్వం నిమగ్నమైంది.
ఎడారిని తలపిస్తున్న ఎల్ఎండి…
కరీంనగర్ సమీపంలోని లోయర్ మానేర్ డ్యామ్ ఎడారిని తలపిస్తుంది. 24 టీఎంసీల నీటి నిలువ సామర్థ్యం గల ఎల్ఎండి లో ప్రస్తుతం 5.36 టీఎంసీల నీరు మాత్రమే ఉంది. ఎగువన మోయతుమ్మెద వాగు నుంచి 206 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతుండగా అదే స్థాయిలో మంచినీటి కోసం 206 క్యూసెక్కుల నీటిని వినియోగిస్తున్నారు.
వర్షాకాలం ఆరంభం నుంచి ఇప్పటివరకు గడిచిన రెండు మాసాల్లో ఎల్ఎండికి వర్షాల ఆదారంగా అర టీఎంసీ నీళ్ళు కూడా రాని పరిస్థితి ఉంది. ప్రస్తుతం డ్యామ్ లో ఉన్న నీళ్లు కరీంనగర్ సిద్దిపేట జిల్లాలతో పాటు మానకొండూర్, హుస్నాబాద్ నియోజకవర్గ ప్రజలకు త్రాగునీటి అవసరాలకు కూడా సరిపోదు. ఇలాంటి పరిస్థితిలో ఎల్లంపల్లి నుంచి మిడ్ మానేర్ కు తరలిస్తున్న నీటిని ఎల్ఎండికి విడుదల చేయాలని స్థానికులు కోరుతున్నారు.
ఎల్లంపల్లి నుంచి నీటిని ఎత్తిపోస్తుండడంతో మిడ్ మానేర్ కు జలకళ సంతరించుకుంది. మిడ్ మానేర్ రిజర్వాయర్ లో సగానికి పైగా నీళ్లు చేరుకోవడంతో నాలుగైదు రోజుల్లో మిడ్ మానేర్ళ గేట్లు ఎత్తి ఎల్లుండికి పది టీఎంసీల నీటిని విడుదల చేసే అవకాశం ఉంది. అందుకు అనుగుణంగా అటు ప్రభుత్వం, ఇటు ఇరిగేషన్ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
గడిచిన పదేళ్లలో ఎప్పుడు లేనంతగా మానేర్ డ్యామ్ లు నీటి కష్టాలను ఎదుర్కొంటున్నాయి. ఎల్లంపల్లి నుంచి ఎత్తిపోతల పథకం పై ఆధారపడి మానేర్ డ్యామ్ లు పని చేసే పరిస్థితి నెలకొంది.
రిపోర్టింగ్ : కె వి రెడ్డి ఉమ్మడి కరీంనగర్ జిల్లా కరస్పాండెంట్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగు.