Telangana Thalli : తెలంగాణ తల్లి ఒక వ్యక్తికి.. ఒక కుటుంబానికి పరిమితం కాదు : పొన్నం ప్రభాకర్
Telangana Thalli : తెలంగాణ అసెంబ్లీలో మంత్రి పొన్నం ప్రభాకర్ కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ తల్లిపై శాసన సభలో చర్చ జరిగింది. తెలంగాణ తల్లి.. ఒక వ్యక్తికి, ఒక కుటుంబానికి పరిమితం కాదని మంత్రి పొన్నం స్పష్టం చేశారు. సోనియాగాంధీ లేకపోతే.. తెలంగాణ వచ్చేది కాదని వ్యాఖ్యానించారు.
సోనియాగాంధీ లేకుంటే తెలంగాణ రాకపోతుండేనని.. మంత్రి పొన్నం ప్రభాకర్ వ్యాఖ్యానించారు. డిసెంబర్ 9న తెలంగాణా ఏర్పాటు ప్రకటించిన సందర్భంగా సోనియాగాంధీకి జన్మదిన శుభాకాంక్షలు చెప్పారు. తెలంగాణ చిహ్నం చర్చ జరుగుతుందని.. తెలంగాణకు అధికారిక గేయం లేదు.. తెలంగాణ సెంటిమెంట్‌కి అనుగుణంగా తమ ప్రభుత్వం రాగానే రాష్ట్ర గీతాన్ని అధికారికంగా ఏర్పాటు చేశామని పొన్నం ప్రభాకర్ వివరించారు.
'తెలంగాణ తల్లి విగ్రహం ఎక్కడ అధికారికంగా లేదు. అది ఒక పార్టీకి సంబంధించిన అప్లికెటెడ్ తప్ప.. రాష్ట్ర అధికారిక విగ్రహం కాదు. ఈరోజు అధికారికంగా తెలంగాణ తల్లి విగ్రహాన్ని సచివాలయంలో ఆవిష్కరించుకుంటున్నం. తెలంగాణకు స్ఫూర్తిదాయకంగా ఉండాలని తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ చేసుకుంటున్నాం. ఒక వ్యక్తికి, ఒక కుటుంబానికి పరిమితం కాదు తెలంగాణ తల్లి' అని పొన్నం ప్రభాకర్ వ్యాఖ్యానించారు.
'10 సంవత్సరాల్లో తెలంగాణ తల్లి విగ్రహాన్ని అధికారికంగా ఎందుకు ఏర్పాటు చేయలేదు. ప్రతి జిల్లా కేంద్రాల్లో కలెక్టరేట్లలో, పోలీస్ కార్యాలయాల్లో, ప్రభుత్వ కార్యాలయాల్లో తెలంగాణ తల్లి విగ్రహాలు ఏర్పాటు చేయాలి. ప్రతి సంవత్సరం డిసెంబర్ 9 తెలంగాణ తల్లి ఆవిర్భావ దినోత్సవం జరుపుకుందాం. తెలంగాణ ఏర్పడడానికి సోనియా గాంధీ కారణం. రాజకీయాలకు అతీతంగా ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చారు' అని మంత్రి వివరించారు.
'తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు కారణమైన వారికి ఈ సభ నుండి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతున్నం. రాజకీయంగా తెలంగాణ అంశాన్ని 10 సంవత్సరాలు చూశాం. ఉద్యోగుల సమస్యలు పరిష్కారం చేయలేదు. గత 10 సంవత్సరాలుగా ఉద్యోగులను ఇబ్బందులు పడ్డారు. ఉద్యోగ నాయకులు పదవి విరమణ కాగానే వారికి పదవులు ఇస్తే.. వారు అనుకూలంగా ఉంటారేమో.. కానీ ఉద్యోగులు ఇబ్బందులు పడ్డారు. ఉద్యోగుల సమస్యలను పరిష్కారం చేయడానికి ఒక కమిటీ వేశారు. అందులో ఒక నిర్ణయం తీసుకున్నాం' అని పొన్నం వ్యాఖ్యానించారు.
'లోకాలిటీ సమస్య ఉంది. కేంద్ర ప్రభుత్వంతో చర్చించి సమస్య పరిష్కారం చేస్తం. ఖమ్మం జిల్లాలో వరదలతో చాలా ప్రాంతాలు మునిగి రూ.10 వేల కోట్ల నష్టం జరిగితే.. ముష్టి రూ.400 కోట్లు ఇచ్చారు. రాజకీయాలకు అతీతంగా నిధులు తెచ్చుకునేలా ఉండాలి. ఉద్యమ ఆకాంక్షలకు అనుగుణంగా తెలంగాణ తల్లి సేవ చేసుకోవాలి. తెలంగాణ తల్లి రూపంలో రాచరికపు పాలన లేకుండా చూశాం. ఒకవైపు అభయ హస్తం.. మరోవైపు పచ్చని పాడి పంటల పచ్చదనం.. ఇది అభివృద్ధికి నిదర్శనం. కిరీటాలు లేకుండా..గ్రామాల్లో కనిపించే గ్రామ వనితలాగా తెలంగాణ తల్లి విగ్రహం ఉంది' అని పొన్నం వివరించారు.
'తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలు ఉండేలా విగ్రహ ఏర్పాటు ఉంటుంది. అందరి ఆకాంక్షలకు అనుగుణంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే ఎన్నో హామీలు అమలు చేశాం. 55 వేల ఉద్యోగాలు భర్తీ చేశాం. 2 లక్షల రైతు రుణమాఫీ అమలు చేశాం. ఆర్టీసీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, 500 రూపాయలకే గ్యాస్.. ఇలా ఎన్నో పథకాలు అమలు చేశాం. ఒకటో తారీఖు జీతాలు వస్తున్నాయి' అని మంత్రి వెల్లడించారు.