Warangal : ప్రారంభానికి సిద్ధమైన సిద్ధమైన కాళోజీ కళాక్షేత్రం.. 7 ప్రత్యేకతలు
Warangal : పుట్టుక నీది.. చావు నీది.. బ్రతుకంతా దేశానిది.. అని తన పెన్నుకు పదునుపెట్టి ప్రశ్నించారు కాళోజీ. ఆ ప్రజాకవి పుట్టిన గడ్డపై ప్రభుత్వం కాళోజీ పేరుతో కళాక్షేత్రాన్ని నిర్మించింది. ఈ కళాక్షేత్రం ప్రారంభానికి సిద్ధమైంది. దీనికి సంబంధించి ప్రత్యేకలు ఇలా ఉన్నాయి.
తన కలానికి పదును పెట్టి ప్రజాకవి కాళోజీ నారాయణరావు అన్యాయాన్ని ప్రశ్నించారు. ఆయన తెలంగాణ సమాజానికి, ఉద్యమానికి స్పూర్తి. అలాంటి గొప్ప వ్యక్తిని స్మరించుకోవడానికి తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే హెల్త్ యూనివర్సిటీకి కాళోజీ పేరు పెట్టింది. కాళోజీ సొంత గడ్డ వరంగల్లులో కాళోజీ కళాక్షేత్రాన్ని నిర్మించింది. ఆ కళాక్షేత్రం ప్రారంభోత్సవానికి ముస్తాబైంది. దీనికి సంబంధించిన ప్రత్యేకలు ఓసారి చూద్దాం.
1.2014లో అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ హనుమకొండలోని హయగ్రీవాచారి మైదానంలో కాళోజీ కళాక్షేత్రానికి శంకుస్థాపన చేశారు.
2.దాదాపు పదేళ్ల తర్వాత పనులు పూర్తయ్యాయి. వాస్తవానికి ఈ నెల 9న కాళోజీ జయంతి రోజున ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చేతుల మీదుగా ప్రారంభోత్సవం చేసేందుకు ఏర్పాట్లు చేశారు. కానీ.. వాయిదా పడింది.
3.ఈ కళాక్షేత్రానికి ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. 4.2 ఎకరాల స్థలంలో రూ.95 కోట్ల వ్యయంతో రెండు అంతస్తుల్లో భవనాన్ని నిర్మించారు.
4.హైదరాబాద్ నగరంలో ఉన్న రవీంద్ర భారతి కంటే పెద్దగా 1,150 మంది కూర్చునేలా భారీ ఆడిటోరియాన్ని నిర్మించారు. స్క్రీన్ ప్రధాన ఆకర్షణగా నిలుస్తోంది.
5.ఈ కళా క్షేత్రంలో అత్యాధునిక సౌండ్, లైటింగ్ వ్యవస్థలు ఏర్పాటు చేశారు. మొదటి అంతస్తులో ఆర్టియం, ప్రీఫంక్షన్ ఏరియా, వంటగది, రెండో అంతస్తులో కాళోజీ వినియోగించిన వస్తువులతో ఆర్ట్ గ్యాలరీ ఉన్నాయి. ఆయన చేసిన రచనలతో గ్రంథాలయం కొలువుదీరుస్తున్నారు.
6.ఈ భవనం ముందు కాళోజీ కాంస్య విగ్రహం ఏర్పాటు చేశారు. ఉద్యాన పనులు తుది మెరుగులు దిద్దుకుంటున్నాయి.
7.ఈనెల 19న సీఎం రేవంత్ వరంగల్‌కు రానున్నారు. ఆ రోజే దీన్ని ప్రారంభించాలని కాకతీయ పట్టణాభివృద్ధి సంస్థ (కుడా) ఏర్పాట్లు చేస్తోంది. తాజాగా కుడా ఛైర్మన్ ఇనుగాల వెంట్రామిరెడ్డి కళాక్షేత్రాన్ని పరిశీలించారు.
ఈ నెల 19న రేవంత్ రెడ్డి వరంగల్ పర్యటనకు రానున్నారు. సీఎం పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లను హన్మకొండ, వరంగల్ జిల్లాల కలెక్టర్లు ప్రావీణ్య, డాక్టర్ సత్య శారదా, వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా, గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ అశ్విని తానాజీ వాకడే పరిశీలించారు. హెలికాప్టర్ దిగనున్న ఆర్ట్స్ కళాశాల మైదానం తోపాటు బాలసముద్రంలోని కాళోజీ కళా క్షేత్రం, కాజీపేట ఆర్వోబీ ని కలెక్టర్లు, పోలీస్ కమిషనర్, జీడబ్ల్యూఎంసీ కమిషనర్ పరిశీలించారు.
సీఎం పర్యటన రూట్ మ్యాప్‌ను కలెక్టర్లు, సీపీ పరిశీలించారు. పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లపై అధికారులతో చర్చించారు. సీఎం రాక మొదలుకుని అభివృద్ధి పనుల ప్రారంభోత్సవం, అభివృద్ధి పనుల సమీక్ష, తిరిగి హెలికాప్టర్ ద్వారా హైదరాబాద్ బయలుదేరే వరకూ షెడ్యూల్ ప్రకారం పర్యటన సాగేలా ఏర్పాట్లను గురించి చర్చించారు.