Pakistan Colony In Vijayawada: బెజవాడలో పాకిస్తాన్ కాలనీ.. అసలు రహస్యం ఇదే.. మిగతావన్నీ కట్టుకథలే…
Pakistan Colony In Vijayawada: బెజవాడలో పాకిస్తాన్ గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో చిలువలు పలువలుగా వార్తలు, తాము ఇబ్బందులు పడుతున్నామని స్థానికుల ఆందోళనలు, బెజవాడలో పాకిస్తాన్ పేరు ఉండటం ఏమిటనే సందేహాలు దానికి రకరకాల వివరణలు అంతు లేకుండా కొనసాగుతూనే ఉన్నాయి.
Pakistan Colony In Vijayawada: బెజవాడలో ఓ కాలనీకి దాయాది దేశం పేరుండటంలో అక్కడ నివాసం ఉంటున్న ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, బెజవాడలో పాకిస్తాన్ కాలనీ ఎందుకు పుట్టుకొచ్చిందనే సందేహాలు, చర్చలు ఇటీవల వార్తల్లో చోటు చేసుకుంటున్నాయి
. పొరుగుదేశం పేరుతో కాలనీని కొనసాగించడం ఏమిటి, దాని పేరు మార్చాలనే డిమాండ్లు, పాకిస్తాన్ పేరు వల్ల తమకు పాస్‌పోర్టులు జారీ కావడం లేదని, ఉద్యోగాలు, వీసాల మంజూరులో ఇబ్బందులు పడుతున్నామని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. రెవిన్యూ రికార్డుల్లో లేని పేరుతో కాలనీ కొనసాగుతున్నందున పాకిస్తాన్ పేరు రద్దు చేసి తమ కష్టాలు తీర్చాలనే డిమాండ్ స్థానికుల నుంచి వస్తోంది. అయితే విజయవాడలో పాకిస్తాన్ కాలనీ, బర్మా కాలనీ పేరుతో ప్రభుత్వం ఇళ్లను ఎందుకు నిర్మించిందనే దానికి మాత్రం ఎక్కడా సమాధానం దొరకలేదు.
వాళ్లే వీళ్లు... పాకిస్తానీలు కాదు...
దేశ విభజన మిగిల్చిన విషాదంలో లక్షలాది మంది ప్రజలు నిర్వాసితులుగా, శరణార్థులుగా ప్రాణాలు అరచేతుల్లో పెట్టుకుని ప్రస్తుత పాకిస్తాన్‌లోని సింధ్ ప్రావిన్స్ (సింధ్ రాష్ట్రం) నుంచి గుజరాత్ మీదుగా భారత్‌లోకి అడుగుపెట్టారు. ఆస్తులు, ఇళ్లు, పొలాలు.. అన్నిటికీ మించి మాతృభూమిని వదులకుని కట్టుబట్టలతో వచ్చిన కుటుంబాలు ఆశ్రయం వెదుక్కుంటూ దేశమంతటా చెల్లాచెదురయ్యాయి.
అలా సింధ్ ప్రావిన్స్ నుంచి రైలు మార్గంలో కొన్ని కుటుంబాలు 1950కు ముందే విజయవాడ వచ్చాయి. దేశానికి స్వాతంత్య్రం వచ్చినా నిజాం సామ్రాజ్యం భారత సంస్థానంలో విలీనం కాకపోవడంతో దక్షిణాది రాష్ట్రాల్లో మద్రాసు ప్రెసిడెన్సీలోకి వందలాది కుటుంబాలు వలస వచ్చాయి.
దేశ విభజన జరిగే నాటికి చెన్నై-కోల్‌కత్తా రైలు మార్గంలో ఉన్న విజయవాడ ప్రధాన కూడలిగా గుర్తింపు పొందింది. దక్షిణాదిన వ్యాపార అవకాశాలు పుష్కలంగా ఉన్న నగరం కావడంతో స్థిర నివాసాన్ని వెదుక్కుంటున్న సింధీ కుటుంబాలు విజయవాడను గమ్యంగా చేసుకున్నాయని నగరానికి చెందిన ప్రముఖ వస్త్ర వ్యాపారి వివరించారు.
విజయవాడలో సింధీలు స్థిరపడటం అంత సులువుగా ఏమి జరగలేదని, అప్పటికే గుజరాతీ, మార్వాడీలు విజయవాడ కేంద్రంగా సాగుతున్న వ్యాపారాల్లో పట్టు సాధించడంతో సింధీల మనుగడ కోసం అనేక ఒడిదుడుకులు ఎదుర్కోవాల్సి వచ్చిందని గుర్తు చేసుకున్నారు. పాకిస్తాన్ నుంచి వలస వచ్చిన వారిలో ప్రస్తుతం నాలుగు, ఐదో తరం వారసులు విజయవాడలో ఉన్నారు. 75 ఏళ్ల క్రితం 45-50 కుటంబాలతో విజయవాడ చేరుకున్న సమూహంలో ఇప్పుడు 400 కుటుంబాలు ఉన్నాయి.
గోప్యతా కారణాలతో వారి వివరాలను వెల్లడించకపోయినా విజయవాడ నగరాభివృద్ధిలో సింధీలు తిరుగులేని పాత్ర పోషిస్తున్నారు. నిరాశ్రయులుగా భారతదేశ పౌరులుగా మాతృభూమి గుర్తింపు కోసం వచ్చిన వారంతా విజయవాడ తమను అక్కున చేర్చుకుందని గర్వంగా చెబుతారు. ప్రస్తుతం విజయవాడ నగరంలోని ఎంజీ రోడ్డు, పాతబస్తీ, హనుమాన్ పేట ప్రాంతాల్లో విస్తరించిన సింధీ కుటుంబాలు ఐక్యమత్యంతో, స్వశక్తితో ఉన్నత స్థానాలకు ఎదిగారు.
మొదట్లో వస్త్ర వ్యాపారం, ఆ తర్వాత ఫుట్‌వేర్, లెదర్, రబ్బర్, జ్యూవెలరీ, హోజైరీ ఇలా భారతదేశ పశ్చిమ తీరంలోని వ్యాపారాలను విజయవాడకు విస్తరించడంలో సింధీల పాత్ర గణనీయంగా ఉంది. ప్రస్తుత పాకిస్తాన్‌లోని సింధ్ ప్రావిన్స్ నుంచి వలస రావడంతో తొలినాళ్లలో పాకిస్తానీలుగా పొరబడే వారని విజయవాడ నగరంలో ఫుట్ వేర్ వ్యాపారంలో ఉన్న సింధీ ఒకరు తెలిపారు. సింధ్ నుంచి వలస వచ్చాం తప్ప తాము పాకిస్తాన్ పౌరులు కాదని వివరించారు. దేశ విభజన సమయంలో నెలకొన్న ఉద్రిక్తతలు, మతపరమైన ఘర్షణల నేపథ్యంలో ప్రశాంతమైన ప్రాంతాలను వెదుక్కుంటూ విజయవాడ వచ్చి సమూహంగా స్థిరపడినట్టు వివరించారు.
పాకిస్తాన్ కాలనీ రహస్యం ఏమిటి..
దేశ విభజనలో ప్రస్తుత పాకిస్తాన్‌తో పాటు తూర్పు పాకిస్తాన్ కూడా ఏర్పడింది. ఈ రెండు ప్రాంతాల్లో చాలా కాలం పాటు అశాంతి కొనసాగింది. సింధ్ ప్రాంతం నుంచి వలస వచ్చిన హిందూ కుటుంబాలు 1950వ దశకం నాటికి విజయవాడలో స్థిరపడ్డాయి. సొంతంగా వ్యాపారాలు చేసే స్థాయికి ఎదిగారు. పాతబస్తీలో వారి కోసం ప్రత్యేకంగా దుకాణాలను కూడా ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఇలా వలస వచ్చిన వారిలో రకరకాల సామాజిక, ఆర్ధిక హోదాలు కలిగిన వారు ఉండటంతో వారి కోసం కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది.
70వ దశకానికి ఇళ్లు లేని 40-50 కుటుంబాలను గుర్తించి వారి కోసం సింగ్‌నగర్ ప్రాంతంలో ఇళ్లను నిర్మించినట్టు గణేష్ లఖానీ అనే వ్యాపారి గుర్తు చేసుకున్నారు. అయితే అప్పటికి ఆ ప్రాంతంలో నివాసాలు లేకపోవడం, ఇళ్లలోకి తరచూ వరదలు ముంచెత్తడం వంటి కారణాలతో పాటు భద్రతా పరమైన అంశాలు, సమూహంగా నివసించడానికి అలవాటు పడటం వంటి కారణాలతో సింగ్‌నగర్‌లో ప్రభుత్వం ఇచ్చిన ఇళ్లను సింధీలు తీసుకోలేదని స్పష్టం చేశారు.
సింధీ శరణార్థుల కోసం కేంద్ర ప్రభుత్వం ఆ ఇళ్లను మంజూరు చేసిందని, ఇప్పటికీ కేంద్ర హోంశాఖ రికార్డుల్లో తమ కుటుంబాలు నమోదయి ఉన్నాయని స్పష్టం చేశారు. అవగాహన లేకపోవడం వల్ల పాకిస్తాన్ కాలనీగా పేరు పెట్టి ఉంటారని లఖానీ అభిప్రాయపడ్డారు. తాము 100 శాతం భారతీయులుగానే దేశ విభజనలో ఈ దేశంలోకి వచ్చేశామని స్పష్టం చేశారు.
అలా అప్పట్లో ఈ సింధీల కోసం ఇళ్ళు కట్టిచ్చిన ప్రాంతాన్నే ప్రస్తుతం పాకిస్తాన్ కాలనీగా పిలుస్తున్నారు. అయితే ఈ ప్రాంతంలో ఇళ్ళకు వారు వెళ్లకపోవడంతో కాలక్రమంలో, ఇతరులు వెళ్లి నివసించినా ఆ ప్రాంతానికి పాకిస్తాన్ కాలనీ అనే పేరు పోలేదు.
ప్రస్తుతం విజయవాడ సింధీ సమాజంలో 400కు కుటుంబాలు ఉన్నాయని, ప్రభుత్వం తమ పేరుతో గతంలో ఇళ్ల పత్రాలు మంజూరు చేసినట్టు సింధీలు గుర్తు చేసుకున్నారు. విజయవాడలో లభించిన ఆదరణతో అన్ని కుటుంబాలు ఆర్థికంగా, సామాజికంగా నిలదొక్కుకున్నాయని ఆ కాలనీతో కూడా తమకు సంబంధం లేదని పాకిస్తానీలు ప్రచారం జరగడం దురదృష్టకరమని చెబుతున్నారు. పాకిస్తాన్ కాలనీ ప్రచారంలో కొసమెరుపు ఏమిటంటే సింధ్ నుంచి వలస వచ్చి స్థిరపడిన కుటుంబాలు ఇప్పుడు విజయవాడలో ప్రముఖ వస్త్రదుకాణాల షోరూమ్‌లు, ఫుట్‌వేర్ వ్యాపారాల్లో సింధీలు ప్రముఖ స్థానంలో కొనసాగుతున్నారు.