super star krishna death: తెలుగు సినిమా సాహసాలకు చిరునామా కృష్ణ - సూపర్ స్టార్ సినీ జీవిత విశేషాలు
super star krishna death: తెలుగు సినీ పరిశ్రమలో కృష్ణ ప్రయాణం అసామాన్యమైనది. యాభై ఏళ్ల కెరీర్‌లో ఎన్నో ప్రయోగాలతో కోట్లాది మందికి స్ఫూర్తిగా నిలిచారు.
super star krishna death: గుంటూరు జిల్లా తెనాలి సమీపంలోని బుర్రిపాలంలో 1943 మే 31న కృష్ణ జన్మించారు. ఇంజినీరింగ్ చదవాలని కలలుకన్నాడు. కానీ ఆ కోరిక తీరలేదు. ఏలూరులో డిగ్రీ పూర్తిచేసి సినిమాల్లోకి వచ్చారు. గ్రాడ్యూయేషన్ చదివే రోజుల్లో నటుడు మురళీమోహన్, దర్శకుడు క్రాంతికుమార్ కృష్ణ రూమ్‌మేట్స్‌గా ఉండేవారు. ఎన్టీఆర్, ఏఎన్నార్ స్ఫూర్తితో సినిమాల్లోకి రావాలని నిర్ణయించుకున్న కృష్ణ అవకాశాల్ని వెతుక్కుంటూ మద్రాస్ పయనమయ్యారు.
కానీ అప్పటికీ ఆయన వయసు 19 ఏళ్లు కావడంతో ఎవరూ అవకాశాలు ఇవ్వలేదు. నాటకాల ద్వారా యాక్టింగ్‌లో అనుభవాన్ని సంపాదించుకోవాలని ఎన్టీఆర్ ఇచ్చిన సలహాను పాటించాలని నిర్ణయించుకున్నారు. మొదటి ప్రయత్నంగా చేసిన పాపం కాశీకి వెళ్లినా అనే నాటకంలో రెండో హీరోగా నటించారు కృష్ణ. ఈ నాటకంలో తొలి హీరోగా శోభన్‌బాబు చేశారు. తొలి నాటకం ద్వారా కృష్ణ నటుడిగా మంచి పేరు తెచ్చుకున్నారు.
కొడుకులు కోడళ్లు లో అవకాశం మిస్
తొలుత ఎల్.వి ప్రసాద్ దర్శకత్వంలో కొడుకులు కోడళ్లు అనే సినిమాలో నలుగురు హీరోల్లో ఒకరిగా కృష్ణ సెలెక్ట్ అయ్యాడు. కానీ సెట్స్‌పైకి రాకముందే ఈ సినిమా ఆగిపోయింది. ఫస్ట్ ఆఫర్ చేజారినా నిరాశపడకుండా తేనే మనసులు సినిమా కోసం ఆడిషన్స్ జరుగుతున్నాయని తెలిసి కృష్ణ తన ఫొటోలు పంపించారు. ఆ సినిమాకు కృష్ణ మేకప్ టెస్ట్‌ను కె.విశ్వనాథ్ చేశారు.
ఈ సినిమాలో హీరోగా కృష్ణ సెలెక్ట్ అయ్యాడు. తేనే మనసులు సినిమా కోసం కృష్ణ రెండువేల పారితోషికం అందుకున్నాడు. ఈ సినిమా ఆడిషన్స్‌కు కృష్ణంరాజు, హేమమాలిని, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత వాంటి వారు వచ్చిన అవకాశం దక్కలేదు. ఫస్ట్ కలర్ సినిమాగా రిలీజైన తేనే మనసులు పెద్ద విజయాన్ని సాధించడంతో కృష్ణ వెనుదిరిగి చూడలేదు.
జేమ్స్ బాండ్ కథతో రెండో సినిమా
తేనే మనసులు సక్సెస్ తర్వాత డైరెక్టర్ డూండీతో గూఢచారి 116 సినిమా చేశాడు కృష్ణ. తొలుగులో జేమ్స్ బాండ్ కథాంశంతో వచ్చిన తొలి సినిమా ఇదే. రెండో సినిమాకే ప్రయోగాత్మక కథను ఎంచుకోవడం అప్పట్లో చర్చనీయాంశంగా మారింది. ఈ సినిమాతో తెలుగు సినీ పరిశ్రమలో కొత్త ట్రెండ్ క్రియేట్ చేశాడు కృష్ణ. ఈ సినిమా అద్భుత విజయంతో హీరోగా బిజీగా మారిపోయారు.
1965లో కృష్ణ నటించిన తేనే మనసులు మాత్రమే సినిమానే రిలీజైంది. మూడేళ్ల తర్వాత 1968లో కృష్ణ హీరోగా నటించిన 11 సినిమాలు రిలీజ్ అయ్యాయంటే ఆయన హీరోగా ఎంత బిజీగా మారిపోయారో అర్థం చేసుకోవచ్చు. 350 సినిమాల్లో 300 సినిమాలు విజయాల్ని సాధించాయి.1972 సంవత్సరంలో కృష్ణ నటించిన 18 సినిమాలు రిలీజ్ అయ్యాయి. ఇప్పటివరకు టాలీవుడ్‌లో ఏ హీరో ఆ రికార్డ్‌ను బ్రేక్ చేయలేకపోయారు.
హీరోగా 340 సినిమాలు
సుధీర్ఘ సినీ ప్రయాణంలో కృష్ణ మొత్తం 365కిపైగా సినిమాల్లో నటించాడు. అందులో హీరోగా నటించినవే 350 సినిమాల వరకు ఉండటం గమనార్హం. 1965 నుంచి 2009 వరకు ఒక్క ఇయర్ కూడా గ్యాప్ లేకుండా సినిమాలు చేసిన ఏకైక ఇండియన్ హీరో కృష్ణనే కావడం గమనార్హం.
మల్టీస్టారర్ కింగ్
టాలీవుడ్‌లో అత్యధిక మల్టీస్టారర్ సినిమాలు చేసింది కృష్ణనే కావడం గమనార్హం. దాదాపు యాభై ఏళ్ల సినీ ప్రయాణంలో యాభై ఐదు మల్టీస్టారర్ సినిమాలు చేశాడు కృష్ణ. ఎన్టీఆర్, ఏఎన్నార్ అలనాటి అగ్ర హీరోలు మొదలుకొని చిరంజీవి, నాగార్జున, మహేష్‌బాబు లాంటి నేటితరం హీరోలందరితో సినిమాలు చేశారు. ఎన్టీఆర్‌తో స్త్రీజన్మ, నిలుపుదోపీడీ, విచిత్ర కుటుంబం, దేవుడు చేసిన మనుషులుతో పాటు పలు సినిమాల్లో నటించారు.
ఏఎన్నార్‌తో మంచికుటుంబం, అన్నాచెల్లెల్లు, హేమాహేమీలు వంటి సినిమాలు చేశారు. చిరంజీవితో కొత్త పేట రౌడీ, తోడు దొంగలు, రజనీకాంత్ రామ్ రాబర్ట్ రహీమ్ లాంటి సినిమాలు చేశారు.కొత్త, పాత అనే తేడాలు లేకుండా అందరితో కలిసి నటించిన ఏకైక హీరో కృష్ణనే. అంతేకాకుండా తన తనయులు మహేష్‌బాబు, రమేష్‌బాబులతో కలిసి కూడా కృష్ణ నటించారు.
దర్శకనిర్మాతగా...
నటుడిగానే కాకుండా దర్శకుడిగా నిర్మాతగా ఎన్నో విజయవంతమైన సినిమాల్ని నిర్మించారు కృష్ణ. పెద్ద కూతురు పద్మ పేరుతో పద్మాలయ స్టూడియోను నెలకొల్పిన కృష్ణ తొలి ప్రయత్నంగా అగ్ని పరీక్ష అనే సినిమా చేశారు. ఆ సినిమా అంతగా ఆడలేదు. అయినా పట్టు వీడకుండా రెండో ప్రయత్నంగా మోసగాళ్లకు మోసగాడు సినిమా నిర్మించి పెద్ద విజయాన్ని అందుకున్నాడు.
ఈ సక్సెస్ తర్వాత పద్మాలయ స్టూడియోస్‌పై దేవుడు చేసిన మనుషులు, పండంటి కాపురం, సింహాసనం, బాలచంద్రుడుతో పాటు ఎన్నో సినిమాల్ని నిర్మించారు. దర్శకుడిగా తొలి ప్రయత్నంలోనే సింహాసనం వంటి భారీ జానపద సినిమాను తెరకెక్కించి వైవిధ్యతను చాటుకున్నాడు కృష్ణ. ఒకేసారి తెలుగుతో పాటు జితేంద్ర హీరోగా హిందీలో సింహాసనం సినిమాను రూపొందించారు కృష్ణ. కెరీర్‌లో మొత్తం 16 సినిమాలకు కృష్ణ దర్శకత్వం వహించారు.