UP Crime news: యూపీలో బాలుడి తల నరికిన ప్రత్యర్థులు; ఆ తల ఒడిలో పెట్టుకుని తల్లి హృదయ విదారక రోదన
UP Crime news: ఉత్తరప్రదేశ్ లో హృదయ విదారక ఘటన చోటు చేసుకుంది. భూ తగాదాల్లో ప్రత్యర్థులు 17 ఏళ్ల బాలుడి తల నరికారు. ఆ తలను ఒడిలో పెట్టుకుని ఆ బాలుడి తల్లి రోదించడం అక్కడివారిని కలచివేసింది. రాంజీత్ యాదవ్, లాల్తా యాదవ్ అనే ఇద్దరు గ్రామస్తుల మధ్య భూవివాదం కారణంగా ఈ హింస చోటు చేసుకుందని ఎస్పీ తెలిపారు.
UP Crime news: ఉత్తరప్రదేశ్ లోని జౌన్ పూర్ లో బుధవారం భూమి విషయంలో జరిగిన గొడవలో 17 ఏళ్ల బాలుడి తలను కత్తితో నరికి చంపారు. రాంజీత్ యాదవ్, లాల్తా యాదవ్ అనే ఇద్దరు గ్రామస్తుల మధ్య భూవివాదం కారణంగానే ఈ హింస చోటు చేసుకుందని ఎస్పీ అజయ్ పాల్ శర్మ తెలిపారు.
భూ వివాదంలో..
లల్తా యాదవ్ కుమారుడు రమేష్ యాదవ్ బుధవారం ఉదయం వివాదాస్పద భూమిని క్లియర్ చేయడం ప్రారంభించడం ఉద్రిక్తతకు దారితీసింది. ఈ క్రమంలో రామ్జీత్ యాదవ్ కుమారుడు అనురాగ్ యాదవ్ పై రమేష్ కత్తితో దాడి చేసి నరికి చంపాడు. రమేశ్ యాదవ్ అనురాగ్ యాదవ్ పై విచక్షణా రహితంగా కత్తితో దాడి చేయడంతో.. అనురాగ్ యాదవ్ తల మొండెం నుంచి వేరై నేలపై పడిపోయింది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు శాంతిభద్రతలు క్షీణించకుండా పలు పోలీసు బృందాలను రంగంలోకి దింపారు.
బాలుడి తల్లి వేదన
ఆ బాలుడి తల్లి తెగిపడిన తన కుమారుడి తలను ఒడిలో పెట్టుకుని గంటల తరబడి కూర్చుండిపోయిందని గ్రామస్తులు తెలిపారు. ఆ హృదయ విదారక ఘటనను చూడలేకపోయామని తెలిపారు. ఈ ఘటన తర్వాత పోలీసులు లల్తా యాదవ్ ను అరెస్టు చేయగా, అతని కుమారుడు రమేష్ యాదవ్ కోసం గాలిస్తున్నారు. ఈ ఘటన వెనుక ఉన్న వారిని కఠినంగా శిక్షిస్తామని జౌన్ పూర్ జిల్లా మేజిస్ట్రేట్ దినేష్ చంద్ర తెలిపారు. ఇది ఇరువర్గాల మధ్య పాత భూవివాదం అని, సివిల్ కోర్టులో కూడా పెండింగ్ లో ఉందన్నారు. ఈ వివాదంపై మూడు రోజుల్లో నివేదిక ఇవ్వాలని కోరాను' అని చంద్ర తెలిపారు. ఈ నేరంపై ఉత్తరప్రదేశ్ (uttar pradesh) లో ప్రతిపక్ష సమాజ్ వాదీ పార్టీ చీప్ అఖిలేశ్ యాదవ్ స్పందించారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు లేవని విమర్శించారు. రాష్ట్రంలో నేరగాళ్లు మరింత శక్తిమంతులుగా, క్రియాశీలకంగా మారుతున్నారన్నారు. భీమ్ ఆర్మీ చీఫ్ కూడా ఈ ఘటనను ఖండిస్తూ అనురాగ్ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు.