TG High Court: ఆరేళ్ల క్రితం చనిపోయిన ఖైదీ విడుదలకు తెలంగాణ హైకోర్టు ఆదేశాలు, నేరం చేశాడో లేదో తేలకుండానే జైలు శిక్ష-the telangana high court ordered the release of the prisoner who died six years ago ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Tg High Court: ఆరేళ్ల క్రితం చనిపోయిన ఖైదీ విడుదలకు తెలంగాణ హైకోర్టు ఆదేశాలు, నేరం చేశాడో లేదో తేలకుండానే జైలు శిక్ష

TG High Court: ఆరేళ్ల క్రితం చనిపోయిన ఖైదీ విడుదలకు తెలంగాణ హైకోర్టు ఆదేశాలు, నేరం చేశాడో లేదో తేలకుండానే జైలు శిక్ష

Sarath chandra.B HT Telugu
Aug 05, 2024 09:42 AM IST

TG High Court: వందమంది దోషులు తప్పించుకున్నా ఒక నిరపరాధిని శిక్షించకూడదనేది మన న్యాయవ్యవస్థ పాటించే సూత్రం. తెలంగాణలో తల్లిని చంపేశాడనే ఆరోపణలతో జైలు శిక్ష పడిన ఖైదీ ఆరేళ్ల క్రితమే మృతి చెెందాడు.

ఆరేళ్ల క్రితం చనిపోయిన వ్యక్తి విడుదలకు తెలంగాణ హైకోర్టు ఉత్తర్వులు
ఆరేళ్ల క్రితం చనిపోయిన వ్యక్తి విడుదలకు తెలంగాణ హైకోర్టు ఉత్తర్వులు

TG High Court: వందమంది దోషులు తప్పించుకున్నా ఒక నిరపరాధిని శిక్షించకూడదనేది మన న్యాయవ్యవస్థ పాటించే సూత్రం. కానీ తెలంగాణలో ఓ వ్యక్తి తప్పు చేశాడో చేయలేదో నిర్థారణ కాకుండా జైలు పాలయ్యాడు. జైల్లోనే కన్ను మూశాడు. ఆరేళ్ల క్రితం చనిపోయిన వ్యక్తిని విడుదల చేయాలని ఇటీవల హైకోర్టు ఆదేశించింది.

పదకొండేళ్ల క్రితం జరిగిన ఓ వృద్ధురాలి హత్య కేసులో ప్రాసిక్యూషన్ వైఫల్యాన్ని గుర్తించిన హైకోర్టు నిందితుడిని నిరాపరాధిగా విడుదల చేసింది. 80ఏళ్ల వృద్ధురాలిని పోషించలేక కుమారుడు హత్య చేశాడని నమోదు చేసిన కేసులో ఎలాంటి సాక్ష్యాలు లేకుండానే న్యాయస్థానం జీవిత ఖైదు ఖరారు చేసింది. ఈ కేసు దర్యాప్తులో లోపాలను గుర్తించిన తెలంగాణ హైకోర్టు పదకొండేళ్ల తర్వాత ఖైదీని విడుదల చేయాలని గత వారం ఆదేశించింది.

అయితే ఆ తీర్పు అందుకునే సమయానికి ఖైదీ ప్రాణాలతో లేకపోవడం కుటుంబాన్ని విషాదంలో నింపింది. న్యాయం దక్కించుకునే క్రమంలో న్యాయ పోరాటం చేస్తుండగానే ఖైదీ ప్రాణాలు కోల్పోవడం ఆ సమాచారం కోర్టుకు అందకపోవడంతో ఈ ఘటన చోటు చేసుకుంది.

2013 ఫిబ్రవరి 1న 80ఏళ్ల తల్లిని హత్య చేశాడనే ఆరోపణలతో అరెస్టైన కుమారుడికి 2015 జనవరి 12 జిల్లా కోర్టు యావజ్జీవ శిక్ష విధించింది. అదే ఏడాది నిందితుడి కుమారులు హైకోర్టులో అప్పీలు దాఖలు చేశారు. 11ఏళ్ల తర్వాత 2024 జులై 25న ఖైదీని విడుదల చేయాలని హైకోర్టు ఆదేశించింది. అప్పటికే అతను చనిపోయి ఆరేళ్లు దాటిపోయింది.

సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం పెద్దగుండవెల్లి గ్రామానికి చెందిన గుండెల పోచయ్య తన తల్లి ఎల్లవ్వను హత్య చేశాడనే ఆరోపణలతో 2013లో అరెస్ట్ చేశారు. వృద్ధురాలైన తల్లిని పోషించలేక చెట్టుకు తువాలుతో ఉరి వేసి చంపాడని పోలీసులు కేసు పెట్టారు. ఈ కేసులో పోస్టుమార్టం రిపోర్ట్ తప్ప ఎలాంటి సాక్ష్యాలనున పోలీసులు సమర్పించలేకపోయారు. దీనిని గుర్తించిన హైకోర్టు ఎలాంటి సాక్ష్యాలు లేకుండా యావజ్జీవ ఖైదీ విధించడాన్ని తప్పు పడుతూ నిందితుడిని విడుదల చేయాలని ఆదేవించింది.

2015 జనవరి 12న పోచయ్యకు జిల్లా కోర్టు యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. అప్పటి నుంచి చర్లపల్లి జైల్లో ఖైదీగా ఉన్నాడు. అదే ఏడాది పోచయ్య చిన్న కొడుకు దేవయ్య హైకోర్టులో తీర్పుపై అప్పీలు చేశాడు. ఆ సమయంలో బెయిలు పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసింది. 9ఏళ్ల తర్వాత కేసుల క్లియరెన్స్‌లో భాగంగా గుండెల కేసు విచారణ జరిగింది. కేసు దర్యాప్తులో లోపాలను గుర్తించి విడుదల చేయాలని హైకోర్టు ఆదేశించింది.

చర్లపల్లి ఓపెన్ జైలులో శిక్ష అనుభవిస్తున్న పోచయ్య 2018 ఆగస్టు 15న గాంధీ ఆస్పత్రిలో చేర్చారు. ఆగస్టు 16న కుటుంబ సభ్యులు వెళ్లేసరికి ప్రాణాలు కోల్పోయాడు. పోచయ్యకు చికిత్స అందించడంలో జైలు అధికారుల నిర్లక్ష్యంపై పోచయ్య చిన్న కుమారుడు కుషాయిగూడ పోలీసులకు ఫిర్యాదు కూడా చేశారు.

ఆరేళ్లుగా హైకోర్టుకు తెలియని సమాచారం…

పెండింగ్‌ కేసుల క్లియరెన్స్‌ చేసే క్రమంలో పోచయ్య అప్పీల్ పిటిషన్ విచారణకు వచ్చింది. ఈ కేసులో నిందితుడికి వ్యతిరేకంగా సాక్ష్యాలు లేకపోయినా, పోస్టుమార్టం చేసిన వైద్యుడు, దర్యాప్తు అధికారి నివేదికల ఆధారంగా శిక్ష ఖరారు చేయడాన్ని హైకోర్టు తప్పు పట్టింది. వెంటనే పోచయ్యను విడుదల చేయాలని ఆదేశించింది. అయితే ఆరేళ్ల క్రితమే పోచయ్య చనిపోయిన సమాచారం హైకోర్టుకు చేరలేదు. పోచయ్య తరపున పిటిషన్ వేసిన న్యాయవాది కూడా తర్వాత చనిపోయారు. దీంతో అప్పీల్ మరుగున పడిపోయింది.

పదేళ్ల క్రితం తండ్రిని విడిపించుకోడానికి కొడుకు కోర్టులు, పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరిగాడు. తండ్రి చనిపోయిన తర్వాత జైల్లో పనిచేసిన దానికి రూ.20వేలను కూడా చెల్లించలేదని కొడుకు ఆరోపించాడు. ప్రస్తుతం పోచయ్య కుమారుడు తల్లి, భార్యతో కలిసి హైదరాబాద్ శివార్లలో ఉంటున్నాడు. పోచయ్య వ్యవహారం పోలీసుల దర్యాప్తు, న్యాయస్థానాల్లో సామాన్యులకు దక్కే న్యాయం, బాధితులకు సత్వర న్యాయ సహాయం అంశాలపై చర్చను తెరపైకి తెచ్చింది.