TG DGP Jitender : మోహన్ బాబుది కుటుంబ సమస్య, రోడ్డెక్కి న్యూసెన్స్ సృష్టిస్తే చర్యలు తప్పవ్- డీజీపీ జితేందర్
TG DGP Jitender : సినీ హీరోలు అత్యుత్సాహం ప్రదర్శిస్తే చట్టపరంగా చర్యలు తప్పవని డీజీపీ జితేందర్ హెచ్చరించారు. మోహన్ బాబుది కుటుంబ సమస్య అని ఇంట్లో పరిష్కరించుకుంటే అత్యంతరం లేదన్నారు.
TG DGP Jitender : సినీ హీరోలు అత్యుత్సాహం ప్రదర్శిస్తే చట్టపరంగా చర్యలు తీసుకోక తప్పదని స్పష్టం చేశారు తెలంగాణ డీజీపీ జితేందర్. ఇప్పటికే అల్లు అర్జున్ పై కేసు నమోదు చేశామని చట్ట పరంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. మోహన్ బాబు ది కుటుంబ సమస్య ఇంటి లోపల సమస్య పరిష్కరించుకుంటే ఎవరికీ అభ్యంతరం లేదని రోడ్డెక్కి న్యూసెన్స్ సృష్టిస్తే చర్యలు తప్పవన్నారు.
తెలంగాణ డీజీపీ జితేందర్, ఐజీ రమారాజేశ్వరి, కరీంనగర్ సీపీ అభిషేక్ మోహంతితో కలిసి కరీంనగర్ లో పర్యటించారు. కొత్తపల్లిలో మహిళా సేఫ్టీ ఆద్వర్యంలో ఏర్పాటు చేసిన భరోసా కేంద్రాన్ని ప్రారంభించారు. మహిళలకు, పిల్లలకు సమస్యలు ఉంటే భరోసా కేంద్రానికి రావొచ్చని తెలిపారు. అన్ని జిల్లాలో భరోసా కేంద్రాలు ఏర్పాటు చేయాలనే ప్లాన్ ఉందన్నారు. మహిళల పిల్లల భద్రతకు తెలంగాణ ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందన్నారు. ఇతర రాష్ట్రాల పోలీసులు భరోసా కేంద్రాలను సందర్శిస్తున్నారని తెలిపారు.
27 జిల్లాలో భరోసా కేంద్రాలు..
లైంగిక వేధింపులకు గురైన బాధిత మహిళలకు, అసభ్యకరమైన లైంగిక ప్రవర్తనకు లోనైన పిల్లలకు పోలీస్ స్టేషన్లు, ఆసుపత్రులకు దూరంగా సురక్షిక్తమైన వాతావరణంలో చేయూత అందించేందుకే తెలంగాణ రాష్ట్ర పోలీసుశాఖ, ఉమెన్ సేఫ్టీ వింగ్ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా అన్ని కమీషనరేట్, జిల్లాల్లో భరోసా కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామన్నారు. బాధితులకు సేవలందించుటలో భరోసా కేంద్రాల ఏర్పాటు మంచి సత్ఫలితాలనిస్తుందన్నారు. లైంగిక వేధింపుల కేసుల్లో శిక్షల శాతం పెరిగిందన్నారు. హైదరాబాద్ లో మొదట ఏర్పాటు చేశామని, ఇప్పటివరకు 27 జిల్లాల్లో భరోసా కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. ఈ భరోసా కేంద్రంలలో బాధిత మహిళలకు మానసిక ప్రోత్సాహంతో పాటు, పోలీస్ సేవలు, అవసరమైన వైద్య సహాయం, న్యాయ సేవ, బాధితులకు సహాయ నిధి మొదలగు ఇతర సేవలు అందుబాటులో ఉంటాయని తెలిపారు. సిటిజెన్ ఫీడ్ బ్యాక్ వ్యవస్థను అందుబాటులోకి తీసుకురావడం వలన ప్రజలకు మరింత మెరుగైన సేవలందించేందుకు వీలుంటుందన్నారు. ముఖ్యంగా మహిళల భద్రతే భరోసా యొక్క ముఖ్య ఉద్దేశం అని తెలిపారు.
నక్సలైట్లు లేరు....
తెలంగాణలో నక్సలిజం లేదని స్పష్టం చేశారు డీజీపీ జితేందర్. ఇక్కడి వాళ్ళే సరిహద్దు ప్రాంతాల్లో పని చేస్తున్నారని తెలిపారు. ఇన్ఫార్మర్ల పేరుతో భౌతిక దాడులకు దిగితే సహించేది లేదన్నారు. అల్లు అర్జున్ విషయంలో చట్ట ప్రకారం చర్యలు ఉంటాయని డీజీపీ తెలిపారు. మోహన్ బాబుది కుటుంబ సమస్య అని, వాళ్ళు వాళ్లు మాట్లాడుకుంటే పర్వాలేదన్నారు. ఇప్పటికే కేసులు నమోదయ్యాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో ట్రైనీ ఐపీఎస్ యాదవ్ వసుంధర ఫౌరెబి, అడిషనల్ డీసీపీ లక్ష్మి నారాయణ , ఏసీపీ మాధవి , ఇన్స్పెక్టర్ శ్రీలత , ఎస్బీఐ బ్యాంకు అధికారులు ఇతర సిబ్బంది పాల్గొన్నారు.
రిపోర్టింగ్ : కె.వి.రెడ్ఢి ఉమ్మడి కరీంనగర్ జిల్లా కరస్పాండెంట్, హిందుస్థాన్ టైమ్స్ తెలుగు.
సంబంధిత కథనం