Property Loan : ప్రాపర్టీ మీద లోన్ తీసుకునేముందు ఈ విషయాలను గుర్తుంచుకోండి
Loan Against Property : కొన్నిసార్లు డబ్బు అవసరమైన ఏదైనా ఆస్తి పెట్టి లోన్ తీసుకుంటారు. ఇలాంటి సమయంలో కొన్ని సింపుల్ విషయాలు తెలుసుకోవాలి. అప్పుడే మీకు ఎలాంటి సమస్యలు రావు.
సాధారణంగా డబ్బు అందరికీ అవసరం. కొన్నిసార్లు డబ్బు కోసం బ్యాంకుల చుట్టూ తిరుగుతుంటాం. కొందరికి వ్యక్తిగత ఖర్చుల కోసం రుణం అవసరం అవుతుంది. మరికొందరికి కొత్త వ్యాపారాన్ని ప్రారంభించడానికి, వ్యాపారాలలో కొన్ని ఖర్చుల కోసం మనీ కావాలి. లోన్ తీసకోవాలనుకున్నప్పుడు కొన్నిసార్లు ప్రాపర్టీ పెడతాం. ఇవి సురక్షితమైనవి కూడా. మీరు ఎలాంటి రిస్క్ లేకుండా రుణం పొందవచ్చు.
ఆస్తిపై రుణం(LAP) అనేది రుణగ్రహీత తమ ఆస్తిని-నివాస, వాణిజ్య లేదా పారిశ్రామిక ఆస్తిని నిధుల కోసం తాకట్టు పెట్టే సురక్షిత రుణం. రుణ మొత్తం సాధారణంగా ఆస్తి మార్కెట్ విలువలో ఒక శాతంపై ఆధారపడి ఉంటుంది. రుణగ్రహీత వ్యాపార విస్తరణ, విద్య, వైద్య ఖర్చులు లేదా ఇంటి పునరుద్ధరణతో సహా వివిధ ప్రయోజనాల కోసం డబ్బును వాడుకోవచ్చు.
సురక్షిత రుణం కాబట్టి.. అసురక్షిత రుణాలతో పోలిస్తే ఎల్ఏపీ సాధారణంగా తక్కువ వడ్డీ రేట్లను అందిస్తుంది. రుణగ్రహీత తిరిగి చెల్లించడంలో విఫలమైతే బకాయి ఉన్న మొత్తాన్ని తిరిగి పొందేందుకు రుణదాతకు ఆస్తిని స్వాధీనం చేసుకుని విక్రయించే హక్కు ఉంటుంది. రుణ కాల వ్యవధి సాధారణంగా 5 నుండి 15 సంవత్సరాల మధ్య ఉంటుంది. ఈఎంఐ వంటి తిరిగి చెల్లింపు ఆప్షన్స్ ఉంటాయి.
రుణ సమయంపై తప్పకుండా శ్రద్ధ పెట్టాలి. మీకు ఆఫర్ చేస్తున్నారు కదా అని దీర్ఘకాలిక ఆప్షన్ పెట్టుకోవద్దు. మీరు త్వరలో రుణాన్ని క్లియర్ చేసుకోవాలని భావిస్తే సరైన సమయాన్ని ఎంచుకోండి. తక్కువ కాల వ్యవధితో మీ మీద వడ్డీ బాధ్యత కూడా ఎక్కువగా ఉండదు.
ఆస్తిపై రుణం తీసుకునే ముందు మీరు ఇతర రుణదాతల వడ్డీ రేట్లను సరిపోల్చాలి. అలాగే మీరు రుణదాతల మధ్య లోన్ రేట్లను సరిపోల్చండి. తక్కువ అంచనాతో నెలవారీ వాయిదాలతో (ఈఎంఐ) లోన్‌ను ఎంచుకోవాలి. ఇది మీకు పెద్దగా ఇబ్బందిని కలగనివ్వదు.
రుణదాతలు సాధారణంగా ఎక్కువ క్రెడిట్ స్కోర్‌లు కలిగి ఉన్నవారి మీద ఆసక్తి చూపిస్తారు. మంచి క్రెడిట్ స్కోర్ ఆర్థిక బాధ్యతను చూపిస్తుంది. సకాలంలో తిరిగి చెల్లించే అవకాశం ఉందని నమ్ముతారు. అందుకే రుణదాతలు తక్కువ రేట్లు ఇవ్వడానికి ఎక్కువ మొగ్గు చూపుతారు. మంచి క్రెడిట్ స్కోర్ మీకు లోన్ పొందడంలో సహాయపడుతుంది.
ఆస్తిపై రుణాన్ని విడుదల చేయడానికి సమయం పడుతుంది. ఎందుకంటే రుణాన్ని ఆమోదించడానికి మీ ఆస్తి విలువను లెక్కగట్టాలి. రుణదాతలు మీ రుణాన్ని పంపిణీ చేయడానికి మీ ఆస్తులను అంచనా వేస్తారు. రుణం ఎప్పుడు మంజూరు అవుతుందో మీరు తెలుసుకోవాలి. దాని ప్రకారం మీ లోన్‌కు అవసరమైన డాక్యుమెంట్‌లను సెట్ చేసుకోవచ్చు.
చాలా మంది రుణదాతలు ఇచ్చిన నిబంధనలు, షరతులను పట్టించుకోవడం లేదు. భవిష్యత్తులో మీరు ఇబ్బందిని చూడవచ్చు. అందుకే వారు ఇచ్చిన ఎల్ఏపీ నిబంధనలు, షరతులను ఒకటికి రెండుసార్లు చదవడం చాలా ముఖ్యం.