Allu Arjun House Attack : హీరో అల్లు అర్జున్ ఇంటిపై దాడి, స్పందించిన అల్లు అరవింద్
Allu Arjun House Attack : హీరో అల్లు అర్జున్ ఇంటిపై ఓయూ విద్యార్థులు దాడికి పాల్పడ్డారు. ఈ దాడిపై అల్లు అరవింద్ విచారం వ్యక్తం చేశారు. ఇది సంయమనం పాటించాల్సిన సమయం అన్నారు. ఎవరూ తొందరపాటు చర్యలకు దిగొద్దని విజ్ఞప్తి చేశారు.
Allu Arjun House Attack : సంధ్య థియేటర్ తొక్కిసలాట పెనుదుమారం రేపుతోంది. హీరో అల్లు అర్జున్ ఇంటిపై ఓయూ విద్యార్థులు దాడికి దిగారు. ఆదివారం సాయంత్రం ఓయూ విద్యార్థులు అల్లు అర్జున్ ఇంటిపై టమాటాలు విసిరారు. పూలకుండీలు పగలగొట్టారు. అడ్డుకున్న సెక్యూరిటీ సిబ్బందిపై దాడికి పాల్పడ్డారు. ఈ దాడిపై అల్లు అర్జున్ తండ్రి అల్లు అరవింద్ స్పందించారు. దాటి ఘటనపై విచారం వ్యక్తం చేశారు. అందరూ సంయమనం పాటించాలన్నారు.
సంయమనం పాటించాల్సిన సమయం
"మా ఇంటి బయట జరిగిందంతా అందరూ చూశారు. కానీ ప్రస్తుతం మేం సంయమనం పాటించాల్సిన సమయం. మేము దేనికీ రియాక్ట్ అవ్వకూడదు. పోలీసులు వచ్చి ఆందోళనకారులను తీసుకెళ్లారు. వారిపై కేసు పెట్టారు. ఇక్కడికి ఎవరైనా గొడవ చేయడానికి వస్తే, వారిని అదుపులోకి తీసుకునేందుకు పోలీసులు సిద్ధంగా ఉన్నారు. కనుక ఇటువంటివి ఎవరూ ఎంకరేజ్ చేయకూడదు. మేము దాడిపై రియాక్ట్ అవ్వడం కానీ, మీడియా వారు వచ్చారు కాబట్టి ఏమైనా మాట్లాడడం జరగదు. మేము ఇప్పుడు సంయమనం పాటించాల్సిన సమయం. అదే చేస్తూన్నాం. చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుంది. ఈ ఘటనపై మేం స్పందించం. ఎవరూ తొందరపడి ఎలాంటి చర్యలకు దిగవద్దు"- అని అల్లు అరవింద్ విజ్ఞప్తి చేశారు.
హైదరాబాద్‌లోని అల్లు అర్జున్ ఇంటిపై ఓయూ విద్యార్థులు దాడి చేశారు. ఇంటి ఆవరణలోని పూలకుండీలను కొందరు ధ్వంసం చేశారు. బన్నీ ఇంటిపైకి టమాటాలు విసిరారు. న్యాయం చేయాలి, న్యాయం చేయాలి అంటూ నినాదాలు చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు.. ఓయూ విద్యార్థులను అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనపై విచారణ జరుగుతున్నామని చెప్పారు. ఆదివారం సాయంత్రం సమయంలో ఒక్కసారిగా కొందరు వ్యక్తులు ప్లకార్డులు పట్టుకొని బన్నీ ఇంటి వైపు వచ్చారు. లోపలికి వెళ్లేందుకు గేటు తీయాలని కోరారు. అందుకు అల్లు అర్జున్ ఇంటి సిబ్బంది నిరాకరించారు. దీంతో నినాదాలు చేస్తూ.. గోడపైకి ఎక్కారు. అక్కడి నుంచి ఇంటి ఆవరణలోకి దూకారు. పూల కుండీలను ధ్వంసం చేశారు. ఇంటి లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించగా.. సెక్యూరిటీ సిబ్బంది అడ్డుకున్నారు. ఈ క్రమంలో పరస్పరం దాడి చేసుకున్నారు. ఈ ఘటనతో అక్కడ ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది.
అల్లు అర్జున్ ఇంటిపై దాడి నేపథ్యంలో పిల్లలను అల్లు అర్జున్ మామ చంద్రశేఖర్ ఇంటికి తరలించారు. తొక్కిసలాట ఘటనలో బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని పలువురు ప్లకార్డులు పట్టుకుని అల్లు అర్జున్ ఇంటిపై దాడికి దిగారు. ఈ ఘటనలో ఆరుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
సంబంధిత కథనం