credit card payments: క్రెడిట్ కార్డు బిల్లులను లేట్ గా పే చేస్తున్నారా?సుప్రీంకోర్టు తీర్పుతో పెరగనున్న వడ్డీ భారం
క్రెడిట్ కార్డు బిల్లులను లేట్ గా చెల్లించే వారికిి బ్యాడ్ న్యూస్. వారిపై ఈ లేట్ పేమెంట్ వడ్డీ భారం భారీగా పెరిగే అవకాశం ఉంది. అలాంటి మొత్తాలపై 30 శాతానికి మించి వడ్డీ వేయకూడదన్న ఎన్సీడీఆర్సీ నిర్ణయాన్ని సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. ఎంత వడ్డీ విధించాలన్నది బ్యాంక్ ల నిర్ణయమని తేల్చి చెప్పింది.
Supreme Court: క్రెడిట్ కార్డు బిల్లులను గడువు తీరిన తరువాత చెల్లించేవారికిక సుప్రీంకోర్టు షాక్ ఇచ్చింది. అలాంటి గడువు తీరిన క్రెడిట్ కార్డు చెల్లింపులపై బ్యాంకులు 30 శాతానికి మించి వార్షిక వడ్డీ వసూలు చేయరాదని జాతీయ వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్ (National Consumer Disputes Redressal Commission NCDRC) గతంలో ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు శుక్రవారం తిప్పికొట్టింది.
అధిక వడ్డీ రేట్లు వద్దు
గడువు తీరిన క్రెడిట్ కార్డు చెల్లింపులపై బ్యాంకులు 30 శాతానికి మించి వార్షిక వడ్డీ వసూలు చేయడం అన్యాయమైన వాణిజ్య విధానమని ఎన్సీడీఆర్సీ ప్రకటించింది. అయితే, ఆ నిర్ణయాన్ని జస్టిస్ బేలా ఎం త్రివేది, జస్టిస్ సతీష్ చంద్ర శర్మల సుప్రీంకోర్టు ధర్మాసనం కొట్టివేసింది. క్రెడిట్ కార్డు వడ్డీ రేట్లపై ఎన్సీడీఆర్సీ పరిమితిని సవాలు చేస్తూ స్టాండర్డ్ చార్టర్డ్ బ్యాంక్, సిటీబ్యాంక్, హెచ్ఎస్బీసీ సహా పలు బ్యాంకులు దాఖలు చేసిన అప్పీళ్లపై సుప్రీంకోర్టు (supreme court) ఈ తీర్పు వెలువరించింది. ఎన్సీడీఆర్సీ తీర్పును పక్కనపెట్టి అప్పీళ్లకు అనుమతిస్తున్నట్లు జస్టిస్ త్రివేది తీర్పును వెలువరించారు.
గతంలోనే స్టే..
ఎన్సీఆర్డీఆర్సీ ఉత్తర్వులపై 2009 ఫిబ్రవరి 3న సుప్రీంకోర్టు స్టే విధించింది. భారతదేశంలోని చాలా క్రెడిట్ కార్డు (credit cards) కంపెనీలు ప్రస్తుతం వార్షిక వడ్డీ రేట్లలో 22-49% వరకు వసూలు చేస్తున్నాయి. క్రెడిట్ కార్డు బకాయిలపై ఏడాదికి 36 శాతం నుంచి 49 శాతం వరకు వడ్డీ రేట్లను వసూలు చేయడం దోపిడీయేనని ఆవాజ్ ఫౌండేషన్ అనే స్వచ్ఛంద సంస్థ దాఖలు చేసిన పిటిషన్ పై 2008 లో ఎన్సీఆర్డీఆర్సీ పై ఆదేశాలను వెలువరించింది.
ఇంకా భారం పెంచడమే..
ఇటువంటి అధిక వడ్డీ రేట్లు వినియోగదారులపై, ముఖ్యంగా ఇప్పటికే ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నవారిపై అసమానమైన భారాన్ని మోపుతాయని ఎన్సీఆర్డీఆర్సీ పేర్కొంది. ఈ వడ్డీ రేట్లపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) నియంత్రణ లేకపోవడాన్ని ఎన్సిడిఆర్సి విమర్శించింది. వడ్డీ రేటును నిర్వచించడంలో సెంట్రల్ బ్యాంక్ విఫలమైందని, ఆర్థిక సంస్థలు రుణగ్రహీతలను దోపిడీ చేయడానికి అనుమతించాయని వాదించింది. అపరాధ వడ్డీని మూలధనంగా మార్చరాదని, బకాయిలను మరింత పెంచడానికి బ్యాంకులు కాంపౌండింగ్ పద్ధతులను ఉపయోగిస్తున్నాయని కమిషన్ ఆరోపించింది.
ఇతర దేశాల్లో వడ్డీ రేట్లు
తన ఆదేశాలకు మద్దతుగా, ఎన్సిడిఆర్సి (NCDRC) గ్లోబల్ క్రెడిట్ కార్డ్ వడ్డీ రేట్లను పోల్చింది, యునైటెడ్ స్టేట్స్, యునైటెడ్ కింగ్డమ్ వంటి అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థలలో ఈ వడ్డీ రేట్లు గణనీయంగా తక్కువగా ఉన్నాయి. ఇక్కడ రేట్లు 9.99% నుండి 17.99% వరకు మాత్రమే ఉన్నాయని గుర్తు చేసింది. అయితే బ్యాంకులు వసూలు చేసే నిర్దిష్ట వడ్డీ రేట్లను తాము నియంత్రించబోమని, బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్ 1949 ప్రకారం ఆయా నిర్ణయాలను ఆయా బ్యాంకుల విచక్షణకే వదిలేస్తున్నామని ఆర్బీఐ పేర్కొంది. అధిక వడ్డీ రేట్లను వసూలు చేయవద్దని ఆర్థిక సంస్థలను సెంట్రల్ బ్యాంక్ ఆదేశించినప్పటికీ, కఠినమైన పరిమితులను విధించలేదు.
బ్యాంకుల వాదన
వడ్డీ రేట్లను పరిమితం చేయడం వల్ల తమ లాభదాయకత దెబ్బతింటుందని, రుణ లభ్యతపై ప్రభావం పడుతుందని బ్యాంకులు వాదించాయి. అధిక వడ్డీ రేట్లు (bank interest rates) డిఫాల్ట్ ప్రమాదాలను, కస్టమర్ అసిస్టెన్స్, ఇతర సేవలను అందించడానికి అవసరమైన ఖర్చులను భర్తీ చేస్తాయని వారు పేర్కొన్నారు. ముఖ్యంగా ఆర్బీఐ (RBI) పరిధిలోకి వచ్చే వడ్డీ రేట్ల విషయంలో తమ కార్యకలాపాలను నియంత్రించే అధికారం ఎన్సీడీఆర్సీకి లేదని వారు వాదించారు. బ్యాంకుల తరఫున సీనియర్ న్యాయవాదులు అభిషేక్ మను సింఘ్వీ, ధ్రువ్ మెహతా వాదనలు వినిపించారు. ఎన్సీడీఆర్సీ తీర్పును కొట్టివేస్తూ, వడ్డీ రేట్లు మార్కెట్ డైనమిక్స్, రెగ్యులేటరీ పర్యవేక్షణ ద్వారా నియంత్రించబడతాయని, వినియోగదారుడి ద్వారా కాదని బ్యాంకుల వాదనను సుప్రీంకోర్టు సమర్థించింది.
టాపిక్