Hyderabad Murder: కుమార్తెను కిడ్నాప్‌ చేసిన ఆటోడ్రైవర్‌‌ను హత్య చేసిన తండ్రి, ఏడాదిన్నర తర్వాత వెలుగు చూసిన వైనం-father who killed auto driver who kidnapped his daughter ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Hyderabad Murder: కుమార్తెను కిడ్నాప్‌ చేసిన ఆటోడ్రైవర్‌‌ను హత్య చేసిన తండ్రి, ఏడాదిన్నర తర్వాత వెలుగు చూసిన వైనం

Hyderabad Murder: కుమార్తెను కిడ్నాప్‌ చేసిన ఆటోడ్రైవర్‌‌ను హత్య చేసిన తండ్రి, ఏడాదిన్నర తర్వాత వెలుగు చూసిన వైనం

Bolleddu Sarath Chandra HT Telugu
Dec 23, 2024 08:02 AM IST

Hyderabad Murder: ఇన్‌స్టా గ్రామ్‌ రీల్స్‌ చేస్తున్న బాలికను మాయమాటలతో అపహరించిన యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. ఏడాదిన్నర తర్వాత ఈ విషయం వెలుగు చూసింది. ఉపాధి కోసం ఎన్టీఆర్‌ జిల్లా నుంచి హైదరాబాద్ వెళ్లిన కుటుంబంలో బాలికను ఆటోడ్రైవర్ అపహరించగా ఆ తర్వాత బాలిక తండ్రి అతడిని ట్రాప్ చేసి చంపేశాడు.

ఏడాదిన్నర క్రితం హత్యకు గురైన ఆటో డ్రైవర్ కుమార్
ఏడాదిన్నర క్రితం హత్యకు గురైన ఆటో డ్రైవర్ కుమార్

Hyderabad Murder: మైనర్‌ బాలికను అపహరించాడనే కోపంతో ఆటో‌‌డ్రైవర్‌ను వలపన్ని హత్య చేసిన ఉదంతం హైదరాబాద్‌లో వెలుగు చూసింది. తమ కుమార్తెను కిడ్నాప్ చేశాడనే కక్షతో తల్లిదండ్రులు ట్రాప్ చేసి నిందితుడిని దారుణంగా హత్య చేశారు.  మృతుడి ఆటోను   నిందితుడు వాడుకుంటున్నాడు. ఏడాదిన్నర క్రితం జరిగిన హత్య కేసు మిస్టరీని ఆటో వెనుక బంపర్ సాయంతో వెలికి తీశారు. 

ఆంధ్రప్రదేశ్‌లోని  ఎన్టీఆర్ జిల్లా రెడ్డిగూడెం మండలానికి  చెందిన అలవాల మురళీరెడ్డి క్యాబ్ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. హైదరాబాద్‌లోని జ ద్గిరిగుట్టలోని బీరప్పనగర్‌లో భార్య ద్వారక, 14ఏళ్ల  కుమార్తెతో కలిసి ఉండేవాడు.  బాలిక స్థానిక ప్రభుత్వ పాఠశాలలో చదువుకునేది. కరోనా సమయంలో ఆన్ లైన్ క్లాసుల కోసం బాలికకు ఓ స్వచ్ఛంద సంస్థ ట్యాబ్ ఇచ్చింది. అందులో యాప్‌లలో బాలిక రీల్స్ చేసేది. ఈ క్రమంలో  స్నాప్‌చాట్‌ యాప్‌లో సంగారెడ్డి జిల్లా నారాయణ ఖేడ్‌‌కు చెందిన ఆటోడ్రైవరు కుమార్ (30) పరిచయం అయ్యాడు. 

కుమార్‌కు అప్పటికే  వివాహం కాగా.. భార్యతో తగాదాల నేపథ్యంలో బోరబండలోని సోదరి దగ్గర ఉండేవాడు. స్నాప్‌చాట్‌లో బాలికతో పరిచయం చేసుకుని తనకు పెద్ద దర్శకులు తెలుసని వారి సాయంతో  సినిమాల్లో  అవకాశాలు ఇప్పిస్తానని నమ్మించి అపహరించండి. కుమార్‌ మాటలు నమ్మి బాలిక ఇంటి నుంచి  వెళ్లిపోయింది. 

2023 సంక్రాంతి సమయంలో ఇంటి నుంచి వెళ్లిపోయిన బాలిక నేరుగా కుమార్ వద్దకు చేరింది. బాలికను  వారం రోజుల పాటు  అమీర్‌పేటలోని ఓ గదిలో ఉంచిన అతను లైంగికంగా వేధించాడు. దీంతో  భయపడిన బాలిక అతని చెర నుంచి తప్పించుకుని వెళ్తుండగా పోలీసులు గుర్తించారు. ఎక్కడకు వెళుతున్నావని ఆరా తీయడంతో ఇంటికి వెళితే తల్లిదండ్రులు మందలిస్తారనే భయంతో  పోలీసులకు తప్పుడు సమాచారం చెప్పింది.  తాను అనాథనని, తల్లిదండ్రులు చిన్నతనంలోనే చనిపోయారని వారికి  చెప్పడంతో పోలీసులు నింబోలి అడ్డాలోని ప్రభుత్వ బాలికల సంరక్షణ గృహానికి తరలించారు.

కుమార్తె కోసం గాలిస్తూ…

బాలిక అదృశ్యం అయ్యాక ఆమె తండ్రి మురళీ రెడ్డి  కుమార్తె అచూకీ కోసం తీవ్రంగా గాలించాడు. పోలీసులకు ఫిర్యాదు చేస్తే అందరికి తెలిసిపోతుందనే ఉద్దేశంతో తానే సొంతంగా గాలించాలనుకున్నాడు. కూతురు వాడే ట్యాబ్‌ను చూసిన తండ్రి అందులో కుమార్తె  చేసిన వాట్సప్ చాటింగ్‌లను  గమనించాడు. దీంతో తన కుమార్తె అతని వద్దే ఉంటుందని భావించి  కుమార్తెను రక్షించాలనుకున్నాడు. 

ఆటో డ్రైవర్‌ కుమార్‌ ఫోన్‌ నంబరుకు  భార్య ఫోన్ నంబరుతో చాటింగ్ చేయించాడు. మురళీ రెడ్డి భార్య  ద్వారక యువతిగా ఉన్నప్పటి ఫోటోలు పంపి అతడిని ముగ్గులోకి దించింది. నెలన్నర చాటింగ్ తర్వాత 2023 మార్చి 10న మియాపూర్‌లో ఉండే  బావమరిది ఊరు వెళ్లిన విషయం తెలుసుకుని ద్వారకతో కుమార్‌ను ఆ ఇంటికి రప్పించారు.  అతడిని  తాళ్లతో కట్టేసి  భార్యాభర్తలు  కర్రలతో మర్మాంగం, ఇతర భాగాల్లో చితకబాదారు. తమ కుమార్తె అచూకి చెప్పాలని తీవ్రంగా హింసించారు. కొద్దిసేపటి తర్వాత స్పృహ తప్పడంతో చనిపోయాడనుకుని మృతదేహాన్ని మాయం చేయాలనుకు న్నారు. 

కారు డిక్కీలో శవాన్ని వేసుకుని.. 11వ తేదీ కోదాడ సమీపంలోని సాగర్ కాలువ దగ్గరికి చేరుకున్నారు. కుమార్‌ శరీరాన్ని  బయటకు తీసే సమయంలో కుమార్ చేతులు, కాళ్లు కదిలించడంతో కుమార్ దేహానికి  రాళ్లు కట్టి కాలువలో పడేశారు. ఆ తర్వాత  కుమార్ కనిపించక పోవడంతో అతని భార్య బోరబండ పోలీసులు ఫిర్యాదు చేయడంతో 2023లో కేసు  నమోదైంది.

హంతకులను పట్టించిన ఆటో…

కుమార్‌ హత్య తర్వాత నిందితుడు  మురళి..హతుడు కుమార్ ఆటోని ఇంటికి తీసుకెళ్లాడు. నకిలీ రిజిస్ట్రేషన్ నంబరుతో ఆటోను నడుపుతున్నాడు. బాలిక అదృశ్యమైన ఏడాది తర్వాత  2023 డిసెంబరులో అతని కుమార్తె సూర్యాపేట జిల్లా సఖి కేంద్రం నుంచి కాల్ వచ్చింది. బాలిక అచూకీని ఆధార్‌ ద్వారా గుర్తించిన పోలీసులు  ప్రభుత్వ సంరక్షణ గృహంలో కుమార్తె ఉన్నట్లు చెప్పడంతో అక్కడికెళ్లి ఆమెను ఇంటికి తీసుకొచ్చారు.  

డిసెంబర్‌ మొదటి వారంలో  కుమార్ ఆటో మాదాపూర్‌ గూగుల్ కార్యాలయం  అతడి బావమరిది యోహన్ గుర్తించాడు. ఆటో వెనుక బంపర్  భిన్నంగా ఉండడంతో అది తన బావదేనని గుర్తించి బోరబండ పోలీసులకు సమాచారం ఇచ్చాడు. పోలీసులు ఆటో రిజిస్ట్రేషన్ నంబరు మీద ఉన్న ట్రాఫిక్ చలానాలను కొన్ని నెలల క్రితం చెల్లించినట్లు గుర్తించారు. అందులో ఉన్న  మురళి  ఫోన్ నంబరు గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. మురళీని అదుపులోకి తీసుకుని ప్రశ్నించడంతో హత్య విషయం వెలుగులోకి వచ్చింది.  భార్యాభర్తల్ని అరెస్ట్‌ చేశారు. కూతురు చేసిన పనితో తల్లిదండ్రులు జైలు పాలు కావాల్సి వచ్చింది. హతుడు కుమార్‌ మృతదేహం గుర్తించాల్సి ఉంది. 

Whats_app_banner