Warangal Crime : చదివింది డిగ్రీ.. దొంగతనం చేయడంలో దిట్ట.. ఏకంగా 17 చోట్ల చోరీ, చివరకు అరెస్టు
Warangal Crime : బెట్టింగ్ యాప్‌ల కారణంగా నష్టపోయి చివరికి చోరీలకు పాల్పడతున్న వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడి నుంచి సూమారు 28 లక్షల 50 వేల విలువైన 334 గ్రాముల బంగారు, కిలో 640 గ్రాముల వెండి ఆభరణాలు, రూ. 13 వేల నగదు, ఒక ద్విచక్రవాహనం, ఒక సెల్‌ఫోన్ స్వాధీనం చేసుకున్నారు.
ఈ అరెస్టుకు సంబంధించిన వివరాలను వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా వెల్లడించారు. కొండపల్లి ధర్మరాజు, వయస్సు 30, రాయపర్తి, వరంగల్ జిల్లా. ప్రస్తుతం హనుమకొండ సుబేదారిలోని పోస్టల్ కాలనీలో నివాసం ఉంటున్నాడు. నిందితుడు ధర్మరాజు డిగ్రీ పూర్తి చేసి.. కొంత కాలం రాయపర్తి మండల కేంద్రంలో బిర్యానీ సెంటర్ నిర్వహించాడు. అందులో నష్టపోవడంతో హనుమకొండ పోస్టల్ కాలనీలో విద్యార్థినంటూ కిరాయి ఇంట్లోకి మకాం మార్చాడు అని సీపీ వివరించారు.
నష్టపోయిన డబ్బును తిరిగి పొందేందుకు వివిధ మార్గాల్లో వ్యక్తిగత రుణాలు తీసుకున్నాడు. ఆన్‌లైన్ బెట్టింగ్ ఆడటం ద్వారా నిందితుడు నష్టపోయి, తీసుకున్న రుణాలకు వాయిదాలు చెల్లించలేక అప్పులపాలయ్యాడు. దీంతో నిందితుడు తన అప్పులను తీర్చడంతో పాటు.. సులభంగా డబ్బు సంపాదించాలని దొంగగా మారాడు. చోరీలు చేసేందుకు సాధనాలను సమకూర్చుకున్నాడని పోలీస్ కమిషనర్ వివరించారు.
తన ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తూ.. పగటి సమయాల్లో తాళం వేసి ఉన్న ఇండ్లను గుర్తించేవాడు. రాత్రి సమయాల్లో తాళం వేసివున్న ఇండ్లల్లో చోరీలకు పాల్పడేవాడు. ఇదే రీతిలో నిందితుడు వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో మొత్తం 17 చోరీలకు పాల్పడ్డాడు. కేయూసీ పోలీస్ స్టేషన్ పరిధిలో 8, హనుమకొండ, హసన్‌పర్తి పోలీస్ స్టేషన్ల పరిధిలో 2 చొప్పున, సుబేదారి, సంగెం, ఘన్‌పూర్, పాలకుర్తి, దేవరుప్పుల పోలీస్ స్టేషన్ల పరిధిలో ఒకటి చోప్పున చోరీలకు పాల్పడ్డాడని సీపీ వెల్లడించారు.
ఈ చోరీలపై అప్రమత్తమైన పోలీసులు సెంట్రల్ జోన్ డీసీపీ షేక్ సలీమా పర్యవేక్షణలో.. ప్రత్యేక దర్యాప్తు బృందాలను ఏర్పాటు చేశాం. ఈ దర్యాప్తులో భాగంగా పోలీసులు తమ వద్ద ఉన్న అధునిక టెక్నాలజీని వినియోగించుకున్నారు. నిందితుడుని గుర్తించడంతో పాటు అతనిపై నిఘా పెట్టారు. నిందితుడు ధర్మరాజు మంగళవారం రోజు తాను చోరీ చేసిన చోరీ సోత్తు అమ్మేందుకు వాహనంపై కేయూసీ వైపు వస్తునట్లుగా పోలీసులకు పక్కా సమాచారం వచ్చిందని సీపీ వివరించారు.
సీసీఎస్, కేయూసీ పోలీసులు బృందంగా ఏర్పడ్డారు. కేయూ క్రాస్ రోడ్డులో వాహనాలు తనిఖీ చేస్తుండగా.. నిందితుడు పోలీసులకు పట్టుపడ్డాడు. విచారణలో నిందితుడు పాల్పడిన నేరాలను అంగీకరించాడు. అతని నుంచి చోరీ చేసిన సోత్తును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని పట్టుకొని సొత్తును రికవరీ చేయడంలో ప్రతిభ కనబరిచిన సిబ్బందని.. పొలీస్ కమీషనర్ అభినందిచారు.