CM Revanth Musi Yatra : మూసీ ప్రక్షాళన ఆగదు..! అడ్డొస్తే బుల్డోజర్‌ ఎక్కి తొక్కిస్తా - సీఎం రేవంత్‌రెడ్డి ఫైర్-telangana cm revanth reddy lashes out brs party in musi river yatra ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Cm Revanth Musi Yatra : మూసీ ప్రక్షాళన ఆగదు..! అడ్డొస్తే బుల్డోజర్‌ ఎక్కి తొక్కిస్తా - సీఎం రేవంత్‌రెడ్డి ఫైర్

CM Revanth Musi Yatra : మూసీ ప్రక్షాళన ఆగదు..! అడ్డొస్తే బుల్డోజర్‌ ఎక్కి తొక్కిస్తా - సీఎం రేవంత్‌రెడ్డి ఫైర్

Maheshwaram Mahendra Chary HT Telugu
Nov 08, 2024 08:01 PM IST

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేపట్టిన మూసీ సంకల్ప యాత్ర ముగిసింది. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన.. బీఆర్ఎస్ పార్టీపై తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు. ప్రాజెక్టుకు ఎవరైనా అడ్డొస్తే జేసీబీతో తొక్కించి తీరుతానంటూ సీరియస్ కామెంట్స్ చేశారు. ఏది ఏమైనా మూసీ ప్రక్షాళన చేసి తీరుతానని స్పష్టం చేశారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

ఏది ఏమైనా మూసీ ప్రక్షాళన చేసి తీరుతామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. యాదాద్రి జిల్లాలో శుక్రవారం చేపట్టిన మూసీ సంకల్ప యాత్ర ముగిసింది. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన… మూసీ ప్రాజెక్టుకు ఎవరు అడ్డొచ్చినా పండబెట్టి జేసీబీతో తొక్కించి తీరుతానంటూ సీరియస్ కామెంట్స్ చేశారు.

ఒకనాడు మంచి నీటిని అందించిన మూసీ ఇప్పుడు మురికి కూపంగా మారి విషాన్ని చిమ్ముతోందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. పాలకులు పగ పట్టారా..? దేవుడు శాపం పెట్టిండా..? అని మూసీ పరివాహక ప్రాంత ప్రజలు బాధపడుతున్నారని చెప్పుకొచ్చారు. ఇక్కడి ప్రజలు మూసీ పునరుజ్జీవింప చేయాలని కోరుతున్నారని గుర్తు చేశారు.

“ఈ ప్రాంతంలో కులవృత్తులు చేసుకునే పరిస్థితి లేదు. ఇక్కడి చెరువుల్లో చేపలు బ్రతికే పరిస్థితి లేదు. ఇక్కడ పండిన పంటలను తినే పరిస్థితి లేదు. ఇక్కడ పశువుల పాలు తాగాలన్నా ఆలోచించాల్సిన దుస్థితి ఉంది. పాడిపంటలతో ఎంతో సంతోషంగా బతికిన ఇక్కడి ప్రజలు.. ఇపుడు భూములు అమ్ముకోవాల్సిన పరిస్థితి. బీఆర్ఎస్ నేతలకు దోచుకోవడమే తప్ప ప్రజలకు మేలు చేయడం తెలియదు. అందుకే మూసీ ప్రక్షాళనను అడ్డుకోవాలని అడ్డుకోవాలని చూస్తున్నారు” అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విమర్శించారు.

మూసీ ప్రక్షాళనకు అండగా ఉంటామని చెప్పిన కమ్యూనిస్టు పక్షాలకు సీఎం రేవంత్ రెడ్డి ధన్యవాదాలు చెప్పారు. మూసీ కాలుష్యంతో ఇక్కడి ప్రజలు అణుబాంబు కంటే ప్రమాదాన్ని ఎదుర్కోబోతున్నారని అన్నారు. వరంగా ఉండాల్సిన మూసీ శాపంగా మారుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. అందుకే మూసీ ప్రక్షాళన చేయాలో లేదో ఒక్కసారి ఆలోచించండని చెప్పారు.

ప్రక్షాళన చేసి తీరుతాం - ముఖ్యమంత్రి రేవంత్

“మోదీ గుజరాత్ ను బాగు చేసుకోవచ్చు.. కానీ మేం మూసీని బాగుచేసుకోవద్దా..? ఇది నా జన్మదినం కాదు... ఇక్కడికి రావడంతో నా జన్మ ధన్యమైంది. సంగెం శివయ్యను దర్శించుకుని సంకల్పం తీసుకున్నా. మూసీ ప్రక్షాళన చేసి తీరుతాం. బుల్డోజర్లకు అడ్డు పడతామంటున్న వాళ్లు వాళ్ల పేర్లు ఇవ్వండి. మా నల్లగొండ ప్రజలతో వచ్చి మీపై బుల్డోజర్లు తీసుకెళ్లకపోతే నేను పేరు మార్చుకుంటా. బుల్డోజర్లకు అడ్డుపడతామని మాట్లాడుతున్న బిల్లా రంగాలు.. ధైర్యం ఉంటే తారీఖు చెప్పండి. మా వెంకన్నను బుల్డోజర్ పై ఎక్కిస్తా... మా ఎమ్మెల్యే సామెల్ తో జెండా ఊపిస్తా” అంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కామెంట్స్ చేశారు.

అసలు సినిమా ముందుంది…

మూడు నెలలు జైలుకు పోతేనే నీకు దుఃఖం వస్తే... మూసీ పరివాహక బిడ్డల జీవితాలు పోతుంటే నీకు పట్టదా..? అంటూ బీఆర్ఎస్ నేతలను ఉద్దేశించి రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. “నల్లగొండ ప్రజలు నీకు ఓట్లు వేయలేదా కేసీఆర్ ?మూసీ ప్రక్షాళన అడ్డుకోవాలని చూస్తున్నావ్. నల్లగొండ జిల్లా పౌరుషాల గడ్డ... మూసీ ప్రక్షాళనను అడ్డుకుంటే మూసీలోనే పాతరేస్తారు. వాళ్ల అవినీతి కోసం, వాళ్ల దోపిడీ కోసం మూసీని అడ్డుకోవాలని చూస్తున్నారు. మూసీ పునరుజ్జీవం జరిగి తీరుతుంది. ఇవాళ్టి పాదయాత్ర ట్రైలర్ మాత్రమే.. అసలు సినిమా ముందుంది” అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.

“బిల్లా రంగాలకు సవాల్ విసురుతున్నాను. 2025 జనవరి మొదటి వారంలో వాడపల్లి నుంచి హైదరాబాద్ వరకు పాదయాత్ర మొదలుపెడతా. బిల్లా రంగాలు రావాలి.. మిమ్మల్ని ఇక్కడి ప్రజలు రానిస్తారో.. నడుముకు తాడుకట్టి మూసీలో ముంచేస్తారో చూద్దాం” అని సీఎం రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు.

Whats_app_banner

సంబంధిత కథనం