BRS to Congress : అడ్డుకుంటున్నా ఆగని చేరికలు..! ఎన్నికల వేళ నల్లగొండ కాంగ్రెస్ లో విచిత్ర రాజకీయాలు
Loksabha Elections in Telangana 2024: పార్లమెంట్ ఎన్నికల వేళ నల్గొండ పార్లమెంట్ నియోజకవర్గపరిధిలో జరుగుతున్న కొన్ని చేరికలు కాంగ్రెస్ లో అగ్గిని రాజేస్తున్నాయి. స్థానిక నేతలు వద్దని చెబుతున్నప్పటికీ… జిల్లాకు చెందిన కీలక నేతల మద్దతుతో పలువురు బీఆర్ఎస్ నేతలు…కాంగ్రెస్ కండువాలు కప్పేసుకుంటున్నారు. లు
Loksabha Elections in Telangana 2024: ఎన్నికల ముందు ఇతర పార్టీల నుంచి వచ్చి చేరే నాయకులను తమ పార్టీల్లో చేర్చుకోవడం, దాని ద్వారా ఎన్నికల్లో లబ్ది పొందుతామని భావించడం సర్వసాధారణం. ప్రస్తుతం తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలో ఉండడడంతో సహంజంగానే వివిధ రాజకీయ పక్షాల నుంచి ప్రధానంగా బీఆర్ఎస్ నుంచి చేరేవారి సంఖ్య ఎక్కువగా ఉంది. వాస్తవానికి బీఆర్ఎస్(BRS) నుంచి కాంగ్రెస్ లోచేరుతున్న నాయకుల్లో అత్యధికులు గతంలో కాంగ్రెస్ పార్టీలో పని చేసిన వారే. వివిధ హోదాల్లో, పదవులను అనుభవించిన వారే. 2014లో తెలంగాణ ఏర్పాటయ్యాక జరిగిన తొలి రెండు ఎన్నికల్లో 2014, 2018లలో బీఆర్ఎస్ అధికారం చేపట్టింది. కాబట్టే అత్యధిక నాయకులు, ముఖ్య కేడర్ కాంగ్రెస్ పార్టీనీ వీడి గులాబీ గడప తొక్కారు. 2023 ఎన్నికల్లో రాష్ట్రంలో అధికార మార్పిడి జరిగింది. బీఆర్ఎస్ ను గద్దెదింపి కాంగ్రెస్ తిరిగి అధికారం చేపట్టింది. ఈ దశలో తిరుగు వలసలు మొదలయ్యాయి. బీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ పంచన చేరే వారి సంఖ్య పెరిగింది. కానీ, ఇలాంటి చేరికలను ప్రోత్సహించవద్దంటూ ఉమ్మడి నల్గొండ జిల్లా మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి (బీఎల్ఆర్) వ్యతిరేకిస్తున్నారు.
ఏం... జరిగింది..?
నల్గొండ లోక్ సభా నియోజకవర్గం(nalgonda lok sabha constituency) నుంచి కాంగ్రెస్ అభ్యర్తిగా కుందూరు రఘువీర్ రెడ్డి పోటీలో ఉన్నారు. వాస్తవానికి ఆయన అసెంబ్లీ టికెట్ ఆశించినా.. నాగార్జున సాగర్ నియోజకవర్గం నుంచి ఆయన సోదరుడు కుందూరు జయవీర్ రెడ్డికి టికెట్ ఇచ్చినందున అపుడు నిరాకరించారు. రఘువీర్ స్థానంలో మిర్యాలగూడ మున్సిపాలిటీలో కాంగ్రెస్ ఫ్లోర్ లీడర్ గా ఉండిన బీఎల్ఆర్ కు టికెట్ ఇచ్చారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన గెలిచారు. ఈ లోగా వచ్చిపడిన పార్లమెంటు ఎన్నికల్లో రఘువీర్ రెడ్డికి ఎంపీ టికెట్ దక్కింది. ఎన్నికల్లో విజయం సాధించే వ్యూహంలో భాగంగా ఆయా రాజకీయ పార్టీల నుంచి ప్రధానంగా బీఆర్ఎస్ నుంచి చేరికలకు ప్రాధాన్యం ఇస్తున్నారు. ఇలా.. మిర్యాలగూడ మున్సిపల్ చైర్మన్ తిరునగరు భార్గవ్ సహా పలువురు కౌన్సిలర్లు, ఇతర ముఖ్య నాయకులకు కొద్ది రోజులుగా కాంగ్రెస్ లోచేరడానికి ప్రయత్నిస్తున్నారు. వారి రాకను కాంగ్రెస్ కే చెందిన ఎమ్మెల్యే బీఎల్ఆర్ అడ్డుకున్నారు. కానీ, సీనియర్ నేత కుందూరు జానారెడ్డి పట్టుబట్టి గతంలో పార్టీకి దూరమైన వీరందిరీ వెనక్కి తీసుకురావడంలో సక్సెస్ అయ్యారు. మొదట కాంగ్రెస్ లో ఉన్న భార్గవ్ ఆ తర్వాత బీఆర్ఎస్ లో చేరారు. బీఆర్ఎస్ నుంచే మున్సిపల్ చైర్మన్ కూడా అయ్యారు. కానీ, ఇపుడు తిరిగి సొంత గూటికి రావాలని నిర్ణయించుకున్నారు. గతంలో భార్గవ్ తండ్రి గంగాధర్ మిర్యాలగూడెం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఈ కారణంగానే పాత నాయకులను జానారెడ్డి, ఆయన తనయుడు రఘువీర్ రెడ్డి వెనక్కి తీసుకురావడాన్ని ఎమ్మెల్యే బీఎల్ఆర్, ఆయన వర్గం జీర్ణించుకోవడం లేదు.
అడ్డకోవడం ఎందుకు..?
లోక్ సభ ఎన్నికల ముందు జరిగిన ఈ పరిణామం ఒక విధంగా బీఆర్ఎస్ కు షాక్ వంటిందే. మిర్యాలగూడ మున్సిపల్ చైర్మన్ తిరునగర్ భార్గవ్ తో పాటు 12 మంది కౌన్సిలర్లు కాంగ్రెస్ పార్టీలో చేరడం ఒక విధంగా కాంగ్రెస్ లాభం చేకూర్చే పరిణామమే. కానీ, మిర్యాలగూడ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ముఖ్య నాయకులు తో ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. మిర్యాలగూడ మున్సిపల్ చైర్మన్ తిరునగరు భార్గవ్ కాంగ్రెస్ పార్టీలో చేరికను తీవ్రంగా వ్యతిరేకించారు. చివరకు ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ గోడలు దూకే నాయకుల్లారా ఖబర్దార్ అంటూ పట్టణంలో ప్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఇదంతా ఎందుకంటే.. సీనియర్ నాయకుడు జానారెడ్డితో నిత్యం అంటకాగే ఈ నాయకులంతా తనను పట్టించుకోరని, మిర్యాలగూడలో తాను డమ్మీ ఎమ్మెల్యేగా మారిపోతానన్న ఆందోళన బీఎల్ఆర్ తో పాటు, ఆయన వర్గంలో కూడా ఉందని అంటున్నారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో బీఎల్ఆర్ కు టికెట్ రాకుండా జానారెడ్డి ప్రయత్నించారని ఆరోపణలు కూడా ఉన్నాయి. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇన్ ఛార్జ్ దీపాదాస్ మున్షి సమక్షంలో గాంధీ భవన్ లోనే వీరంతా పార్టీ కండువాలు కప్పుకుని పార్టీలో చేరారు. అయినా, ఈ చేరికను ఎమ్మెల్యే వ్యతిరేకిస్తుండడం చర్చనీయాంశంగా మారింది.
( రిపోర్టింగ్ : క్రాంతీపద్మ, HT TELUGU నల్గొండ )
.