BRS Nalgonda : నల్గొండ బీఆర్ఎస్ లో నేతల మధ్య డైలాగ్ వార్..! కేడర్ లో అయోమయం..!
Lok Sabha Election 2024 in Telangana: ఎన్నికల వేళ ఉమ్మడి నల్గొండ జిల్లా నేతలు డైలాగ్ వార్ కు దిగుతున్నారు. సొంత పార్టీలోనే ఉంటూ… విమర్శలు చేసుకుంటున్న పరిస్థితి కనిపిస్తోంది.
Lok Sabha Election 2024: లోక్ సభ ఎన్నికల ముంగిట ప్రధాన ప్రతిపక్షం భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) లో చోటు చేసుకుంటున్న పరిణామాలు ఆందోళనకరంగా ఉన్నాయన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. గడిచిన ఏడెనిమిదేళ్ళుగా ఉమ్మడి నల్గొండ జిల్లాలో కొనసాగుతున్న గ్రూపు గొడవు ముదిరి పాకాన పడ్డాయి. గత ఏడాది చివరలో జరిగిన తెలంగాణ శాసన సభ ఎన్నికలు వేదికగా తారస్థాయికి చేరిన గుంపు గొడవులు, లోక్ సభ ఎన్నికల నాటికి పరస్పర వ్యక్తిగత విమర్శల స్థాయికి చేరుకున్నాయి. తెలంగాణ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జి.జగదీష్ రెడ్డి(Jagadish Reddy) మధ్య కొనసాగుతున్న ప్రచ్ఛన్న పోరు అభ్యర్థుల గెలుపోటములపై ప్రభావం చూపేలా ఉందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
అసలేం... జరిగింది..?
ఈ లోక్ సభ ఎన్నికల్లో తన కుమారుడికి నల్గొండ, భువనగిరి పార్లమెంటు సీట్లలో ఏదో ఒక చోట టికెట్ కోసం మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ప్రయత్నించారు. కానీ, పార్టీ నాయకత్వం రెండు చోట్లా రిక్త హస్తమే చూపింది. దీనికంతటికీ ఎమ్మెల్యే జి.జగదీష్ రెడ్డి కారణమన్న అభిప్రాయంలో గుత్తా వర్గం ఉంది. అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులు ఓడిపోవడంలో తెరవెనుక పాత్ర గుత్తా సుఖేందర్ రెడ్డితే అన్న అభిప్రాయంలో జగదీష్ రెడ్డి వర్గం ఉంది. ఈ కారణంగా గుత్తా కొడుకు అమిత్ కు వ్యతిరేకంగా పార్టీ సమీక్ష సమావేశంలో నాయకత్వానికి ఫిర్యాదులు చేశారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో గుత్తా అనుచరులు అనుకున్న వారంతా వరసపెట్టి కాంగ్రెస్ గూటికి చేరారు. ఈ లోక్ సభ ఎన్నికల్లో అమిత్ కు టికెట్ రాకపోవడంతో కూడా అక్కడక్కడా మిగిలిపోయి ఉన్న గుత్తా అనుచరగణమంతా కాంగ్రెస్ గూటికి చేరుతోంది. జోరుగా బయటకు వలసలు జరుగుతున్నా.. తన అనుచరులను పార్టీ వీడకుండా అడ్డుకోవడంలో గుత్తా విఫలమయ్యారన్న విమర్శలు ఉన్నాయి. ఇదే సమయంలో ఇటీవల గుత్తా సుఖేందర్ రెడ్డి బహిరంగంగానే పార్టీ అధినాయకత్వంపై విమర్శలు ఎక్కుపెట్టారు. అధినేత తీరువల్లే పార్టీ అధికారం కోల్పోయిందని, జిల్లాలో నాయకుల వ్యవహార శైలి వల్ల ఎమ్మెల్యేలు ఓడిపోయారని, పార్టీకి సరైన సంస్థాగత నిర్మాణం కూడా లేకుండా పోయిందని, అంటూ పలు విమర్శలు చేశారు.
విమర్శా… ప్రతి విమర్శలు
గుత్తా సుఖేందర్ రెడ్డి(Gutta Sukender Reddy) పార్టీ అగ్ర నాయకత్వంపై చేసిన విమర్శల తర్వాత తుంగతుర్తి మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గాదరి కిషోర్ కుమార్ గుత్తాపై వ్యక్తిగత ఆరోపణలతో దాడికి దిగారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో కిషోర్ కుమార్ తుంగతుర్తి నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. పైసా ఖర్చు లేకుండా గుత్తాకు పార్టీ అవకాశాలు కల్పించిందని, రెండు సార్లు ఎమ్మెల్సీగా, మండలి చైర్మన్ గా పదవులు ఇచ్చిందని చెబుతూ పలు ఆరోపణలు చేశారు. దీనికి ప్రతిగా గుత్తా వర్గం జిల్లా కేంద్రంలో సమావేశమై గాదరి కిషోర్ విమర్శలను తిప్పి కొట్టారు. ఈ వర్గం కిషోర్ పైగా వ్యక్తిగత అవినీతి ఆరోపణలు చేశారు. ఈ రెండు వర్గాల మధ్య సాగుతున్న మాటల యుద్దం పార్టీ శ్రేణుల్లో అయోమయానికి కారణమవుతున్నాయని పేర్కొంటున్నారు. ఒక వైపు పార్టీ అధినేత , మాజీ సీఎం కేసీఆర్ జిల్లాని రెండు లోక్ సభా నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచారంలో భాగంగా బస్సు యాత్ర చేస్తున్నసమయంలోనే నాయకుల మధ్య మాటల దాడి జరగడం గమనార్హం.
ఇప్పటికే గుత్తా సుఖేందర్ రెడ్డి అనుచరువర్గమంతా కాంగ్రెస్ లో చేరడంతో గుత్తా కూడా పార్టీ మారుతారా అన్న ప్రచారం ఊపందుకుంది. తన పాత పార్టీ కాంగ్రెస్ లో సీనియర్ నాయకులతో ఉన్న పరిచయాలను పరిగణలోకి తీసుకుని ఆ ప్రయత్నాలు జరిగాయన్న సమాచారం అందుతోంది. తన పార్టీ మారుతున్నట్టు వస్తున్న ఆరోపణలను మండలి చైర్మన్ తిప్పి కొట్టినా.. జరుగుతున్న పరిణామాలతో ఈ వార్తలకు బలం చేకూరుతోంది.