BRS Politics: వేగంగా మారుతున్న బీఆర్ఎస్ రాజకీయాలు, సొంత దారుల్లో నేతలు.. శానంపూడి దారిలోనే గుత్తా-rapidly changing politics of brs leaders on their own paths gutta is on the way of sanampudi ,ఎన్నికలు న్యూస్
తెలుగు న్యూస్  /  ఎన్నికలు  /  Brs Politics: వేగంగా మారుతున్న బీఆర్ఎస్ రాజకీయాలు, సొంత దారుల్లో నేతలు.. శానంపూడి దారిలోనే గుత్తా

BRS Politics: వేగంగా మారుతున్న బీఆర్ఎస్ రాజకీయాలు, సొంత దారుల్లో నేతలు.. శానంపూడి దారిలోనే గుత్తా

HT Telugu Desk HT Telugu
Mar 13, 2024 05:57 AM IST

BRS Politics: పార్లమెంటు ఎన్నికల వేళ భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్)లో రాజకీయ పరిణామాలు వేగంగా చోటు చేసుకుంటున్నాయి. లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో ఎవరి దారి వారు వెదుక్కుంటున్నారు.

ఎవరి దారి వారు వెదుక్కుంటున్న నల్గొండ నేతలు
ఎవరి దారి వారు వెదుక్కుంటున్న నల్గొండ నేతలు

BRS Politics: నిన్న మొన్నటి దాకా BRS పార్టీలో అన్ని రకాలుగా హోదాలు, పదవులు అనుభవించిన వారు ఒక్కరొక్కరుగా పక్కలకు జారీపోయే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఉమ్మడి నల్గొండ జిల్లాలో Nalgonda బీఆర్ఎస్ రాజకీయాలు వేగంగా మారిపోతున్నాయి.

ఉమ్మడి నల్గొండ జిల్లా పరిధిలోని నల్గొండ, భువనగిరి Bhuvanagiri లోక్ సభ నియోజకవర్గాలు ఉన్నాయి. ప్రస్తుతం ఈ రెండు స్థానాల నుంచి ఎంపీ ఎన్నికల్లో పోటీ చేయడానికి ఉత్సాహంగా ముందుకు వస్తున్న అభ్యర్థులు లేరు. కారణం అందరికీ తేలిగ్గా అర్థమయ్యేదే.

గతేడాది డిసెంబరులో ముగిసిన తెలంగాణ శాసన సభ ఎన్నికల్లో ఉమ్మడి నల్గొండ జిల్లాలోని 12 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 11 చోట్ల ఆ పార్టీ అభ్యర్థులు ఓడిపోయారు. ఇపుడా స్థానాల్లో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తున్నారు.

ఇలా ఓడిపోయిన వారిలో హుజూర్ నగర్ మాజీ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి Sanampudi Saidireddy ఒకరు. ఒక దశలో ఆయన నల్గొండ ఎంపీ స్థానం నుంచి బీఆర్ఎస్ నుంచి బరిలోకి దిగుతారని కూడా ప్రచారం జరిగింది. కానీ, తెరవెనుక ఏం జరిగిందో ఏమో కానీ.. ఉన్నట్టుంది ఆయన రాత్రికి రాత్రే బీజేపీలో చేరిపోయి కాషాయ కండువా కప్పేసుకున్నారు.

ఇపుడు ఆ పార్టీ తరపునే నల్గొండ ఎంపీ స్థానం నుంచే పోటీ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. పార్టీ మారడానికి కొద్ది రోజుల ముందు ‘ బీజేపీ నాయకత్వం కాంటాక్ట్ చేసింది నిజమే. పార్టీలోకి ఆహ్వానిస్తున్నారు.. కానీ, నేను పార్టీ మారబోవడం లేదు..’ అని శానం పూడి సైదిరెడ్డి ప్రకటించారు.

నియోజకవర్గంలో తన దగ్గరి అనుచరులను కానీ, సన్నిహితులతో కానీ ఎలాంటి సంప్రదింపలు, మాటా ముచ్చట లేకుండానే బీజేపీ కండువా కప్పేసుకున్నారు. దీంతో అవాక్కయిన కార్యకర్తలు ఆయనపై విమర్శల దాడి మొదలు పెట్టారు. ఈ వివాదానికి తెరదించేందుకు ఏ పరిస్థితుల్లో పార్టీ మారాల్సి వచ్చిందో ఒక ఆడియో విడుదల చేశారు.

కేంద్రంలో మరో మారు నరేంద్ర మోడీ సారథ్యంలో బీజేపీ ప్రభుత్వం వస్తుందన్న విశ్వాసం, ఆ పార్టీ నుంచైతే ఎంపీగా గెలుస్తానన్న నమ్మకంతో పార్టీ మారినట్లు చెప్పుకున్నారు.

కాంగ్రెస్ వైపు గుత్తా అమిత్ చూపు

తెలంగాణ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి తనయుడు గుత్తా అమిత్ రెడ్డి Gutha amith Reddy బీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ లో చేరడానికి వేగంగానే పావులు కదుపుతున్నారు. నల్గొండ ఎంపీ స్థానం నుంచి ఆయన బీఆర్ఎస్ టికెట్ ఆశించారు. కానీ, ఇక్కడి గ్రూపు గొడవల కారణంగా మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డితో పాటు లోక్ సభ నియోజకవర్గం పరిధిలోని మాజీ ఎమ్మెల్యేలు అందరూ గుత్తా అమిత్ అభ్యర్థిత్వానికి వ్యతిరేకంగా ఉన్నారు. ఇదే విషయాన్ని అధిష్టానానికి కూడా చెప్పారు.

దీంతో మొన్న మొన్నటి దాకా టికెట్ అడిగిన అమిత్ తాను నల్గొండ నుంచి కానీ, భువనగిరి నుంచి కానీ పోటీ చేయలేననని వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు చెప్పి వచ్చారు. దీంతో అభ్యర్థుల వెదుకులాటలో గులాబీ నాయకత్వం ఉండగానే, నల్గొండ ఎమ్మెల్యే, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డితో గుత్తా అమిత్ రెడ్డి భేటీ అయ్యారు. ఆ తర్వాత సీఎం రేవంత్ రెడ్డి వ్యక్తిగత సలహాదారుడు వేంనరేందర్ రెడ్డితో కూడా భేటీ అయ్యారు.

తన తండ్రి, శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి రాజకీయాలతో సంబంధం లేకుండా తన దారి తను చూసుకుంటున్నారని చెబుతున్నారు. ఆయన కాంగ్రెస్ లో చేరితే తనకు భువనగిరి నుంచి పోటీ చేసేందుకు అవకాశం ఇవ్వాలని ప్రతిపాదన పెట్టినట్టు తెలుస్తోంది. ఇపుడు జిల్లా రాజకీయాల్లో శానంపూడి సైదిరెడ్డి, గుత్తా అమిత్ రెడ్డి పరిణామాలు హాట్ టాపిక్ గా మారాయి.

( రిపోర్టింగ్ : క్రాంతీపద్మ, నల్గొండ )

సంబంధిత కథనం