Huzurnagar Election Fight : నువ్వా - నేనా...? హుజూర్ నగర్ లో పట్టం కట్టేది ఎవరికి..?
Telangana Assembly Elections 2023: హుజూర్ నగర్ రాజకీయాలు హాట్ హాట్ గా సాగుతున్నాయి. ఉత్తమ్ కుమార్ అడ్డాగా పేరున్న ఇక్కడ ఉపఎన్నికల్లో గులాబీ జెండా ఎగరటంతో… మరోసారి కూడా పట్టు కోసం ప్రయత్నాలు చేస్తుంది. ఇదే సమయంలో హస్తం జెండా ఎగిరేలా ఉత్తమ్ పావులు కదుపుతున్నారు.
Huzurnagar Assembly Constituency : నియోజకవర్గాల పునర్విభజనలో 2007లో పునరుద్దరణ జరిగిన హుజూర్ నగర్ కు 2009లో ఎన్నికలు జరిగాయి. 1952 నుంచి 1972 వరకు ఉనికిలో ఉన్న హుజూర్ నగర్ నియోజకవర్గం రద్దయ్యింది. జిల్లా ప్రజల డిమాండ్ మేరకు తిరిగి ఈ స్థానాన్ని పునరుద్దరించారు. అప్పటికే కోదాడ నియోజకవర్గం నుంచి రెండు పర్యాయాలు గెలిచి ఉన్న కాంగ్రెస్ నేత ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి 2009 లో ఈ నియోజకవర్గం నుంచి పోటీ చేసి విజయం సాధించారు. దీంతో ఆయన హ్యాట్రిక్ సాధించినట్లు అయ్యింది. తెలంగాణ ఆవిర్భావం తర్వాత జరిగిన 2014 ఎన్నికల్లోనూ ఉత్తమ్ కుమార్ రెడ్డి విజయం సాధించారు. దీంతో ఆయన వరసగా నాలుగు పర్యాయాలు ( రెండు సార్లు కోదాడ నుంచి , రెండు సార్లు హుజూర్ నగర్ నుంచి ) గెలుపొందినట్లు అయ్యింది. ప్రస్తుతం 2023 ఎన్నికల్లో ఈ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి బరిలో ఉన్నారు. బీఆర్ఎస్ నుంచి సిట్టింగ్ అభ్యర్థి, ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి, సీపీఎం నుంచి మల్లు లక్ష్మీ, బీజేపీ నుంచి చల్లా శ్రీలతారెడ్డి, ఫార్వర్డ్ బ్లాక్ నుంచి పిల్లుట్ల రఘు పోటీలో ఉన్నారు. అయిదు పార్టీలు పోటీలో ఉన్నా ప్రధానంగా ఎన్నికల పోరు మాత్రం కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్యనే సాగనుంది. ముఖా ముఖి పోటీలో విజయం సాధించేందుకు రెండు పార్టీలూ అన్ని శక్తులను ఒడ్డుతున్నాయి.
బీఆర్ఎస్ గట్టి ప్రయత్నాలు…
హుజూర్ నగర్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ ఒక ఉప ఎన్నిక సహా నాలుగు పర్యాయాలు పోటీ చేసి ఒక్కసారే విజయం సాధించింది. ఉమ్మడి ఏపీలో 2009 లో జరిగిన ఎన్నికల్లో ఇక్కడి నుంచి ప్రస్తుత మంత్రి, సూర్యాపేట అభ్యర్థి జి.జగదీష్ రెడ్డి పోటీ చేసి 50వేల పైచిలుకు ఓట్లు తెచ్చుకున్నా 30 వేల ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి గెలిచారు. 2014 ఎన్నికల్లో సైతం బీఆర్ఎస్ ఓడిపోయింది. మలిదశ తెలంగాణ ఉద్యమ తొలి అమరుడు శ్రీకాంతా చారి తల్లి శంకరమ్మను బీఆర్ఎస్ పోటీకి పెట్టినా ఫలితం లేకుండా పోయింది. ఆ ఎన్నికల్లో శంకరమ్మకు 45వేల పైచిలుకు ఓట్లు వచ్చాయి. ఆ తర్వాత 2018 ఎన్నికల్లో కూడా టీపీసీసీ అధ్యక్షుని హోదాలో ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇక్కడి నుంచి పోటీచేసి హుజూర్ నగర్ లో వరసగా మూడో సారి, మొత్తంగా అయిదో సారి గెలిచారు. ఆ ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి శానంపూడి సైదిరెడ్డి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఆయనకు ఆ ఎన్నికల్లో 85వేల పైచిలుకు ఓట్లు రాగా, 7వేల ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు. కాగా, 2019 లోక్ సభ ఎన్నికల్లో ఉత్తమ్ కుమార్ రెడ్డి నల్గొండ ఎంపీగా విజయం సాధించడంతో ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. దీంతో ఉప ఎన్నిక అనివార్యమైంది. 2019లోనే జరిగిన ఉప ఎన్నికల్లో సైదిరెడ్డి రెండో సారి పోటీ చేసి 1.13లక్షల ఓట్లు సాధించి గెలిచారు. ఉప ఎన్నికల్లో మాజీ ఎమ్మెల్యే ఎన్.పద్మావతి రెడ్డి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. దీంతో హుజూర్ నగర్ నియోజకవర్గంలో తొలిసారి గులాబీ జెండా ఎగిరింది. ఈ సారి కూడా బీఆర్ఎస్ తమ సిట్టింగ్ ఎమ్మెల్యే సైదిరెడ్డినే పోటీకి పెట్టింది. ఈ ఎన్నికల్లో గట్టెక్కేందుకు గులాబీ పార్టీ తాము చేపట్టిన పథకాల గురించి, సంక్షేమ కార్యక్రమాల గురించి ఓటర్లలో ప్రచారం చేస్తోంది. ఈ ఎన్నికల్లోనూ సైదిరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రత్యర్థులుగా తలపడుతున్నారు.
దక్కించుకునేందుకు కాంగ్రెస్ పోరాటం
1972 ఎన్నికల తర్వాత హుజూర్ నగర్ నియోజకవర్గం రద్దయ్యింది. 1952 నుంచి 1972 వరకు జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ రెండు పర్యాయాలు గెలిచింది. తిరిగి 2009లో పునరుద్దరణ జరిగాక, 2009, 2014, 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ హ్యాట్రిక్ విజయాలు సాధించింది. 2019లో జరిగిన ఉప ఎన్నికల్లో మాత్రమే ఆ పార్టీ ఓటమి పాలైంది. తమ చేజారిన స్థానాన్ని తిరిగి దక్కించుకునేందుకు కాంగ్రెస్ పోరాడుతోంది. ఆ పార్టీ నుంచి పోటీలో ఉన్న ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈ సారి కూడా గెలిచేందుకు శ్రమిస్తున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ఈ సారి అధికారంలోకి వస్తుందన్న పూర్తి విశ్వాసంతో ఉన్నందున సీఎం రేసులో తానున్నానని, ఈ సారి గెలిస్తే సీఎం అయ్యే అవకాశం ఉందని దగ్గరి అనుచరులతో చెబుతూ.. ఆ దిశలోనే ప్రచారం కొనసాగిస్తున్నారు. గతంలో మంత్రిగా కూడా పనిచేసిన ఉత్తమ్ కుమార్ రెడ్డి తన హయ్యాంలో నియోజకవర్గంలో చేపట్టిన పనుల గురించి, జరిగిన డెవలప్ మెంట్ గురించి ప్రచారంలో ప్రత్యేకంగా ప్రస్తావిస్తూ ఓటర్లను కలుస్తున్నారు.
మిగతా పార్టీలది నామమాత్రపు పోటీ
హుజూర్ నగర్లో ఇంకా సీపీఎం, బీజేపీ, ఫార్వర్డ్ బ్లాక్ అభ్యర్ధులు పోటీలో ఉన్నారు. 1972లో హూజూర్ నగర్ నియోజకవర్గం రద్దయ్యాక దీని పరిధిలోని మండలాలు మిర్యాలగూడెం నియోజకవర్గంలో చేరాయి. మిర్యాలగూడెం నుంచి అయిదు సార్లు ఎమ్మెల్యేలు గెలిచిన సీపీఎంకు ఈ ప్రాంతంలో బాగా పట్టుంది. ఇపుడు ఆ మండలాలు మిర్యాలగూడెం నుంచి విడిపోయి 2009 లో పునరుద్దరణ జరిగిన హూజూర్ నగర్ లో చేరాయి. దీంతో తమ అభ్యర్థికి ఇది కలిసి వస్తుందన్న విశ్వాసంలో సీపీఎం ఉంది. ఈ ప్రాంతంలో సిమెంటు పరిశ్రమలు అధికంగా ఉండడంతో కార్మిక సంఘాలు తమకు మద్దతుగా ఉన్నాయన్న నమ్మకంతో ఉంది. గతంలో ఇక్కడి పోటీ చేసినా, ఏమాత్రం ప్రభావం చూపలేకపోయిన బీజేపీ నుంచి ఈ సారి నేరెడుచర్ల మున్సిపల్ వైస్ చైర్మన్ చల్లా శ్రీలతా రెడ్డి పోటీలో నిలిచారు. మరో వైపు ఫార్వర్డ్ బ్లాక్ నుంచి పోటీలో ఉన్న పిల్లుట్ల రఘు ఓజో ఫౌండేషన్ పేర చేపట్టిన కార్యక్రమాలు తనకు కలిసివస్తాయని భావిస్తున్నారు. కానీ, ఈ మూడు పార్టీల పోటీ నామ మాత్రమే కానుండగా .. జరగనున్న ముఖాముఖి పోటీలో కాంగ్రెస్, బీఆర్ఎస్ పోటీ పోటీగా తలపడుతున్నాయి.
రిపోర్టింగ్ : క్రాంతీపద్మ, నల్గొండ
సంబంధిత కథనం