Nalgonda Congress MP: నల్గొండలొ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి ఎవరు..? జానారెడ్డి కుటుంబానికే టిక్కెట్ దక్కుతుందా?
Nalgonda Congress MP: నల్గొండ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ తరపున లోక్‌సభ ఎన్నికల బరిలో పోటీ చేసే అభ్యర్థి ఖాయమైనట్టు కనిపిస్తోంది. మాజీ మంత్రి జానారెడ్డి కుటుంబానికే టిక్కెట్ దక్కనున్నట్టు ప్రచారం జరుగుతోంది.
Nalgonda Congress MP: లోక్ సభ ఎన్నికలకు కాంగ్రెస్ సిద్ధమవుతోంది. ఒక వైపు బీజేపీ, బీఆర్ఎస్ తమ అభ్యర్థులను కొన్ని స్థానాల్లో ప్రకటించాయి. బీజేపీ ఇప్పటికే రాష్ట్రంలోని 17 స్థానాలకు గాను, 9 చోట్ల అభ్యర్థులను ప్రకటించగా.. అందులో ఉమ్మడి నల్గొండ జిల్లాలోని భువనగిరి స్థానానికి మాజీ ఎంపీ డాక్టర్ బూర నర్సయ్య గౌడ్ కు టికెట్ ఇచ్చింది.
ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ BRS మాత్రం ఇప్పటి వరకు ప్రకటించిన అయిదు స్థానాల్లో ఉమ్మడి నల్గొండ Nalgonda జిల్లాలోని ఒక్క స్థానమూ లేదు. కాంగ్రెస్ Congress ఇంకా తమ అభ్యర్థుల పేర్లను అధికారకంగా ప్రకటించకున్నా... పార్టీ వర్గాల ద్వారా అందుతున్న సమాచారం మేరకు నల్గొండ ఎంపీ స్థానం నుంచి కాంగ్రెస్ సీనియర్ నాయకుడు మాజీ మంత్రి కుందూరు జానారెడ్డి Kunduru Janareddy , లేదంటే ఆయన తనయుడు కుందూరు రఘువీర్ రెడ్డి Raghuveer Reddy పేరు కానీ ఖరరాయ్యే అవకాశాలు ఉన్నాయని సమాచారం.
వాస్తవానికి అసెంబ్లీ ఎన్నికల్లోనే జానారెడ్డి ఇద్దరు తనయులు నాగార్జున సాగర్, మిర్యాలగూడ అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి టికెట్ ఆశించారు. ఉదయ్ పూర్ డిక్లరేషన్ ప్రకారం ఒకే కుటుంబం నుంచి ఇద్దరు టికెట్లు ఇవ్వడం కుదరదన్న నిబంధన మేరకు నాగార్జున సాగర్ నుంచి జానారెడ్డి రెండో తనయుడు జైవీర్ రెడ్డికి మాత్రమే అవకాశం దక్కింది. ఎన్నికల్లో ఆయన విజయం సాధించారు.
మిర్యాలగూడెం నుంచి జానారెడ్డి పెద్ద కొడుకు రఘువీర్ రెడ్డి టికెట్ ఆశించినా.. ఆయనకు దక్కకపోగా, బత్తుల లక్ష్మారెడ్డి అనే నాయకుడికి టికెట్ కట్టబెటారు. ఈ నిర్ణయం జరిగిన సందర్భంలోనే నల్గొండ ఎంపీ టికెట్ రఘువీర్ రెడ్డికి ఇస్తామన్న హామీ ఇచ్చారని చెబుతున్నారు.
దీంతో జానారెడ్డి వర్గం మిర్యాలగూడెం నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించడం కోసం పనిచేసిందని అంటున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో చే జారిన అవకాశం లోక్ సభ ఎన్నికల సందర్భంగా అందివస్తోందన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది.
ఇద్దరు నేతలకు హామీ ఎలా..?
మరో వైపు సూర్యాపేట నియోజకవర్గ నాయకుడు పటేల్ రమేష్ రెడ్డికి కూడా నల్గొండ ఎంపీ టికెట్ ఇస్తామని ఎన్నికల సమయంలో హామీ ఇచ్చారు. సీఎం రేవంత్ రెడ్డికి ప్రధాన అనుచరునిగా ఉన్న పటేల్ రమేష్ రెడ్డి అసెంబ్లీ ఎన్నికల్లో సూర్యాపేట అసెంబ్లీ టికెట్ ఆశించారు. ఈ స్థానం నుంచి మాజీ మంత్రి ఆర్.దామోదర్ రెడ్డికి అవకాశం కల్పించడంతో ఇండిపెండెంట్ గా పోటీలో ఉండేందుకు నామినేషన్ దాఖలు చేశారు.
ప్రస్తుత మంత్రి ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి, అప్పటి తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ ఛార్జ్ లిఖిత పూర్వక హామీతో పటేల్ రమేష్ రెడ్డి తన నామినేషన్ ను విత్ డ్రా చేసుకున్నారు. అయితే, సూర్యాపేటలో కాంగెస్ అసెంబ్లీ అభ్యర్థి ఆర్.దామోదర్ రెడ్డి ఓటమి పాలయ్యారు.
ఆ ఎన్నికల్లో పటేల్ రమేష్ రెడ్డి వర్గం పనిచేయక పోవడంతో పార్టీకి నష్టం జరిగిందన్న అభిప్రాయం కూడా ఉంది. దీంతో రమేష్ రెడ్డి కూడా గట్టిగా టికెట్ కోరే స్థితిని కోల్పోయారు. ఒక వైపు జానారెడ్డి తనయుడు రఘువీర్ రెడ్డి, మరో వైపు పటేల్ రమేష్ రెడ్డికి లోక్ సభ టికెట్ హామీ ఇచ్చిన అధినాయకత్వం జానారెడ్డి కుటుంబం వైపు మొగ్గు చూపుతోందని అంటున్నారు.
ఇద్దరిలో బరిలోకి ఎవరు..?
నల్గొండ ఎంపీ స్థానం నుంచి ఒక వేళ జానారెడ్డి కుటుంబానికే అవకాశం దక్కితే తండ్రీ తనయుల్లో బరిలోకి దిగేది ఎవరు..? అన్న ప్రశ్నలు వస్తున్నాయి. అసెంబ్లీ ఎన్నికలకు దూరంగా ఉన్న జానారెడ్డి పార్లమెంటు ఎన్నికల్లో పోటీ చేయడానికి కొంత సుముఖంగా ఉన్నారని అంటున్నారు.
ఈ స్థానం నుంచి జానారెడ్డి పోటీ చేస్తారా..? లేక తన తనయుడు రఘువీర్ రెడ్డికి అవకాశం కల్పిస్తారా అన్న అంశంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. కాంగ్రెస్ హై కమాండ్ ప్రకటించే తొలి జాబితాలోనే వీరిద్దరిలో ఎవరిదో ఒక పేరు అనౌన్స్ అవుతుందని జానా అనుచరు వర్గం అభిప్రాయపడుతోంది.
( రిపోర్టింగ్ : క్రాంతీపద్మ, నల్గొండ )