Nalgonda BRS MP Seats: నల్గొండ బీఆర్ఎస్‌లో ఎంపీ సీట్ల లొల్లి… సీట్ల కేటాయింపుపై తేల్చుకోలేకపోతున్న అధిష్టానం
Nalgonda BRS MP Seats: లోక్ సభ ఎన్నికల సమయం దగ్గర పడుతోంది. వివిధ రాజకీయ పార్టీలోని టికెట్ ఆశావహులు తమ ప్రయత్నాలను ముమ్మరం చేశారు. BRSలో మాత్రం సీట్ల విషయంలో లొల్లి తప్పడం లేదు.
Nalgonda BRS MP Seats: నల్గొండ జిల్లాలో ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ లో టికెట్ల లొల్లి సమసి పోయేలా కనిపించడం లేదు. ఉమ్మడి జిల్లా పరిధిలోని నల్గొండ, భువనగిరి ఎంపీ స్థానాల్లో గత 2019 ఎన్నికల్లో ఓటమి పాలైన బీఆర్ఎస్ ఈ సారి ఎలాగైనా గట్టెక్కి తమ పట్టును నిరూపించుకోవాలని చూస్తోంది. కానీ, ఆ పార్టీలోని గుంపు గొడవలు అభ్యర్థుల ఎంపిక విషయంలో ప్రధానం కానున్నాయి.
నల్గొండ ఎంపీ టికెట్ పై కిరికిరి
నల్గొండ ఎంపీ టికెట్ విషయంలోనే బీఆర్ఎస్‌లో కిరికిరి నడుస్తోంది. ఇక్కడి నుంచి పోటీ చేయడానికి తెలంగాణ రాష్ట్ర శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి తనయుడు గుత్తా అమిత్ రెడ్డి ప్రయత్నాల్లో ఉన్నారు.
తన తనయుడి రాజకీయ అరంగేట్రానికి లోక్ సభ ఎన్నికలను వేదికగా వాడుకోవాలని గుత్తా సుఖేందర్ రెడ్డి ఉన్నారు. ఆయన గతంలో ఇదే స్థానం నుంచి మూడు పర్యాయాలు, టీడీపీ నుంచి ఒక మారు, కాంగ్రెస్ నుంచి రెండు పర్యాయాలు ఎంపీగా విజయాలు సాధించారు.
నియోజకవర్గంపై తనకున్న పట్టు, పరిచయాలతో తన తనయుడిని గట్టెక్కించాలన్న వ్యూహంలో ఉన్నారు. దీనికి జిల్లా సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీష్ రెడ్డి అడ్డుతగులుతున్నారన్న ప్రచారం ఉంది. ఆయన ప్రత్యామ్నాయంగా మరికొందరి పేర్లను తెరపైకి తెస్తున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
గుత్తా అమిత్ రెడ్డికి టికెట్ అంత తేలిగ్గా లభించే అవకాశాలు కనిపించడం లేదన్న అభిప్రాయాన్ని ఆ వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి. నల్గొండ ఎంపీ స్థానం నుంచి పోటీ చేయడానికి తమకు అవకాశం ఇవ్వాలని హుజూర్ నగర్ మాజీ ఎమ్మెల్యే శానం పూడి సైదిరెడ్డి, మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి సోదరుడు కంచర్ల క్రిష్ణారెడ్డి, పార్టీ సీనియర్ నాయకుడు డాక్టర్ చెరుకు సుధాకర్ తదితరులు ప్రయత్నాల్లో ఉన్నారని, వీరికి మాజీ మంత్రి జగదీష్ రెడ్డి అండదండలు ఉన్నాయని ప్రచారం జరుగుతోంది.
కుదిరితే నల్గొండ.. లేదంటే భువనగిరి
జిల్లా పరిస్థితులను పరిగణలోకి తీసుకున్న గుత్తా సుఖేందర్ రెడ్డి తన తనయుడికి అయితే నల్గొండ, లేదంటే భువనగిరి స్థానంలోనైనా ఎంపీ టికెట్ కావాల్సిందేనని అధిష్టానం వద్ద ప్రయత్నాలు చేసినట్ల సమాచారం.
నల్గొండ లోక్ సభ నియోజకవర్గ సమీక్ష సమావేశం జరిగిన సందర్భంలో మాజీ ఎమ్మెల్యేలు మూకుమ్మడిగా సుఖేందర్ రెడ్డి తనయుడి టికెట్ విషయంలో అభ్యంతరాలు చెప్పినట్లు తెలుస్తోంది.
గతేడాది చివరలో జరిగిన తెలంగాణ శాసన సభ ఎన్నికల్లో ఉమ్మడి నల్గొండ జిల్లాలోని 12 అసెంబ్లీ నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ 11 చోట్ల ఓటమి పాలైంది. నల్గొండ లోక్ సభ నియోజకవర్గం పరిధిలోని 7 సెగ్మెంట్లలో ఒక్క సూర్యాపేటలోనే గెలిచి, దేవరకొండ, నాగార్జున సాగర్, మిర్యాలగూడెం, హుజూర్ నగర్, కోదాడ, నల్గొండ లో ఓటమి పాలైంది.
ఇందులో మిర్యాలగూడెం మాజీ ఎమ్మెల్యే భాస్కర్ రావు మినహా మిగిలిన అయిడుగురు మాజీ ఎమ్మెల్యేలు తమ ఓటమిలో సుఖేందర్ రెడ్డి పాత్ర ఉందన్న విమర్శ, ఆరోపణలతో ఆయన తనయుడికి టికెట్ ఇవ్వొద్దని అధిష్టానానికి చెప్పారంటున్నారు.
ఈ కారణంగానే నల్గొండ కుదరకపోతే.. భువనగిరి టికెట్ అయినా ఇవ్వాలని గుత్తా అమిత్ ప్రతిపాదించారని ఎక్కడి నుంచైనా పోటీ చేయడానికి తాను సిద్దమన్న హైకమాండ్ కు వివరించారని సమాచారం
భువనగిరిలో తెరపైకి తెలంగాణ ఉద్యమ కారులు
భువనగిరి లోక్ సభ నియోజకవర్గం నుంచి పోటీ చేయడానికి తమకు అవకాశం ఇవ్వాలని తెలంగాణ ఉద్యమ కారులు కోరుతున్నారు. తెలంగాణ ఉద్యమ సమయం నుంచి నాటి టీఆర్ఎస్ కు అనుబంధంగా పనిచేసి, ఆ తర్వాత దూరమై, కొంత కాలానికి తిరిగి పార్టీలో చేరిన డాక్టర్ చెరుకు సుధాకర్, జిట్టా బాలక్రిష్ణారెడ్డి సైతం భువనగిరిపై కొంత ఆశ పెట్టుకున్నారు.
వీరే కాకుండా మాజీ మంత్రి జగదీష్ రెడ్డి దగ్గరి అనుచరుడి పేరును కూడా తెరపైకి తెచ్చారని అంటున్నారు. ఉస్మానియా యూనిర్సిటీలో విద్యార్ధి నాయకునిగా గుర్తింపు ఉన్న డాక్టర్ దూదిమెట్ల బాలరాజు భువనగిరి టికెట్ తనకు కేటాయించాలని డిమాండ్ చేస్తున్నారు.
రాష్ట్ర షీప్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా మొన్నమొన్నటి దాకా పనిచేసి బాలరాజు యాదవ్ ఇపుడు భువనగిరి ఎంపీ టికెట్ పై కన్నేశారు. అయితే, పార్టీలో కొనసాగతున్న గుంపుల లొల్లి తో జిల్లాలోని రెండు స్థానాల టికెట్ల విషయంలో పార్టీ నాయకత్వం ఇంకా ఎటూ తేల్చుకోలేక పోతోందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
( రిపోర్టింగ్ : క్రాంతీపద్మ, నల్గొండ )