Nalgonda Municipality: హస్తం చేతికి నల్గొండ మునిసిపాలిటీ.. నెగ్గిన అవిశ్వాసం
Nalgonda Municipality: నల్గొండ మున్సిపాలిటీలో కాంగ్రెస్ అవిశ్వాస తీర్మానం నెగ్గింది. దీంతో బిఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ చేతికి నల్గొండ మున్సిపాలిటీ పీఠం దక్కింది. బుర్రి శ్రీనివాస్ రెడ్డికి ఛైర్మన్ పదవి దక్కుతుందని ప్రచారం జరుగుతోంది.
Nalgonda Municipality: ఉమ్మడి నల్గొండ జిల్లాలోని 19 మున్సిపాలిటీల్లో బీఆర్ఎస్ మున్సిపల్ చైర్మన్ల పై అవిశ్వాస తీర్మానాల పర్వం కొనసాగుతోంది. హైకోర్టు స్టే వల్ల నాగార్జున సాగర్ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని నందికొండ మున్సిపల్ చైర్ పర్సన్ పై అవిశ్వాస తీర్మాన సమావేశంపై రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం స్టే విధించినా.. జిల్లా కేంద్రమైన నల్గొండ మున్సిపాలిటీలో మాత్రం సోమవారం ప్రత్యేక సమావేశం జరిగింది. ఈ సమావేశంలో కాంగ్రెస్ ప్రవేశ పెట్టిన అవిశ్వాస తీర్మానం నెగ్గింది. కొత్త మున్సిపల్ చైర్మన్ ఎన్నుకునేందుకు మరో సమావేశం జరపాల్సి ఉంటుంది.
బీఆర్ఎస్ చైర్మన్ పై నెగ్గిన అవిశ్వాస తీర్మానం
నల్గొండ జిల్లా కేంద్రం మున్సిపాలిటీ ఇన్నాళ్లూ బీఆర్ఎస్ చేతిలో ఉంది. కానీ, సోమవారం జరిగిన అవిశ్వాస తీర్మానం నెగ్గడంతో బీఆర్ఎస్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డి తన పదవి నుంచి దిగిపోవాల్సిన పరిస్థి ఏర్పడింది.
నల్గొండ మున్సిపాలిటీలో 48 మంది వార్డు కౌన్సిలర్లు ఉండగా.. మరో ఇద్దరు ఎక్స్ అఫీషియో సభ్యులు ఉన్నారు. అంటు మొత్తం 50 ఓట్లు. కాగా, సోమవారం నాటి అవిశ్వాస తీర్మాన సమావేశానికి 47 మంది మాత్రమే హాజరై ఓటింగ్ లో పాల్గొన్నారు. కాంగ్రెస్ ప్రవేశ పెట్టిన అవిశ్వాస తీర్మానానికి అనుకూలంగా 41 ఓట్లు పడ్డాయి. బీఆర్ఎస్ చైర్మన్ కు అనుకూలంగా కేవలం 5 ఓట్లు రాగా, ఏ నిర్ణయం తీసుకోకుండా తటస్థంగా ఒకరు నిలిచారు.
ఇద్దరు ఎక్స్ అఫీషియో సభ్యులు, బీజేపీకి చెందిన ఒక కౌన్సిలర్ సమావేశానికి గైర్హాజరయ్యారు. కాంగ్రెస్ ప్రవేశ పెట్టిన అవిశ్వాసన తీర్మానం 41 మంది మద్దతులో నెగ్గింది., కొత్త చైర్మన్ ఎన్నిక కోసం జిల్లా కలెక్టర్ నోటిఫికేషన్ జారీ చేయాల్సి ఉంది. ఆ తర్వాత జరిగే ఎన్నికలో కాంగ్రెస్ నుంచి ఒకరు చైర్మన్ కావడం ఖాయమైంది.
మున్సిపల్ చైర్మన్ గా బుర్రి శ్రీనివాస్ రెడ్డి..?
ఇప్పటి దాకా నల్గొండ మున్సిపాలిటీలో కాంగ్రెస్ ఫ్లోర్ లీడర్ గా ఉన్న కౌన్సిలర్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి నల్గొండ మున్సిపల్ చైర్మన్ కానున్నారు. కాంగ్రెస్ నాయకత్వం బుర్రి శ్రీనివాస్ రెడ్డిని తమ చైర్మన్ అభ్యర్థిగా ఇదివరకే నిర్ణయించింది. మున్సిపల్ ఎన్నికల్లో 48 వార్డు కౌన్సిలర్ సభ్యులకు గాను అపుడు బీఆర్ఎస్ 21 మంది కౌన్సిలర్లను గెలుచుకుంది.
కాంగ్రెస్ 19, బీజేపీ 06, ఎంఐఎం 1, ఇండిపెండెంట్ ఒకరు గెలిచారు. బీజేపీ మద్దతు, ఎక్స్ అఫీషియో ఓట్లతో బీఆర్ఎస్ గట్టున పడింది. అప్పటి ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి దగ్గరి అనుచరుడు మందడి సైదిరెడ్డి మున్సిపల్ చైర్మన్ గా ఎన్నికయ్యారు. కానీ గత డిసెంబరులో జరిగిన ఎన్నికల్లో నల్గొండ ఎమ్మెల్యే స్థానాన్ని బీఆర్ఎస్ కోల్పోయింది.
కాంగ్రెస్ ఈ స్థానంలో విజయం సాధించగా, ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి రాష్ట్ర కేబినెట్ లో మంత్రిగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావడంతోనే మెజారిటీ మున్సిపాలిటీల్లో అవిశ్వాస తీర్మానాలు ఉంటాయని అంతా అంచనా వేశారు. సరిపడా సంఖ్యా బలం లేకున్నా గతంలో బీఆర్ఎస్ చాలా చోట్ల ఎక్స్ అఫీషియో ఓట్ల ఆధారంగా మున్సిపాలిటీలను కైవసం చేసుకుంది.
నల్గొండలో కాంగ్రెస్ అవకాశం దక్కకుండా అత్యధికంగా ఎక్స్ అఫీషియో సభ్యుల ఓట్లను వాడుకుంది. నేరెడుచర్ల మున్సిపాలిటీలోనూ ఇదే జరిగింది. చండూరులో కాంగ్రెస్ దక్కించుకున్నా.. చైర్మన్ ను తమవైపు లాక్కుంది. ఇపుడు అదే పనిని కాంగ్రెస్ చేస్తోంది. ఉమ్మడి నల్గొండ జిల్లాలోని 19 మున్సిపాలిటీల్లో అవిశ్వాసా అస్త్రం ప్రయోగిస్తోంది.
నందికొండ మున్సిపాలిటీ హైకోర్టు స్టే వల్ల ఆగినా.. నల్గొండలో మాత్రం అది కుదరలేదు. నల్గొండ మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డి హైకోర్టును ఆశ్రయించినా, విప్ జారీ చేసినా ఫలితం లేకుండా పోయింది. ఆయనకు అనుకూలంగా కేవలం 5 ఓట్లు మాత్రమే రావడం విశేషం. కాగా, త్వరలో జరిగే మున్సిపల్ చైర్మన్ ఎన్నికలో కౌన్సిలర్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి చైర్మన్ కావడం ఖాయమైంది.
( రిపోర్టింగ్ : క్రాంతీపద్మ, నల్గొండ )