Nalgonda Mp Candidate: ఎంపీ టికెట్ రేసు నుంచి గుత్తా అమిత్ వెనకడుగు..? పోటీకి విముఖతకు కారణమేంటి?-gutta amith not interest to contest in lok sabha elections ,elections న్యూస్
తెలుగు న్యూస్  /  Elections  /  Gutta Amith Not Interest To Contest In Lok Sabha Elections

Nalgonda Mp Candidate: ఎంపీ టికెట్ రేసు నుంచి గుత్తా అమిత్ వెనకడుగు..? పోటీకి విముఖతకు కారణమేంటి?

HT Telugu Desk HT Telugu
Mar 07, 2024 09:57 AM IST

Nalgonda Mp Candidate: నల్గొండ పార్లమెంట్ స్థానం నుంచి టికెట్ ఆశించిన తెలంగాణ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి తనయుడు గుత్తా అమిత్ రెడ్డి Gutha Amith Reddy పునరాలోచనలో పడటం చర్చనీయాంశంగా మారింది.

లోక్‌సభ ఎన్నికల్లో పోటీకి గుత్తా అమిత్ రెడ్డి విముఖతకు కారణం ఏమిటి?
లోక్‌సభ ఎన్నికల్లో పోటీకి గుత్తా అమిత్ రెడ్డి విముఖతకు కారణం ఏమిటి?

Nalgonda Mp Candidate: లోక్ సభ ఎన్నికలకు ముహూర్తం ముంచుకోస్తోంది. ఒక్కో పార్టీ తమ అభ్యర్థులను ప్రకటిస్తూ గెలుపోటములపై ఓ అంచనాకు వస్తున్నాయి. ఈ పరిస్థితులలో ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ ఇప్పటికే అయిదుగురు అభ్యర్థులను కూడా ప్రకటించింది.

ట్రెండింగ్ వార్తలు

ఉమ్మడి నల్గొండ జిల్లా పరిధిలోని నల్గొండ, భువనగిరి పార్లమెంటు స్థానాల్లో పోటీ చేసే అభ్యర్థుల వెదుకులాట ఇంకా జరుగుతూనే ఉంది. ముందు నుంచీ వినిపించిన వారి పేర్లు ఇప్పటికీ ప్రచారంలో ఉన్నా.. వారంతా వెనకడుగు వేస్తున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

గుత్తా అమిత్ వెనకగుడు ఎందుకు..?

నల్గొండ పార్లమెంట్ స్థానం నుంచి టికెట్ ఆశించిన తెలంగాణ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి తనయుడు గుత్తా అమిత్ రెడ్డి Gutha Amith Reddy పునరాలోచనలో ఉన్నారని తెలిసింది.

మునుగోడు అసెంబ్లీ స్థానానికి జరిగిన ఉప ఎన్నికల సమయం నుంచి ఆయన తన రాజకీయ అరంగేట్రానికి ఏర్పాట్లు చేసుకున్నారు. ఉప ఎన్నికల్లో మునుగోడు టికెట్ అడిగినా దక్కలేదు. ఆ తర్వాత 2023 డిసెంబరులో జరిగిన రాష్ట్ర శాసన సభ ఎన్నికల్లోనూ మరో మారు టికెట్ కోసం ప్రయత్నించారు.

BRS సిట్టింగ్ ఎమ్మెల్యేలు అందరికీ టికెట్లు ఇవ్వడంతో అవకాశం రాలేదు. దీంతో లోక్ సభ ఎన్నికల్లో నల్గొండ నుంచి పోటీ చేయడానికి నిర్ణయించుకుని ఆ మేర పనిచేస్తూ పోయారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఫలితాలు తిరగబడి బీఆర్ఎస్ అధికారాన్ని కోల్పోయింది.

ఉమ్మడి నల్గొండ జిల్లాలోని 12 అసెంబ్లీ స్థానాలకు గాను,Electionsలో కేవలం ఒక్క చోట మాత్రమే విజయం సాధించింది. దీంతో జిల్లా పార్టీలో రాజకీయ వాతావరణం ఒక్క సారిగా మారిపోయింది. రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఘోరంగా దెబ్బతిన్నా.. గుత్తా సుఖేందర్ రెడ్డి మాత్రం తన తనయుడికి నల్గొండ ఎంపీ టికెట్ కోసం అధినాయకత్వం వద్ద ప్రయత్నాలు చేశారు.

లోక్ సభ నియోజకవర్గాల వారీగా జరిగిన పార్టీ సమీక్ష సమావేశాల్లో నల్గొండ ఎంపీ స్థానం పరిధిలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లకు అయిదుగురు మాజీ ఎమ్మెల్యేలు, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి గుత్తా అమిత్ అభ్యర్థిత్వాన్ని ఒప్పుకోమని పార్టీ నాయకత్వానికి తేల్చి చెప్పారు. ఈ దశలో కనీసం భువనగిరి ఎంపీ స్థానం నుంచైనా టికెట్ కావాలని కోరారు.

నల్గొండ.. లేదంటే భువనగిరి అయినా పర్వాలేదని చెప్పుకున్నారు. ఈ లోగా.. ఏం జరిగిందో తెలియదు కానీ, పార్టీ గెలిచే అవకాశం లేని చోట, డబ్బులు ఖర్చు పెట్టుకుని పోటీ చేసి ఓడిపోవడం ఎందుకన్న ఆలోచనతో అసలు పోటీ చేయడం కన్నా ఎన్నికలకు దూరంగా ఉండడమే బెటర్ అన్న నిర్ణయానికి వచ్చినట్లు చెబుతున్నారు.

తెరవెనుక ఏం జరిగింది..?

నల్గొండ, లేదంటే భువనగిరి కావాలని కోరినా.. వాతావరణం అనుకూలంగా లేకపోవడం, మాజీ ఎమ్మెల్యేలు అంతా తమ ఓటమికి గుత్తా సుఖేందర్ రెడ్డి కారణమని, ఆయా అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి తన అనుచరగణాన్ని మొత్తం కాంగ్రెస్ లోకి పంపించారని ఆరోపణలు వెల్లువెత్తుతున్న తరుణంలో పోటీ చేసి చేతులు కాల్చుకోవడం కంటే.. దూరంగా ఉంటేనే మంచిదన్న నిర్ణయానికి వచ్చి, ఆ విషయాన్ని అధినాయకత్వానికి కూడా చేరవేశారని తెలుస్తోంది.

విశ్వసనీయ సమాచారం మేరకు... గుత్తా అమిత్ వారం కిందటే.. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను కలిసి తాను ఏ ఎంపీ స్థానం నుంచి పోటీ చేయడానికి సిద్దంగా లేనని, తనకు టికెట్ అవసరం లేదని, తన పేరును పరిశీలించొద్దని వివరించారని తెలుస్తోంది.

అసలే అభ్యర్థుల కొరతను ఎదుర్కొంటున్న బీఆర్ఎస్ నాయకత్వం ఈ విషయంపై మల్లగుల్లాలు పడుతోంది. భువనగిరి నుంచి మాజీ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డిని బరిలోకి దింపాలని అధిష్టానం చేస్తున్న ప్రయత్నాలు ఫలించడం లేదు. వాస్తవానికి నల్గొండలో కానీ, భువనగిరలో కానీ టికెట్ కోరుతున్న వారున్నా.. సొంతగా డబ్బు ఖర్చు పెట్టి ఎన్నికల్లో పాల్గొనే స్థాయి ఉన్న వారు కాదు.

టిక్కెట్ ఆశించే వారంతా పార్టీ ఎలక్షన్ ఫండ్ ఇవ్వక పోతుందా అని ఎదురు చూస్తున్నవారే కావడం గమనార్హం. ఈ కారణంగానే ఆర్థికంగా బలంగా ఉన్న అభ్యర్థుల కోసమే వెదుకులాడుతున్నారు. ఈ దశలో నల్గొండ, భువనగిరి అభ్యర్థుల ఎంపిక పార్టీ హైకమాండ్ కు కత్తి మీది సాములా తయారైందన్న అభిప్రాsaయం వ్యక్తం అవుతోంది.

( రిపోర్టింగ్ : క్రాంతీపద్మ, నల్గొండ )

WhatsApp channel