Gutha Sukehnder: పార్టీ మారడం లేదన్న శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి
Gutha Sukehnder: పార్టీ మారుతున్నట్లు సోషల్ మీడియాలో దుష్ప్రచారం జరుగుతోంది. నేను పార్టీ మారడం లేదు. పార్టీ మారాల్సిన అవసరం కూడా లేదని తెలంగాణ శాసన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి చెబుతున్నారు.
Gutha Sukehnder: రాజ్యాంగబద్ధమైన శాసన మండలి ఛైర్మన్ పదవిలో ఉన్న తనకు పార్టీ మారాల్సిన అవసరం లేదని మండలి ఛైర్మన్ గుత్తాసుఖేందర్ రెడ్డి చెబుతున్నారు. తనకు ఏ పార్టీతో సంబంధం లేదని చట్టబద్ధంగా కర్తవ్యాన్ని నేను నిర్వహిస్తానని ని తెలంగాణ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి వివరణ ఇచ్చుకున్నారు.
ఆగని ప్రచారం
ఎన్నికల పోలింగ్ కంటే ముందు నుంచే మండలి చైర్మన్ సుఖేందర్ రెడ్డి పార్టీ మారుతున్నారని ప్రచారం జరుగుతోంది. రాష్ట్రంలో బిఆర్ఎస్ ప్రభుత్వం మారి, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఈ ప్రచారం మరింత ఎక్కువైంది. ఆయన తన తనయుడి కోసం తిరిగి కాంగ్రెస్ గూటికి చేరుతారన్న ప్రచారాన్ని ముందు నుంచీ ఖండిస్తున్నా ప్రచారం మాత్రం ఆగడం లేదు.
ప్రధానంగా నల్గొండ జిల్లాలో దేవరకొండ, నల్గొండ అసెంబ్లీ నియోజకవర్గాల్లో సుఖేందర్ రెడ్డికి అత్యంత సన్నిహిత సహచరులుగా ఉన్న వారు గులాబీ పార్టీని వీడి, కాంగ్రెస్ కండువాలు కప్పుకున్నారు. ఈ రెండు చోట్లా బీఆర్ఎస్ అభ్యర్థులు ఘోర పరాజయం పాలై కాంగ్రెస్ అభ్యర్థులు గెలిచారు.
వాస్తవానికి సుఖేందర్ రెడ్డి బీఆర్ఎస్ లోకి మారేముందు కాంగ్రెస్ నుంచి నల్గొండ ఎంపీగా ఉన్నారు. 2014లో ఆయన ఎంపీగా విజయం సాధించాక కొన్నాళ్లకు తెలంగాణ పునర్నిర్మాణం కోసమంటూ కాంగ్రెస్ ను వీడి బీఆర్ఎస్ లో చేరారు. అయితే, ఆయన 2019 లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేయలేదు. బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ సుఖేందర్ రెడ్డిని ఎమ్మెల్యే కోటాలో శాసన మండలి సభ్యునిగా గెలిపించి ఆ తర్వాత చైర్మన్ గా కూడా అవకాశం ఇచ్చారు.
ఆయన ఎమ్మెల్సీ పదవీ కాలం ముగిశాక కూడా మరో మారు అవకాశం కల్పించి రెండో సారి మండలి చైర్మన్ గా అవకాశం ఇచ్చారు. శాసన మండలిలో ప్రస్తుతం అత్యధిక ఎమ్మెల్సీలు బీఆర్ఎస్ కు చెందిన వారే ఉన్నారు. ఎన్నికల పలితాల తర్వాత కూడా సుఖేందర్ రెడ్డి పార్టీ మారుతున్నారని ప్రచారం జరగుతోంది.
ఫలితాలు వెలువడిన తర్వాత ఇప్పటికే ఆయన మాజీ సీఎం కేసీఆర్ ను కలిసి వచ్చారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి రేవంత్ రెడ్డి సీఎంగా, ఇతరులు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన కార్యక్రమానికి కూడా మండలి చైర్మన్ హోదాలో హాజరయ్యారు. ఈ తరుణంలో పార్టీ మార్పు జరుగుతున్న ప్రచారాన్ని నల్గొండలో ఈ రోజు తన నివాసంలో మీడియాతో చిట్ చాట్ సందర్భంగా ఖండించారు.
ప్రభుత్వానికి సహకారం ఉంటుంది
తమ సంపూర్ణ సహకారం ఈ ప్రభుత్వానికి ఉంటుందని, ప్రభుత్వానికి అవసరమైన మేర సలహాలు ,సూచనలు అందిస్తానని సుఖేందర్ రెడ్డి పేర్కొన్నారు. ‘‘ కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం కూడా సాధ్యాసాధ్యాలను బేరీజు వేసుకోవాలి . ఏం అమలు చేయగలుగుతాం, ఏమి అమలు చేయలేమన్న విషయాల్లో సరైన అంచనాలకు రావాలి . ప్రజలకు వాస్తవ పరిస్థితి వివరించి పథకాలు అమలు చేయాలి. వాస్తవం చెబితే ప్రజలు తప్పకుండా అర్ధం చేసుకొంటారు..’’ అని అభిప్రాయపడ్డారు.
బీఆర్ఎస్ పార్టీ అధిష్టానం కూడా ప్రజలు తమకు ఎందుకు వ్యతిరేకంగా తీర్పు ఇచ్చారో విశ్లేషణ చేసుకుంటుందని పేర్కొన్నారు. కేసీఆర్ పట్ల ప్రజల్లో ఎలాంటి వ్యతిరేకత లేదు. ఆయన పట్ల ప్రజలకు ప్రేమ , విశ్వాసం అలాగే ఉన్నాయి . కేసీఆర్ రావాలి - మా ఎమ్మెల్యే పోవాలి అనే విధంగా ప్రజలు ఓట్లు వేశారని అభిప్రాయపడ్డారు.
కొన్ని స్థానాల్లో అభ్యర్థులను మార్చితే మళ్ళీ బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చేదని, కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీలను నమ్మి ప్రజలు ఓట్లు వేశారని తాను అనుకోవడం లేదన్నారు. జీహెచ్ఎంసీ పరిధిలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేల, కేటీఆర్ పని తీరుకు ఓట్లు పడ్డాయని తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కారమే తన ద్యేయమని, అధికారం అనేది ఎవ్వరికీ శాశ్వతంగా ఉండదని అభిప్రాయపడ్డారు.
నల్గొండ ఇరిగేషన్ ప్రాజెక్టు పనులపై శ్రద్ద పెట్టాలి
మంత్రులు చేస్తున్న కామెంట్స్ పేపర్లలో చూశా. విమర్శలకు , ప్రతి విమర్శలకు ఇది సమయం కాదు. పెండింగ్ పనులను పూర్తి చేస్తూ, పక్కా కార్యచరణతో వాళ్ళు పని చేసికుంటూ వెళ్ళాలి. ఉమ్మడి నల్గొండ జిల్లాకు రెండు మంత్రి పదవులు రావడం సంతోషకరం. ఇద్దరు మంత్రులు కూడా జిల్లా అభివృద్ధికి కృషి చేయాలని కోరుతున్నానని చెప్పారు.
జిల్లాలో ఇరిగేషన్ పనులు చాలా పెండింగ్ లో ఉన్నాయి. ఇరిగేషన్ మంత్రి సమయం ఇస్తే త్వరలోనే రివ్యూ పెట్టాలని అడుగుతానన్నారు. రివ్యూలో నేను కూడా పాల్గొంటానని . జిల్లాలో రహదారుల అభివృద్ధికి మంత్రి వెంకట్ రెడ్డి పని చేస్తారని నమ్మకం ఉందన్నారు. కేసీఆర్ సంపూర్ణ ఆరోగ్యంతో త్వరగా బయటకు రావాలని భగవంతుణ్ణి ప్రార్ధిస్తున్నానని మండలి చైర్మన్ సుఖేందర్ రెడ్డి పేర్కొన్నారు.
( రిపోర్టింగ్ క్రాంతీపద్మ, నల్గొండ )
.