Munugodu Politics : అందరి చూపూ… 'మునుగోడు' వైపు - ఈసారి ఎలా ఉండబోతుంది..?
Telangana Assembly Elections 2023: గతేడాది జరిగిన ఉపఎన్నికతో దేశదృష్టిని ఆకర్షించింది మునుగోడు నియోజకవర్గం. హోరాహోరీగా జరిగిన పోరులో బీఆర్ఎస్ గెలిచిన సంగతి తెలిసిందే. అయితే మరోసారి అసెంబ్లీ ఎన్నికల పోరు రావటంతో… ఈసారి మునుగోడు గడ్డపై ఎవరి జెండా ఎగరబోతుందనేది టాక్ ఆఫ్ ది పాలిటిక్స్ గా మారింది.
Munugode Assembly Constituency : తెలంగాణ శాసన సభకు జరుగుతున్న ఈ ఎన్నికల్లో ఇపుడు అందరి చూపు మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గం వైపే మళ్లుతోంది. 2022లో ఈ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నిక దేశ వ్యాప్తంగా చర్చనీయాంశం అయ్యింది. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి గెలిచిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి బీజేపీలో చేరిపోయారు. తద్వారా అనివార్యమైన ఉప ఎన్నికల్లో గెలవడం ద్వారా ఈ రాష్ట్రంలో చక్రం తిప్పాలని భావించిన బీజేపీ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డినే పోటీకి పెట్టింది. 2018 లో ఓటమి పాలైన కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డిని బీఆర్ఎస్ తిరిగి పోటీకి పెట్టింది. ఈ ఎన్నికల్లో డబ్బు వందల కోట్లలో ఖర్చయ్యింది. ఒక విధంగా దేశ ఎన్నికల వ్యయ గణాంకాల రికార్డులను మునుగోడు ఉప ఎన్నికల ఖర్చు తిరగరాసినట్లయ్యింది. ఇపుడు, 2023 అసెంబ్లీ ఎన్నికల్లో సైతం కాంగ్రెస్ నుంచి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి పోటీ పడుతున్నారు. ఉప ఎన్నికలు ముగిసిన కేవలం పదకొండు నెలల్లోనే రాజగోపాల్ రెడ్డి బీజేపీకి రాంరాం చెప్పి తిరిగి తన కాంగ్రెస్ గూటికి చేరడం విశేషం.
సమఉజ్జీలుగా.. కాంగ్రెస్ - సీపీఐ
మునుగోడు నియోజకవర్గానికి మొత్తంగా రెండు ఉప ఎన్నికలు సహా పదిహేడు పర్యాయాలు ఎన్నికలు జరిగితే ఇక్కడి నుంచి కాంగ్రెస్, సీపీఐలు సమ ఉజ్జీలుగా నిలిచాయి. 1952 ఎన్నికల నుంచి 1965 ఉప ఎన్నిక వరకు మునుగోడు నియోజకవర్గం చిన్నకొండూరు నియోజకవర్గం పేరున ఉండింది. 1967 నుంచి మనుగోడుగా మారింది. మొత్తం పదిహేడు సార్లు జరిగిన ఎన్నికల్లో ఏడు సార్లు సీపీఐ ఎనిమిది సార్లు కాంగ్రెస్, రెండు సార్లు బీఆర్ఎస్ గెలిచాయి. ఎమ్మెల్సీగా, రాజ్యసభ సభ్యునిగా, మంత్రిగా కూడా పనిచేసిన కాంగ్రెస్ నాయకుడు దివంగత పాల్వాయి గోవర్దన్ రెడ్డి అయిదు సార్లు ఎమ్మెల్యేగా విజయాలు సొంతం చేసుకున్నారు. కొండా లక్ష్మణ్ బాపూజీ రెండు సార్లు కాంగ్రెస్ నుంచి గెలిచారు. కోమటిరెడ్డి రాగోపాల్ రెడ్డి 2018లో ఒక సారి కాంగ్రెస్ నుంచి విజయం సాధించారు. ఇక సీపీఐ నుంచి ఉజ్జిని నారాయణ రావు మూడు సార్లు వరసగా గెలిచారు. ఆయన తనయుడు ఉజ్జిని యాదగిరి రావు ఒక సారి, పల్లా వెంకట్ రెడ్డి మరో సారి విజయం సాధించారు. తెలంగాణ ఆవిర్భించిన తర్వాత 2014లో జరిగిన ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ఎమ్మెల్యేగా గెలిచినా, 2018 ఎన్నికల్లో మాత్రం ఓటమి పాలయ్యారు. 2022 లో జరిగిన ఉప ఎన్నికల్లో మరో మారు కూసుకుంట్ల గెలవడంతో ఆయన ఖాతాలో రెండు విజయాలు చేరాయి.
రెండు పార్టీలకూ... తలనొప్పులు
మునుగోడు నియోజకవర్గంలో బీఆర్ఎస్, కాంగ్రెస్ లతో పాటు బీజేపీ, సీపీఎం, బీఎస్పీలు పోటీలో ఉన్నా, ప్రధాన పోటీ మాత్రం బీఆర్ఎస్, కాంగ్రెస్ ల మధ్యనే కొనసాగనుంది. అయితే, ఇరు పార్టీలకూ తమ తమ సొంత పార్టీల్లో తలనొప్పులు ఉన్నాయి.
కాంగ్రెస్: కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా బరిలో ఉన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి 2018 లో గెలిచాక కాంగ్రెస్ ను వీడి బీజేపీలో చేరి, ఉప ఎన్నికల్లో ఓటమి పాలయ్యాక తిరిగి పదకొండు నెలలకే కాంగ్రెస్ గూటికి చేరి మరో మారు అభ్యర్థిగా పోటీలో నిలబడ్డారు. కాంగ్రెస్ నుంచి టికెట్ పై ఆశలు పెట్టుకుని పనిచేసిన చలమల్ల క్రిష్ణారెడ్డి కాంగ్రెస్ కండువా పక్కన పడేసి బీజేపీలో చేరి అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఇది కాంగ్రెస్ విజయావకాశాలను ప్రభావితం చేయనుంది. మరో వైపు గత ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన పాల్వాయి స్రవంతి కాంగ్రెస్ కు గుడ్ బై చెప్పి గులాబీ తీర్థం పుచ్చుకున్నారు. ప్రధానంగా ఈ రెండు మార్పులు జరగడం కాంగ్రెస్ అవకాశాలను దెబ్బతీయనుందన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ఉప ఎన్నికల సమయంలో రాజగోపాల్ రెడ్డితో పాటు కాంగ్రెస్ ను వీడి బీజేపీలో చేరిన కేడర్ ఎక్కువ మంది తిరిగి వెనక్కి రాలేదు. ఆ రకంగా కాంగ్రెస్ కొంత కేడర్ ను కోల్పయింది. ఇది ఆ పార్టీకి ప్రతికూలంగా మారనుందని చెబుతున్నారు. ఏడాది తిరక్కుండానే బీజేపీకి ఓటడిగి, కాంగ్రెస్ ను తిట్టిపోసిన నాయకులు, తిరిగి ప్రజలను కాంగ్రెస్ కు ఓటేయమని ఎలా అడగాలో తేలీక ఇబ్బందులు పడుతున్నారని సమాచారం. ఈ అంశాలన్నీ కాంగ్రెస్ కు ప్రతికూలంగా కనిపిస్తున్నాయి.
బీఆర్ఎస్ : ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ హై కమాండ్ సర్వశక్తులు ఒడ్డి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డిని గెలిపించుకుంది. ఆ ఉప ఎన్నికల సమయంలో ఆయనకు వ్యతిరేకంగా ఉన్న స్థానిక నాయకులు ఎవరినీ ఆయన దగ్గర తీయలేదు. గెలిచాక కూడా పాత పని విధానంతో వీరందరినీ ఆయన దూరం చేసుకున్నారని అంటున్నారు. ఈ కారణంగానే మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని చౌటుప్పల్ మున్సిపల్ ఛైర్మన్, సంస్థాన్ నారాయణపురం ఎంపీపీ, నాంపల్లి వైఎస్ ఎంపీపీ, మునుగోడు జెడ్పీటీసీ సభ్యురాలు, మునుగోడు వైస్ ఎంపీపీ, పలువురు సర్పంచులు మూకుమ్మడిగా గులాబీ పార్టీకి రాజీనామాలు చేసి కాంగ్రెస్ కండువాలు కప్పుకున్నారు. ఎన్నికల సమయం దగ్గర పడిన సందర్భంలోనూ ఈ నియోజకవర్గంలో ఆ పార్టీ నుంచి ఈ పార్టీలోకి, ఈ పార్టీ నుంచి ఆ పార్టీలోకి మార్పులు, చేర్పులు జరుగుతున్నాయి. స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల్లో మెజారిటీ పార్టీనీ వీడి బయటకు వెళ్ళిపోవడం మింగుడు పడని అంశంగా ఆ పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ పరిణామాలు ఎన్నికల్లో విజయావకాశాలను ప్రభావితం చేయగల స్థాయిలోనే ఉన్నాయి. మొత్తంగా ఇటు బీఆర్ఎస్ లో, అటు కాంగ్రెస్ లో చోటు చేసుకుటున్న పరిణామాలు, గత ఉప ఎన్నికల ద్వారా మునుగోడుకు వచ్చిన హైప్ ఈ ఎన్నికల్లోనూ అదే స్థాయిలో అంచనాలు పెంచడంతో ఇక్కడి పోటీ ఆసక్తి రేపుతోంది.