Gutha Sukhender: మండలి చైర్మన్ ‘గుత్తా’ కు అధిష్టానంపై ‘గుస్సా’ ఎందుకు?-why council chairman gutha sukhender anger with brs high command ,ఎన్నికలు న్యూస్
తెలుగు న్యూస్  /  ఎన్నికలు  /  Gutha Sukhender: మండలి చైర్మన్ ‘గుత్తా’ కు అధిష్టానంపై ‘గుస్సా’ ఎందుకు?

Gutha Sukhender: మండలి చైర్మన్ ‘గుత్తా’ కు అధిష్టానంపై ‘గుస్సా’ ఎందుకు?

HT Telugu Desk HT Telugu
Apr 25, 2024 10:48 AM IST

Gutha Sukhender: నల్గొండ జిల్లా బీఆర్‌ఎస్‌ రాజకీయాలు వేగంగా మారుతున్నాయి. మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్‌ రెడ్డి పార్టీ అధిష్టానంపై అసంతృప్తితో ఉన్నారనే వార్తలు కలకలం రేపుతున్నాయి.

శాసన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి దారెటు...?
శాసన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి దారెటు...?

Gutha Sukhender: రాష్ట్ర వ్యాప్తంగా ఇపుడు అందరి చూపు ఉమ్మడి నల్గొండ Nalgonda జిల్లాపై పడింది. 2023 ఎన్నికల తర్వాత Telangana తెలంగాణలో అధికార మార్పిడి జరిగింది. పదేళ్ల బీఆర్ఎస్ పాలనకు తెరపడి.. కాంగ్రెస్ తిరిగి అధికారం చేజిక్కించుకుంది.

ఈ పరిణామంతో బీఆర్ఎస్ BRS పార్టీకి చెందిన మెజారిటీ నాయకులు తమ అధిష్టానం తీరుపై బహిరంగ విమర్శలకు దగడం మొదలు పెట్టారు. ఇన్నాళ్లూ అణచిపెట్టుకొని ఉన్న తమ నిరసనను వెళ్లగక్కుతున్నారు.

ఈ లోగా ముందుకు వచ్చిన పార్లమెంటు ఎన్నికలతో బీఆర్ఎస్ ను వీడి అటు కాంగ్రెస్, మరికొందరు బీజేపీలోకి వలస బాటపట్టారు. ఈ పరిస్థితుల్లో పార్లమెంటు ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ ఉనికి ఉంటుందా అన్నంత స్థాయిలో చర్చ జరుగుతోంది.

శాసన సభలో Congress కాంగ్రెస్ కు మెజారిటీ ఉన్నా.. శాసన మండలి మాత్రం ఇంకా బీఆర్ఎస్ దే అధిపత్యం, ఆ మండలి చైర్మన్ గా ఉన్న గుత్తా సుఖేందర్ రెడ్డి ఇపుడు పార్టీ అధినాయకత్వంపై తిరుగుబాటు చేసినట్లుగా మాట్లాడుతుండడం రాజకీయా వర్గాల్లో చర్చనీయాంశం అయ్యింది.

గుత్తా కు గుస్సా ఎందుకు..?

శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి దగ్గరి రాజకీయ అనుచర నాయకులంతా ఈరోజు నల్గొండలో భేటీ అవుతున్నారు. భవిష్యత్ నిర్ణయాలు తీసుకోవడంలో భాగంగానే వీరింతా సమావేశం కాబోతున్నారని విశ్వసనీయ సమాచారం.

రెండు సార్లు ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చి.. రెండు సార్లూ మండలి చైర్మన్ పదవిని కట్టబెట్టిన అధినాయకత్వంపై చైర్మన్ గుత్తా ఎందుకు ఆగ్రహంగా ఉన్నారు..? తెరవెనుక అసలేం జరిగింది..? ఉమ్మడి నల్గొండ జిల్లా బీఆర్ఎస్ లో జరుగుతున్న ఆధిపత్య పోరుతో ఈ ఎన్నికల్లో పార్టీ అవకాశాలను దెబ్బతీయదా అన్న చర్చ మొదలైంది.

సుదీర్ఘ రాజకీయ జీవితం ఉన్న గుత్తా సుఖేందర్ రెడ్డి తెలుగుదేశంలో పాతికేళ్లకు పైగా వివిధ హోదాల్లో పనిచేశారు. ఆయన ఒక సారి టీడీపీ నుంచి ఎంపీగా విజయం సాధించారు. ఆ తర్వాత కాంగ్రెస్ లో చేరిన గుత్తా 2009, 2014 పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి ఎంపీగా విజయం సాధించారు.

2016లో కాంగ్రెస్ ను వీడి బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. ఆ తర్వాత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన రైతు సమన్వయ సమితికి తొలి అధ్యక్షుడు కూడా ఆయనే. ఎమ్మెల్సీగా, ఆ తర్వాత మండలి చైర్మన్ గా రెండు పర్యాయాలు పదవులు పొందారు. అయినా, పార్టీ నాయకత్వంపై నిరసన గళం వినిపిస్తున్నారు.పార్లమెంటు ఎన్నికల్లో తన తనయుడు గుత్తా అమిత్ రెడ్డికి నల్గొండ ఎంపీ టికెట్ ఆశించారు. అధిష్టానం సూచన మేరకు భువనగిరి ఎంపీ స్థానంలో పోటీ చేయడానికి కూడా సిద్ధ పడ్డారు.

జిల్లాలోని అధిపత్య రాజకీయాలతో , మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జి.జగదీష్ రెడ్డితో ఉన్న పొరపొచ్చాలు, 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలైన పార్టీ అభ్యర్థులు (ఇపుడు మాజీ ఎమ్మెల్యేలు ) వ్యతిరేకంగా ఉండడం వంటి కారణాలు గుత్తా అమిత్ కు టికెట్ రాకుండా చేశాయన్న అభిప్రాయం ఉంది. మాజీ మంత్రి జగదీష్ రెడ్డి కావాలనే అడ్డుపడ్డారని, అధిష్టానం వాస్తవాలు తెలుసుకోకుండా తమను పక్కన పెట్టిందన్న అసంతృప్తికి గురయ్యారు.

పార్టీ నాయకత్వం తీరుపై విమర్శలు

కాంగ్రెస్ నుంచే వచ్చిన గుత్తా సుఖేందర్ రెడ్డి తిరిగి తన పాతగూటికి దగ్గర అవుతున్నారన్న విమర్శలను ఎదుర్కొంటున్నారు. వీటిని బలపరుస్తూ.. బీఆర్ఎస్ బలహీనమైన పార్టీ అని, సంస్థాగత నిర్మాణం ఏమాత్రం లేదని, ఎమ్మెల్యేలు కేంద్రంగా రాజకీయాలు నడపడం వల్లే మొన్నటి ఎన్నికల్లో అధికారం కోల్పోవాల్సి వచ్చిందని తీవ్ర ఆరోపణలు చేశారు.

శాసన మండలి చైర్మన్ అయిన తనకే ఆరు నెలల పాటు నాటి సీఎం, పార్టీ అధినేత కేసీఆర్ అపాయింట్ మెంట్ దొరకలేదని బయటపెట్టారు. ఈ పరిణామాలన్నీ, ముఖ్యంగా గుత్తా ప్రకటనలన్నీ కాంగ్రెస్ వైపు ఆయన మొగ్గుచూపుతున్నారన్న వాదనకు బలం చేకూర్చాయి. ఈ లోగా గుత్తా వ్యతిరేక వర్గం మీడియాలో, సోషల్ మీడియాలో ఆయనను విమర్శలతో వెంటాడడం మొదలు పెట్టింది.

ఈ పరిస్థితులో ఆయన నుంచి ఏదో ఒక ప్రకటన ఇవ్వాల్సి ఉంటుందని, అందుకే అనుచర నాయకులంతా ఆయన నివాసంలో ఈ రోజు (గురువారం) సమావేశం అవుతున్నారని చెబుతున్నారు.

వీరి భేటీ తర్వాత వారి నుంచి కానీ, మండలి చైర్మన్ గుత్తా నుంచి కానీ ఏదన్నా నిర్ణయం, దానికి సంబంధించిన ప్రకటన బయటకు వస్తుందా అన్న ఎదురుచూపులు మొదలయ్యాయి. వాస్తవానికి 2023 శాసన సభ ఎన్నికల ముందే గుత్తా అనుచరులు పలువురు వివిధ అసెంబ్లీ నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ లో చేరారు.

పార్లమెంటు ఎన్నికల వేళ కూడా ఈ వలసల పరంపర కొనసాగుతోంది. మిగిలిన వారంతా కూడా ఏదో ఒక నిర్ణయం తీసుకునేందుకే గుత్తా ఇంటిలో భేటీ అవున్నట్లు చెబుతున్నారు. కేవలం తన అనుచరులను మాత్రమే బయటకు పంపి గుత్తా బీఆర్ఎస్ లోనే కొనసాగుతారా..? లేక, ఆయన కూడా తన దారి తను చూసుకుని కాంగ్రెస్ గూటికి చేరుతారా..? దీనికి సంబంధించిన ప్రకటన వెలువరిస్తారా ? అన్న ప్రశ్నలు ఉత్కంఠ రేపుతున్నాయి.

( రిపోర్టింగ్ : క్రాంతీపద్మ, నల్గొండ )

 

WhatsApp channel

సంబంధిత కథనం