Bhuvanagiri MP: భువనగిరి ఎంపీ స్థానంలో కాంగ్రెస్ చేరికల మంత్రాంగం…ఓ వైపు గుత్తా అమిత్, మరోవైపు పైళ్ల శేఖర్‌కు గాలం...
Bhuvanagiri MP: ఆరునూరైనా అత్యధిక ఎంపీ స్థానాలను గెలుచుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్న తెలంగాణ కాంగ్రెస్ నాయకత్వం ఆ దిశలో వేగంగా పావులు కదుపుతోంది.
Bhuvanagiri MP: లోక్ సభ loksabha నియోజకవర్గాల్లో కాంగ్రెస్ Congress పార్టీ నుంచి బలమైన అభ్యర్థులు కానరాని పక్షంలో ఇతర పార్టీల నుంచి తీసుకువచ్చేందుకు ఎత్తులు వేస్తోంది. ఇప్పటికే అలా.. ఉమ్మడి కరీంనగర్ జిల్లా పెద్దపల్లి సిట్టింగ్ ఎంపీ బి. వెంకటేశ్ నేతను బీఆర్ఎస్ BRSనుంచి తీసుకొచ్చింది. ఇపుడు ఉమ్మడి నల్గొండ జిల్లా భువనగిరిలో సరైన అభ్యర్థి అన్వేషణలో కాంగ్రెస్ బిజీగా ఉంది.
భువనగిరి కథ.. ఇదీ
లోక్ సభ నియోజకవర్గాల పునర్విభజనలో 2008లో ఏర్పాటైన భువనగిరి నియోజకవర్గానికి 2009 లో మొదటి సారి ఎన్నికలు జరిగాయి. ఆ ఎన్నికల్లో అంతకు ముందు రాజకీయాల్లోకి వచ్చి నిండా ఏడాది కూడా గడవని కోమటిరెడ్డి Komatireddy Rajagopal రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ నుంచి విజయం సాధించారు.
తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఆవిర్భావం తర్వాత 2014 లో జరిగిన ఎన్నికల్లో రాజగోపాల్ రెడ్డి రెండోసారి కాంగ్రెస్ టికెట్ పై పోటీ చేసినా ఓటమి పాలయ్యారు. ఆ స్థానం నుంచి బీఆర్ఎస్ (అప్పటి టీఆర్ఎస్) అభ్యర్థిగా డాక్టర్ బూర నర్సయ్య గౌడ్ విజయం సాధించారు.
2019 ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి పోటీ చేసిన డాక్టర్ బూర నర్సయ్య ఓటమి పాలుకాగా, కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఎంపీగా విజయం సాధించారు. అంటే భువనగిరి నియోజకవర్గం ఏర్పాటయ్యాక జరిగిన మూడు ఎన్నికల్లో కాంగ్రెస్ రెండు విజయాలు సాధించింది.
ఈ లోక్ సభ నియోజకవర్గం పరిధిలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలో జనగమ మాత్రమే బీఆర్ఎస్ చేతిలో ఉండగా.. ఆలేరు, భువనగిరి, తుంగతుర్తి, నకిరేకల్, మునుగోడు, ఇబ్రహీంపట్నం ఆరు చోట్ల కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఉన్నారు. దీంతో ఈ నియోజకవర్గానికి దక్కించుకునేందుకు బలమైన అభ్యర్థి వెదుకులాటలో కాంగ్రెస్ ఉంది.
మాజీ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డికి గాలం..?
భువనగిరి నుంచి తమకు టికెట్ కావాలని తొలుత కోమటిరెడ్డి కుటుంబ సభ్యులు దరఖాస్తు చేసుకున్నారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి సోదరుడు మోహన్ రెడ్డి తనయుడు కోమటిరెడ్డి సూర్యపవన్ రెడ్డి తో పాటు, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి భార్య కోమటిరెడ్డి లక్ష్మీ కూడా పోటీ చేస్తారని ప్రచారం జరిగింది.
వివిధ కారణాలతో కోమటిరెడ్డి కుటుంబం టికెట్ రేసు నుంచి పక్కకు తప్పుకుంది. దీంతో మొదటి నుంచి టికెట్ ఆశిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి సన్నిహితుడు చామల కిరణ్ కుమార్ రెడ్డికి లైన్ క్లియర్ అయినట్లు భావించారు.
ఈ లోగా తెలంగాణ శాసన మండలి చైర్మన్ తనయుడు గుత్తా అమిత్ రెడ్డి అటు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సీఎం రేవంత్ సన్నిహిత మిత్రుడు, ఆయన సలహాదారుగా ఉన్న వేం నరేందర్ రెడ్డితో భేటీ కావడంతో అమిత్ కాంగ్రెస్ లో చేరి భువనగిరి పోటీ చేస్తారని ప్రచారం జరిగింది.
తాజాగా బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డికి గాలం వేస్తున్నారని, ఆయనను పార్టీలోకి తీసుకువచ్చేందుకు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రయత్నిస్తున్నారని సమాచారం అందుతోంది.
పైళ్ల శేఖర్ రెడ్డే ఎందుకంటే..?
ఆలేరు నియోజకవర్గానికి చెందిన పైళ్ల శేఖర్ రెడ్డి 2014, 2018 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి భువనగిరి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించారు.
2023 ఎన్నికల్లో ఓటమి పాలైన ఆయన పార్టీ కార్యక్రమాలకు కొంత దూరంగా ఉంటున్నారు. గతంలో జిల్లా నుంచి మంత్రిగా వ్యవహరించిన సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డితో అంతగా సఖ్యత కూడా లేదు. తనను రాజకీయాంగా తొక్కేస్తున్నారన్న అభిప్రాయంలో పైళ్ల ఉన్నారని చెబుతున్నారు.
బీఆర్ఎస్ నుంచి భువనగిరి ఎంపీ అభ్యర్థిగా పైళ్లను నిలబెట్టాలని అనుకున్నా.. పైళ్ల మాత్రం సుముఖంగా లేరని, తాను పోటీచేయాలేనని పార్టీ నాయకత్వానికి చెప్పేశారని సమాచారం. నియోజకవర్గ పరిధిలో పార్టీ ఎమ్మెల్యేలు లేకపోవడం కూడా ఒక కారణంగా చెబుతున్నారు.
ఈ దశలో తనకున్న పాత పరిచయం, ఇతరత్రా సంబంధాల వల్ల క్లీన్ ఇమేజ్ ఉన్న పైళ్ల శేఖర్ రెడ్డిని పార్టీలోకి తీసుకొస్తే మంచి అభ్యర్థి అవుతారని కోమటిరెడ్డి వెంకటరెడ్డి పావులు కదిపారనని తెలుస్తోంది. భువనగిరి సిట్టింగ్ ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డితో కూడా పైళ్లకు సత్సంబంధాలే ఉండడం, బెంగుళూరులో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్న పైళ్లకు అక్కడి కాంగ్రెస్ నేతలతో కూడా మంచి సంబంధాలే ఉండడంతో ఆ వైపు నుంచి కూడా నరుక్కొచ్చారని అంటున్నారు. మొత్తంగా భువనగిరిలో పైళ్ల శేఖర్ రెడ్డిని కాంగ్రెస్ నుంచి పోటీ చేయించేందుకు పార్టీ నాయకత్వం ప్రయత్నిస్తోందని తెలుస్తోంది.
( రిపోర్టింగ్ : క్రాంతీపద్మ, నల్గొండ )
సంబంధిత కథనం