Lok Sabha Elections 2024 : భువనగిరి ఎంపీ సీటుపై కాంగ్రెస్ లో పీఠముడి..?
Bhuvanagiri Congress MP Ticket 2024: పార్లమెంట్ ఎన్నికల వేళ ఉమ్మడి నల్గొండ కాంగ్రెస్ పాలిటిక్స్ ఆసక్తికరంగా సాగుతున్నాయి. భువనగిరి ఎంపీ టికెట్ కోసం పలువురు నేతలు ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే తాజాగా మరో యువనేత కూడా సీన్ లోకి రావటంతో ఈసారి ఎవరికి టికెట్ దక్కబోతుందనేది ఉత్కంఠగా మారింది.
Bhuvanagiri Congress MP Ticket 2024: లోక్ సభ ఎన్నికలకు సంబంధించి ఇపుడు కాంగ్రెస్ లో భువనగిరి ఎంపీ స్థానం(Bhuvanagiri MP Ticket) హాట్ టాపిక్ గా మారింది. నల్గొండ ఎంపీ స్థానం నుంచి పార్టీ సీనియర్ నాయకుడు కుందూరు జానారెడ్డి కుటుంబం నుంచి జానారెడ్డి కానీ, ఆయన పెద్ద తనయుడు రఘువీర్ రెడ్డి కానీ పోటీకి దిగే అవకాశాలు ఉన్నాయి. ఇక్కడ డైలమాకు పెద్దగా ఆస్కారం కనిపించడం లేదు కానీ, భువనగిరి ఎంపీ స్థానంపై తర్జన బర్జనలు పడుతోంది.
ఇంతకూ టికెట్ ఎవరికి ?
భువనగిరి(Bhuvanagiri Congress MP Ticket) నుంచి ఇంతకూ టికెట్ ఎవరికి దక్కుతుందన్న అంశం పార్టీ శ్రేణుల్లో చర్చనీయాంశంగా మారింది. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘన విజయం సాధించాక.. ముఖ్యంగా ఉమ్మడి నల్గొండ జిల్లాలో పన్నెండుకు పదకొండు చోట్ల గెలిచాక లోక్ సభ ఎన్నికల్లో టికెట్ ఆశించే వారి సంఖ్య పెరిగింది. కోమటిరెడ్డి కుటుంబం నుంచి నల్గొండ, భవనగిరి లోక్ సభా నియోజకవర్గాలకు టికెట్లు కావాలని దరఖాస్తు చేసుకున్నారు. ఇప్పటికే కోమటిరెడ్డి వెంకటరెడ్డి నల్గొండ ఎమ్మెల్యేగా విజయం సాధించి రాష్ట్ర మంత్రివర్గం ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆయన సోదరుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మునుగోడు(Munugodu) ఎమ్మెల్యేగా ఉన్నారు. అయినా.. నల్గొండ ఎంపీ స్థానం నుంచి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూతురు, ఆయన మరో సోదరుడు మోహన్ రెడ్డి తనయుడు సూర్యపవన్ రెడ్డి టికెట్లకు దరఖాస్తు చేసుకున్నారు. ఇక, భువనగిరి ఎంపీ సీటు నుంచి తన భార్య లక్ష్మికి టికెట్ కావాలని రాజగోపాల్ రెడ్డి తొలుత ఆశించారు. అయితే, రాజగోపాల్ రెడ్డి రాష్ట్ర్ర మంత్రివర్గం చోటు కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. మంత్రి పదవి వస్తుందన్న నమ్మకంతో ఉన్న ఆయన తన భార్యకు ఎంపీ టికెట్ అడిగితే.. అది మంత్రి పదవికి అడ్డంకిగా మారుతుందేమోనని వెనక్కి తగ్గినట్లు ఆయన సన్నిహితులు చెబుతున్నారు. దీంతో ఇపుడు కాంగ్రెస్ లో భువనగిరి ఎంపీ టికెట్ ఎవరిని వరిస్తుందన్న ప్రశ్న తలెత్తుతోంది.
చామల కిరణ్ కుమార్ రెడ్డికి అవకాశం దక్కేనా..?
కాంగ్రెస్ పార్టీలో సీనియర్ గా ఉన్న చామల కిరణ్ కుమార్ రెడ్డి భువనగిరి(Bhuvanagiri MP Ticket 2024) టికెట్ ఆశిస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డికి సన్నిహిత మిత్రునిగా ఉన్న చామలకు టికెట్ రావాలంటే కోమటిరెడ్డి సోదరుల ఆశీస్సులు తప్పని సరి. అయితే, చామల కిరణ్ కుమార్ రెడ్డి ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక పదవులను నిర్వహించిన అనుభవం కానీ, ప్రత్యక్ష ఎన్నికలను ఎదుర్కొన్న అనుభవం కానీ, లేవు. ఈ సారి రాష్ట్రం నుంచి 17 ఎంపీ స్థానాలకు గాను, కనీసం 15 చోట్ల విజయం సాధించాలన్న పట్టుదలతో, ప్లాన్ తో కాంగ్రెస్ నాయకత్వం ఉంది. దీంతో ప్రతీ స్థానాన్ని ఆ పార్టీ కీలకంగా భావిస్తోంది. అంతేకాకుండా.. ఇతర పార్టీల నుంచి తీసుకొచ్చైనా సరే టికెట్లు ఇవ్వాలన్న వ్యూహంతో ఉంది. ఈ ప్రణాళికల నేపథ్యంలో చామల కిరణ్ కుమార్ రెడ్డికి టికెట్ దక్కుతుందా అన్న అంశంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.
కాంగ్రెస్ వైపు ‘గుత్తా’ చూపు..?
తెలంగాణ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి తనయుడు గుత్తా అమిత్ రెడ్డి(Gutta Amith reddy) కాంగ్రెస్ వైపు చూపులు సారిస్తున్నారు. మొన్నామొన్నటి దాకా బీఆర్ఎస్ నుంచి నల్గొండ టికెట్ ఆశించిన అమిత్ వివిధ కారణాల వల్ల, పార్టీలో తమకున్న వ్యతిరేకత వల్ల ఎన్నికల్లో ఎవరూ సహకరించరన్న ముందు చూపుతో నల్గొండ టికెట్ ప్రయత్నాల నుంచి పక్కకు జరిగి తనకు పోటీ చేసే ఉద్దేశం లేదని హై కమాండ్ కు సమాచారం ఇచ్చారు. ఆ తర్వాత ఆయన మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డితో భేటీ అయ్యారు. నిన్నటికి నిన్న సీఎం రేవంత్ రెడ్డి సలహాదారు వేం నరేందర్ రెడ్డితో భేటీ అయ్యి చర్చలు జరిపారు. ఈ ఇద్దరు నాయకులను గుత్తా అమిత్ కలవడం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. తనకు భువనగిరి ఎంపీ టికెట్ ఇచ్చే పక్షంలో కాంగ్రెస్ లో చేరడానికి సిద్దంగా ఉన్నానని గుత్తా అమిత్ పార్టీ నాయకత్వానికి ప్రతిపాదన పెట్టారని సమాచారం. గుత్తా సుఖేందర్ రెడ్డికి ఉన్న సంబంధాలు, ప్రధానంగా మదర్ డైరీ చైర్మన్ అటు గుత్తా సుఖేందర్ రెడ్డి, ఆయన సోదరుడు జితేందర్ రెడ్డికి ఉన్న పరిచయాలు ఈ ఎన్నికల్లో ఉపయోగపడతాయన్న అంచనాలో ఉన్నారు. గతంలో సుఖేందర్ రెడ్డి ఈ నియోజకవర్గం నుంచి (నియోజకవర్గాల పునర్విభజనకు ముందు) ఎంపీగా చేసిన అనుభవం, పరిచయాలు ఉన్నాయి. ఈ అంశాలన్నీ పరిగణలోకి తీసుకుని అమిత్ రెడ్డి భువనగిరి ఎంపీ టికెట్ ఇస్తే కాంగ్రెస్ లో చేరడానికి సిద్దంగా ఉన్నట్లు ఆయన సన్నిహితులు చెబుతున్నారు. ఈ కారణాలతోనే భువనగిరి ఎంపీ టికెట్ పై కొంత సందిగ్ధత నెలకొందన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది.