Karimnagar : ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పది నామినేషన్లు దాఖలు-హడావుడి లేకుండా బీఆర్ఎస్ అభ్యర్థి నామినేషన్
Karimnagar Nominations :ఉమ్మడి కరీంనగర్ జిల్లాల్లో నామినేషన్లు జోరందుకున్నాయి. శనివారం 10 నామినేషన్లు దాఖలయ్యాయి. కరీంనగర్ బీఆర్ఎస్ అభ్యర్థి వినోద్ కుమార్ ఎలాంటి హడావుడి లేకుండా నామినేషన్ దాఖలు చేశారు.
Karimnagar Nominations : పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ఉమ్మడి కరీంనగర్(Karimnagar) జిల్లాలోని రెండు పార్లమెంట్ స్థానాలకు పది నామినేషన్ లు దాఖలయ్యాయి. నామినేషన్(Nominations) ల మూడో రోజు శనివారం కరీంనగర్ ఎంపీ స్థానానికి నలుగురు, పెద్దపల్లి ఎంపీ స్థానానికి ఆరుగురు నామినేషన్ లు దాఖలు చేశారు. కరీంనగర్ లో బీఆర్ఎస్ అభ్యర్థి బోయినపల్లి వినోద్ కుమార్ ఎలాంటి హడావిడి లేకుండా ఇద్దరు ఎమ్మెల్యేలు గంగుల కమలాకర్, పాడి కౌశిక్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ తో కలిసి నామినేషన్ దాఖలు చేశారు. వినోద్ కుమార్ తోపాటు ధర్మ సమాజ్ పార్టీ అభ్యర్థిగా శ్రీకాంత్, మరో ఇద్దరు స్వతంత్ర అభ్యర్థులుగా నామినేషన్ దాఖలు చేశారు. పెద్దపల్లి(Peddapalli)లో పీపుల్స్ పార్టీ ఆఫ్ ఇండియా డెమోక్రటిక్ అభ్యర్థిగా మోతె నరేష్, కాంగ్రెస్ రెబల్ అభ్యర్థిగా కట్కూరి సందీప్, స్వతంత్ర అభ్యర్థులుగా గవ్వల శ్రీకాంత్, మేకల అక్షయ్ కుమార్, లింగాల లచ్చయ్య, జాడి ప్రేమ్ సాగర్ నామినేషన్ వేశారు.
దిల్లీలో తెలంగాణ వాణి వినిపించాలంటే బీఆర్ఎస్ కు ఓటెయ్యాలి
తెలంగాణ తెచ్చిన పార్టీ బీఆర్ఎస్(BRS) దిల్లీలో ఉండాల్సిన అవసరం ఉందన్నారు బీఆర్ఎస్ అభ్యర్థి వినోద్ కుమార్(Vinod Kumar). రాష్ట్ర విభజన హామీలు నెరవేరని పరిస్థితిలో పార్లమెంట్ లో తెలంగాణ వాణి వినిపించాలంటే బీఆర్ఎస్ ఎంపీలు ఉండాలని, అందుకు బీఆర్ఎస్ ను గెలిపించాలని కోరారు. గత పార్లమెంట్ ఎన్నికల్లో ఎంపీగా గెలిపిస్తే కరీంనగర్ కు నవోదయ విద్యాలయం తీసుకువచ్చే వాడినని ఇప్పటికైనా తనకు అవకాశం ఇస్తే నవోదయ విద్యాలయం తీసుకువస్తానని తెలిపారు. గతంలో ఎంపీగా కరీంనగర్ అభివృద్ధి వెయ్యి కోట్లు తీసుకు వచ్చానని చెప్పారు. బండి సంజయ్ కి పార్లమెంట్ పునరావాస కేంద్రంగా మారిందని ఎమ్మెల్యేగా గెలువని వ్యక్తికి ఎంపీ(MP)గా పోటీ చేస్తున్నారని విమర్శించారు. అమలు కానీ హామీలు ఇచ్చి కాంగ్రెస్ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చి అబద్దాలతో కాలం గడుపుతుందని ఆరోపించారు. బీజేపీ, కాంగ్రెస్(Congress) కు గుణపాఠం చెప్పేలా బీఆర్ఎస్ కు ఓటు వేయాలని కోరారు.
హిందీ.. ఇంగ్లీష్ రాని వ్యక్తి ఎంపీగా అవసరమా?
హిందీ ఇంగ్లీష్ రాని వ్యక్తి ఎంపీగా అవసరమా? అని ఎమ్మెల్యేలు పాడి కౌశిక్ రెడ్డి(Padi Kaushik Reddy), గంగుల కమలాకర్(Gangula kamalakar) ప్రశ్నించారు. మతం పేరుతో, దేవుడి ఫొటోలతో రాజకీయం చేసే బీజేపీ(BJP)కి ఈఎన్నికల్లో గుణపాఠం చెప్పాలని కోరారు. బండి సంజయ్ ఐదేళ్లలో ప్రచార ఆర్బాటమే తప్ప కరీంనగర్ (Karimnagar)నియోజకవర్గానికి చేసింది ఏమి లేదన్నారు. ఇక కాంగ్రెస్ పరిస్థితి పేరు గొప్ప ఊరు దిబ్బ అన్న చందంగా మారిందని విమర్శించారు. అసెంబ్లీ ఎన్నికల ముందు అనేక హామీలు ఇచ్చి నెరవేర్చడంలో విఫలమవుతుందన్నారు. ఆ రెండు పార్టీలకు ఓటు వేసి వృథా చేసుకోవద్దని కోరారు.
HT Correspondent K.V.REDDY, Karimnagar
సంబంధిత కథనం