Karimnagar Congress Candidate : కరీంనగర్ లో అనధికార కాంగ్రెస్ అభ్యర్థి..! డైలామాలో పార్టీ శ్రేణులు
Karimnagar Congress MP Candidate 2024 : కరీంనగర్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి ఇంకా ఖరారు కాలేదు. అయితే అనధికారికంగా మాత్రం వెలిచాల రాజేందర్ రావు పేరును జనాల్లోకి తీసుకెళ్తున్నారు హస్తం నేతలు. అయితే ఈ విషయంలో క్లారిటీ లేకపోవటంతో కేడర్ కన్ఫ్యూజనన్ లో పడిపోయింది.
Karimnagar Lok Sabha Constituency: పార్లమెంట్ ఎన్నికల నామినేషన్ ల ప్రక్రియ ప్రారంభమైనా కరీంనగర్ లో కాంగ్రెస్ అభ్యర్థి(Karimnagar Congress MP Candidate) ఎవరనేది పార్టీ అధిష్టానం ఇంకా తేల్చలేదు. కానీ, కరీంనగర్ కాంగ్రెస్ నాయకులు మాత్రం అనధికార అభ్యర్థిని పార్టీ శ్రేణులకు పరిచయం చేసే పనిలో నిమగ్నమయ్యారు. కొందరు నాయకులు ఏకంగా వెలిచాల రాజేందర్ రావే(Velichala Rajender Rao) అభ్యర్థి అని చెబుతు ప్రచారం సాగిస్తున్నారు. అధిష్టానం అభ్యర్థిని ఇంకా అధికారికంగా ప్రకటించకపోయినప్పటికి రాజేందర్ రావును గెలిపించాలని పార్టీ నాయకులు మాట్లాడడం అభ్యర్థి విషయంలో క్లారిటీ లేక పార్టీ శ్రేణుల్లో కన్ఫ్యూజన్ నెలకొంది.
అభ్యర్థిని వెంటనే ప్రకటించాలి…
కరీంనగర్ లో కాంగ్రెస్ నుంచి పోటీ చేసేందుకు 14 మంది పోటీ పడగా చివరకు మాజీ ఎమ్మెల్యే అల్గిరెడ్డి ప్రవీణ్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే స్వర్గీయ వెలిచాల జగపతిరావు తనయుడు రాజేందర్ రావు(Velichala Rajender Rao) పేర్లను డిల్లీకి పంపించారు. అభ్యర్థి విషయంలో కరీంనగర్ నాయకులతోపాటు రాష్ట్ర స్థాయి నేతల మద్య ఏకాభిప్రాయం లేకపోవడంతో అభ్యర్థి ఎంపిక విషయంలో అధిష్టానం తర్జనభర్జన పడుతు అధికారికంగా అభ్యర్థిని ప్రకటించడంలో జాప్యం చేస్తుంది. అభ్యర్థి ఎంపికపై జరుగుతున్న జాప్యంతో పార్టీ శ్రేణుల్లో అయోమయం నెలకొనడంతో అభ్యర్థి ఎవరైనా పార్టీ గెలిపే లక్ష్యంగా పార్టీ శ్రేణులను సన్నద్ధం చేసే పనిలో మంత్రి పొన్నం ప్రభాకర్ నిమగ్నమయ్యారు. కరీంనగర్ లో మార్నింగ్ వాక్ తో ప్రచారానికి శ్రీకారం చుట్టారు మంత్రి పొన్నం ప్రభాకర్. గురువారం నుంచి నాలుగు రోజులపాటు అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా సన్నాహక సమావేశాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. గురువారం మానకొండూర్, హుజురాబాద్ రెండు అసెంబ్లీ నియోజకవర్గాల కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సన్నాహక సమావేశాలు నిర్వహించి అనధికార అభ్యర్థిగా వెలిచాల రాజేందర్ రావును పరిచయం చేశారు. అందరి మాదిరిగానే తాను సైతం కాంగ్రెస్ అభ్యర్థిని అధిష్టానం త్వరగా ప్రకటించాలని కోరుతున్నానని తెలిపారు.
కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం, రాష్ట్రంలో గత బిఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాలు... ఎంపీ బండి సంజయ్ తల్లి గురించి చేసిన కామెంట్సే తమ ప్రధాన ఎజెండాగా ప్రజల్లోకి వెళ్తామని స్ఫష్టం చేశారు పొన్నం ప్రభాకర్. 4 నెలల్లో కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలే కాంగ్రెస్ గెలుపుకు దోహదపడుతాయని తెలిపారు. మాజీ సీఎం కెసీఆర్(KCR) మతి మస్థిమితం కోల్పోయి మాట్లాడుతున్నారని, ఐదేళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వం సుస్థిరంగా ఉంటుందన్నారు. ఎలాక్టోరల్ బాండ్ల విషయంలో మోడీ అవినీతిని ప్రోత్సహించే విధంగా మాట్లాడారని, బాండ్ల రూపంలో లంచం ఇస్తేనే శరత్ చంద్రారెడ్డికి బెయిల్ వచ్చిందని ఆరోపించారు. ఫోన్ ట్యాపింగ్ లో విచారణ సాగుతుందని తెలిపిన పొన్నం, కేటిఆర్ పోన్ ట్యాపింగ్ విషయంపై రోజుకో విధంగా మాట్లాడుతున్నారని విమర్శించారు. హరీష్ రావు ఏమి మాట్లాడుతున్నారో ఆయనకే తెలియడంలేదన్నారు. మేము రాముడుని ఆరాధిస్తాము..రాజకీయాలు చేయమని స్పష్టం చేశారు. బిజేపికి చిత్తశుద్ది ఉంటే మోడీ ఫోటోతో ఓట్లు అడగండి.. రాముని ఫోటోతో కాదన్నారు. ఐదేళ్లలో బీజేపీ, అంతకు ముందు బీఆర్ఎస్ ఎంపీలు కరీంనగర్ కు ఏం చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. తెలంగాణ లో మెజారిటీ సీట్లోలో కాంగ్రెస్ దే గెలుపని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు.
ఆ ఇద్దరు అర్హులే- రాజేందర్ రావు
మానకొండూర్, హుజురాబాద్ లో జరిగిన కాంగ్రెస్ సన్నాహక సమావేశాలకు వెలిచాల రాజేందర్ రావు(Velichala Rajender Rao) హజరు కాగ పార్టీ నాయకులు తమ ప్రసంగాల్లో అభ్యర్థి రాజేందర్ రావు అంటు ఆయనను బారీ మెజార్టీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. అదికారికంగా అధిష్టానం ప్రకటించకపోవడంతో అభ్యర్థి ఎవరైనా చేతిగుర్తుకు ఓటు వేయించి కాంగ్రెస్ ను గెలిపించాలని కోరారు. ఇక కాంగ్రెస్ అభ్యర్థిగా భావిస్తున్న రాజేందర్ రావు మాట్లాడుతు రెండు రోజుల్లో కాంగ్రెస్ అధిష్టానం కరీంనగర్ అభ్యర్థిపై నిర్ణయం తీసుకుంటుందని స్పష్టం చేశారు. టికెట్ ఆశిస్తున్న వారిలో తనతోపాటు అల్గిరెడ్డి ప్రవీణ్ రెడ్డి, తిన్మార్ మల్లన్న ఇద్దరు అర్హులేనని తెలిపారు. టికెట్ ఎవరికొచ్చినా పార్టీ అభ్యర్థి విజయం కోసం కృషి చేయాలని కోరారు. కాంగ్రెస్ ప్రభుత్వం పేదల పక్షాన ఉంటుందని, కాంగ్రెస్ తోనే దేశ అభివృద్ధి సాధ్యమన్నారు. మోడీ ప్రభుత్వాన్ని కూల్చేందుకు సమయం వచ్చిందని అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని కాంగ్రెస్ ను గెలిపించాలని కోరారు.