Warangal Congress: ఓరుగల్లు కాంగ్రెస్‌లో 'కొత్త- పాత' వార్.. వర్గపోరుతో బాహాబాహీకి దిగుతున్న క్యాడర్-warangal congress cadre has factional differences congress leaders split into two ,ఎన్నికలు న్యూస్
తెలుగు న్యూస్  /  ఎన్నికలు  /  Warangal Congress: ఓరుగల్లు కాంగ్రెస్‌లో 'కొత్త- పాత' వార్.. వర్గపోరుతో బాహాబాహీకి దిగుతున్న క్యాడర్

Warangal Congress: ఓరుగల్లు కాంగ్రెస్‌లో 'కొత్త- పాత' వార్.. వర్గపోరుతో బాహాబాహీకి దిగుతున్న క్యాడర్

HT Telugu Desk HT Telugu
Apr 17, 2024 09:31 AM IST

Warangal Congress: లోక్ సభ ఎన్నికల వేళ ఓరుగల్లు కాంగ్రెస్ లో వర్గపోరు భగ్గుమంటోంది. పార్లమెంట్ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ సెగ్మెంట్ల వారీగా నిర్వహిస్తున్న సన్నాహక సమావేశాల్లో వర్గ విభేదాలు బయటపడుతున్నాయి.

వరంగల్ కాంగ్రెస్‌ గ్రూపు గొడవలతో కడియం శ్రీహరిలో ఆందోళన
వరంగల్ కాంగ్రెస్‌ గ్రూపు గొడవలతో కడియం శ్రీహరిలో ఆందోళన

Warangal Congress: గెలుపు లక్ష్యంగా Warangal వరంగల్‌లో కాంగ్రెస్‌ Congress నేతలు సమావేశాలు నిర్వహిస్తున్నా వాటిలో గ్రూప్ వార్‌ జరుగుతుండటం కాంగ్రెస్ అభ్యర్థి కడియం కావ్య, ఆమె తండ్రి కడియం శ్రీహరిని కలవరపెడుతున్నాయి. దీంతో తండ్రీ కూతుళ్లకు కొత్త తలనొప్పి స్టార్ట్ అయిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కాంగ్రెస్‌ పార్టీలో కొత్త, పాత నేతల మధ్య జరుగుతున్న ఇంటర్నల్ వార్ Internal Politics కూడా పార్లమెంట్ ఎన్నికల వేళ కడియం ఫ్యామిలీని కంగారు పెడుతున్నాయి.

మొన్న కడియం వర్సెస్ ఇందిరా..

వరంగల్ పార్లమెంట్ ఎస్సీ రిజర్వ్డ్ కాగా.. కాంగ్రెస్ అభ్యర్థిగా కడియం శ్రీహరి కూతురు డాక్టర్ కడియం కావ్య పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. ఇటీవల కడియం శ్రీహరి, కావ్య ఆధ్వర్యంలో తమ సొంత నియోజకవర్గం స్టేషన్ ఘన్ పూర్ లో నిర్వహించిన మీటింగ్ నుంచే విభేదాలు బయట పడుతున్నాయి.

స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గంలో లింగాల గణపురం మండలం కార్యకర్తలతో ఆ పార్టీ సీనియర్ నాయకురాలు, మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి చవిచూసిన శనిగపురం ఇందిరా ఆధ్వర్యంలో సన్నాహక సమావేశం నిర్వహించారు.

ఒకే వేదికపై కడియం శ్రీహరి, కావ్య, శనిగపురం ఇందిరా ఉండగా, మీటింగ్ సందర్భంగా చేరిక విషయం తీవ్ర ఘర్షణకు దారి తీసింది. కడియం శ్రీహరి తన క్యాడర్ ను కాంగ్రెస్ లో చేర్చుకునే క్రమంలో ఇందిరా వర్గీయులు అభ్యంతరం వ్యక్తం చేశారు.

అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమికి కారణమైన వారిని పార్టీలోకి చేర్చుకోవద్దంటూ నినాదాలు చేశారు. దీంతో మీటింగ్ లో ఒక్కసారిగా గందరగోళం నెలకొంది. అంతే గాకుండా బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరుతున్న నాయకుల ఫ్లెక్సీలను చింపి, కడియం శ్రీహరి, ఎంపీ అభ్యర్థి కావ్యకు వ్యతిరేకంగా ఇందిరా అనుచరులు నినాదాలు కూడా చేశారు.

గత పది సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీని నమ్ముకున్న వారికి అన్యాయం చేస్తున్నారని, కడియం శ్రీహరి క్యాడర్ ను పార్టీలో చేర్చుకోవద్దని డిమాండ్ చేశారు. దీంతో కడియం శ్రీహరి, కావ్య సమావేశం నుంచి మధ్యలోనే వెళ్లిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.

పాలకుర్తిలో సేమ్ సీన్

స్టేషన్ ఘన్ పూర్ తో పాటు పాలకుర్తిలో కూడా వర్గ విభేదాలు భగ్గుమన్నాయి. పాలకుర్తి నియోజకవర్గంలోని దేవరుప్పుల మండలంలో బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలను హనుమండ్ల ఝాన్సీ రెడ్డి కాంగ్రెస్ లోకి చేర్చుకోవడంపై పాత కార్యకర్తలు కొందరు అభ్యంతరం చెప్పారు.

దీంతో పాత కాంగ్రెస్ నేతలతో పాటు బీఆర్ఎస్ వీడి కాంగ్రెస్ లో చేరుతున్న నేతలకు తీవ్ర వాగ్వాదం జరిగింది. చివరకు పోలీసులు చేరుకొని ఇరువర్గాలకు సర్దిచెప్పే ప్రయత్నం చేసినా ఫలితం లేకపోగా.. చాలాసేపు అక్కడ ఘర్షణ వాతావరణం గందరగోళానికి దారి తీసింది.

కొండా వర్సెస్ రేవూరి గ్యాంగ్

స్టేషన్ ఘన్పూర్, పాలకుర్తితో పాటు పరకాల నియోజకవర్గంలో కూడా వర్గపోరు బయటపడింది. పరకాల నియోజకవర్గం కొండా సురేఖ, కొండా మురళి అడ్డా కాగా.. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో సీఎం రేవంత్ రెడ్డి ఆ టికెట్ ను నర్సంపేట బీజేపీలో కొనసాగుతున్న రేవూరిని పిలిచి మరీ టికెట్ ఇచ్చి, గెలిపించారు. దీంతో ఆయన అక్కడా పాగా వేశారు.

వాస్తవానికి పరకాల ‘కొండా’ కంచుకోట కాగా.. ఇటీవల కొండా, రేవూరి వర్గాల మధ్య విభేదాలు తలెత్తాయి. ఈ నేపథ్యంలోనే ఇటీవల కాంగ్రెస్ నిర్వహించిన సమన్వయ సమావేశంలో కొండా మురళి, ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి వర్గీయుల మధ్య గొడవ జరిగింది. కొండా మురళి, సురేఖ లేకుండా సమావేశం ఎలా నిర్వహిస్తారంటూ కొండా అనుచరులు వాదనకు దిగగా.. సన్నాహక సమావేశం కాస్త ఉద్రిక్తతకు దారితీసింది. దీంతో పరకాల కాంగ్రెస్ లో వర్గ విభేదాలు తేటతెల్లమయ్యాయి.

కడియంకు టెన్షన్.. టెన్షన్

వరంగల్ పార్లమెంట్ స్థానంలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలే ఉన్నారు. దీంతో ఈజీగా విజయం సాధించవచ్చనే ఉద్దేశంతో కడియం ధీమాతో ఉండగా.. సన్నాహక సమావేశాల్లో బయటపడుతున్న విభేదాలు కడియం ఫ్యామిలీకి తలనొప్పిగా మారాయి. వరంగల్ పార్లమెంటు పరిధిలోని ఒకట్రెండు నియోజకవర్గాలలో తప్పా అంతటా వర్గ విభేదాలు బయటపడుతుండటంతో కడియం ఫ్యామిలీకి టెన్షన్ మొదలైంది.

సులభంగా గెలుద్దామనుకుంటే వర్గపోరు దెబ్బతీసేలా ఉందని కడియం మదన పడుతున్నట్లు తెలిసింది. ఇదే గ్రూప్ తగాదాలు ఎన్నికల దాకా కొనసాగితే ఎంపీ అభ్యర్థి గెలవడం కంటే ఓడిపోవడానికే ఎక్కువ అవకాశాలుంటాయనే చర్చ జరుగుతోంది. ఇంకో నెల రోజుల్లోనే ఎలక్షన్ జరగనుండగా.. ఆలోగా కాంగ్రెస్ విభేదాల సుడిగుండం నుంచి బయట పడుతుందో లేదో చూడాలి.

(హిందుస్థాన్ టైమ్స్ తెలుగు, వరంగల్ ప్రతినిధి)

Whats_app_banner

సంబంధిత కథనం