Warangal loksabha: కూతురు కోసం తండ్రి ఆరాటం.. వరంగల్‌ పార్లమెంట్‌ స్థానంలో కడియం శ్రీహరి పోరాటం…-kadiam srihari fight for his daughter victory in warangal parliament ,ఎన్నికలు న్యూస్
తెలుగు న్యూస్  /  ఎన్నికలు  /  Warangal Loksabha: కూతురు కోసం తండ్రి ఆరాటం.. వరంగల్‌ పార్లమెంట్‌ స్థానంలో కడియం శ్రీహరి పోరాటం…

Warangal loksabha: కూతురు కోసం తండ్రి ఆరాటం.. వరంగల్‌ పార్లమెంట్‌ స్థానంలో కడియం శ్రీహరి పోరాటం…

HT Telugu Desk HT Telugu
Apr 09, 2024 08:50 AM IST

Warangal loksabha: స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి తన కూతురు డాక్టర్ కడియం కావ్య కోసం నానా తిప్పలు పడుతున్నారు. కూతురి రాజకీయ ఆరంగ్రేటం గెలుపుతోనే మొదలవ్వాలనే ఉద్దేశంతో పార్లమెంట్ టికెట్ సంపాదించేందుకు శ్రమించిన ఆయన.. ఇప్పుడు గెలుపు వ్యూహాలు రచించడంలో తలమునకలవుతున్నారు.

కూతురు గెలుపు కోసం కడియం శ్రీహరి ఆరాటం
కూతురు గెలుపు కోసం కడియం శ్రీహరి ఆరాటం

Warangal loksabha: వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గంలో కొందరు నేతలు కడియం ఫ్యామిలీ కాంగ్రెస్ ఎంట్రీపై అసహనంతో ఉండగా.. వాళ్లందరినీ సమన్వయం చేయడానికి Kadiyam Srihari చమటోడుస్తున్నారు. ఒక్కొక్కరిని ప్రత్యేకంగా మద్దతు కోరడంతో పాటు కావ్య గెలుపు కోసం సహకరించాల్సిందిగా పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులను కోరుతున్నారు.

బీఆర్ఎస్ టికెట్ కోసం పట్టు

కడియం శ్రీహరికి ముగ్గురు కూతుళ్లు కాగా.. అందులో మొదటి సంతానం కడియం కావ్య Kadiyam Kavya... ఆమె దక్కన్ మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ చేసి, ఉస్మానియాలో పీజీ పూర్తి చేశారు. ప్రస్తుతం వర్ధన్నపేటలో సీనియర్ రెసిడెంట్ Senior Resident డాక్టర్ గా విధులు నిర్వర్తిస్తున్నారు.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయాల్లో ఎంతో పేరు సంపాదించిన కడియం.. తన రాజకీయ వారసత్వం కొనసాగించడానికి తన కూతురు కావ్యను ఎంపిక చేసుకున్నారు. ఈ మేరకు ఆమెను రాజకీయాల్లోకి తీసుకొచ్చేందుకు కొంత కాలంగా సరైన సమయం కోసం ఎదురుచూస్తున్నారు.

ఈ క్రమంలోనే 2023 అసెంబ్లీ ఎన్నికల సమయంలో బీఆర్ఎస్ BRS పార్టీలో కొనసాగిన ఆయన.. స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే టికెట్ తన కూతురి కోసం అడిగారు. కానీ రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ పరిస్థితులు బాలేకపోవడంతో కడియం శ్రీహరినే రంగంలోకి దిగాల్సిందిగా.. పార్టీ అధిష్టానం ఆదేశించింది.

స్టేషన్ ఘన్ పూర్ లో బీఆర్ఎస్ నుంచి పోటీ చేసిన ఆయన ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఆ తరువాత పార్లమెంట్ ఎన్నికలకు ముహూర్తం ఖరారు కాగా.. ఎలాగైనా తన కూతురుకు ఎంపీ టికెట్ ఇప్పించుకోవాలని కడియం శ్రీహరి చూశారు. అప్పటికే పార్టీ నుంచి అరూరి రమేశ్, పసునూరి దయాకర్ లాంటి గట్టి పోటీదారులు టికెట్ బరిలో ఉన్నప్పటికీ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను మెప్పించి తన కూతురు కడియం కావ్యకు టికెట్ ఇప్పించుకున్నారు. ఆ పార్టీకి క్షేత్రస్థాయి పరిస్థితులు బాలేకపోవడంతో బీఆర్ఎస్ నుంచి పోటీ చేసేందుకు వెనుకడుగు వేశారు.

గెలుపే లక్ష్యంగా కాంగ్రెస్ లోకి..

బీఆర్ఎస్ పై వ్యతిరేకత, స్థానిక నాయకులపై ఉన్న అసహనం తన కూతురు గెలుపు అవకాశాలను దెబ్బతీస్తాయనే ఉద్దేశంతో కడియం శ్రీహరి ప్రత్యామ్నాయంపై దృష్టి పెట్టారు.

అందుకే బీఆర్ఎస్ అధిష్ఠానం టికెట్ కేటాయించినా.. దానిని వదులుకుని కాంగ్రెస్ వైపు అడుగులు వేశారు. ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డితో కలిసి గతంలో టీడీపీలో పని చేసిన అనుభవం, అనుబంధంతో మార్చి 31న బీఆర్ఎస్‌కు రాజీనామా చేసి హస్తం పార్టీలో చేరారు.

అప్పటికే కాంగ్రెస్ పార్టీ నుంచి ఎంపీ టికెట్ కోసం 42 మంది దరఖాస్తు చేసుకోగా... అప్లికేషన్ పెట్టుకోని మరికొందరు నేతలు క్యూలో ఉన్నారు. ఎవరికి వారు తమతమ గాడ్ ఫాదర్ల సపోర్టుతో కాంగ్రెస్ టికెట్ కోసం తీవ్రంగానే శ్రమిస్తున్నారు. ఈ తరుణంలో కాంగ్రెస్ వైపు ఆలోచించిన కడియం శ్రీహరి తన కూతురుకు ఎంపీ టికెట్ ఇప్పించుకునేందుకు పార్టీ అగ్రనేతలను కూడా కలిశారు.

ఈ మేరకు పక్కా హామీ తోనే తండ్రీకూతుళ్లు ఇద్దరూ గులాబీ పార్టీకి రాజీనామా చేయగా.. పార్టీలో చేరిన మరుసటి రోజే కడియం కావ్యను వరంగల్ పార్లమెంట్ అభ్యర్థిగా కాంగ్రెస్ ప్రకటించింది. అంత మంది సీనియర్ నాయకులను కాదని, తన కూతురుకు టికెట్ ఇప్పించుకుని కడియం శ్రీహరి పంతం నెగ్గించుకోగా.. ఆ తరువాతే అసలు టాస్క్ మొదలైంది.

కూతురు రాజకీయ భవిష్యత్తు కోసం

కాంగ్రెస్ ఎంపీ టికెట్ పై ఆశలు పెట్టుకున్న కొందరు నేతలు.. కడియం కావ్యను అభ్యర్థిగా ప్రకటించడంతో తీవ్ర అసంతృప్తికి గురయ్యారు. ముఖ్యంగా స్టేషన్ ఘన్ పూర్ నియోజకవర్గ నాయకురాలు సింగపురం ఇందిరా ఏకంగా కడియం కాంగ్రెస్ ఎంట్రీని వ్యతిరేకిస్తూ తన అనుచరులతో మీటింగులు నిర్వహించి, నిరసనలకు పిలుపునిచ్చారు.

మరికొంతమంది ఎడమొహం, పెడమొహం ప్రవర్తించారు. దీంతో వారందరినీ కూల్ చేయడం కడియం శ్రీహరికి పెద్ద టాస్క్ గా మారింది. తన కూతురు రాజకీయ భవిష్యత్తు కోసం ఆరాట పడుతున్న కడియం మొట్టమొదట వారందరినీ వ్యక్తిగతంగా కలిసి సపోర్ట్ కోరేందుకు నిర్ణయించుకున్నారు. ఈ మేరకు పార్టీ ఆదేశాలతో వరంగల్ పారల్మెంట్ పరిధిలోని నేతలందరినీ కలిశారు.

తన కూతురు గెలుపు కోసం సహకరించాల్సిందిగా అందరినీ విజ్ఞప్తి చేశారు. రెండు రోజుల కిందట హైదరాబాద్ లో సీఎం రేవంత్ రెడ్డి నివాసంలో ప్రత్యేకంగా వరంగల్ పార్లమెంట్ సమావేశం నిర్వహించి, అందరినీ ఒక్కతాటిపైకి తెచ్చే ప్రయత్నం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో పార్లమెంట్ సెగ్మెంట్ పరిధిలోని మండలాల మీటింగులు కూడా స్టార్ట్ చేశారు.

మరికొద్దిరోజుల్లోనే ఎన్నికలు జరగనుండగా.. ఇప్పటి నుంచే ఆయన తన కూతురు రాజకీయ భవిష్యత్తు కోసం ఆచితూచి అడుగులు వేస్తున్నారు. మరి తన బిడ్డ కోసం కడియం శ్రీహరి చేస్తున్న ప్రయత్నాలు ఏ మేరకు సఫలమవుతాయో చూడాలి.

(హిందుస్థాన్ టైమ్స్ తెలుగు, వరంగల్ ప్రతినిధి)

WhatsApp channel

సంబంధిత కథనం