BRS Warangal : బీఆర్ఎస్ కు ఊహించని షాక్... పోటీ నుంచి తప్పుకున్న ఎంపీ అభ్యర్థి కావ్య, కాంగ్రెస్ లోకి కడియం శ్రీహరి..?
BRS Warangal MP Candidate Kadiyam Kavya : బీఆర్ఎస్ పార్టీకి ఊహించని షాక్ తగిలింది. వరంగల్ లోక్ సభ స్థానం నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా ఖరారైన కడియం కావ్య… పోటీ నుంచి తప్పుకున్నారు.
BRS Warangal MP Candidate: బీఆర్ఎస్ పార్టీకి ఊహించని షాక్ ఇచ్చారు ఆ పార్టీ వరంగల్ ఎంపీ అభ్యర్థి కడియం కావ్య. పోటీ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటన విడుదల చేశారు. ఈ మేరకు పార్టీ అధినేత కేసీఆర్ కు లేఖ రాశారు.
కడియం కావ్య(Kadiyam Kavya) రాసిన లేఖలో పలు అంశాలను ప్రస్తావించారు. గత కొన్నిరోజులుగా పార్టీ నాయకత్వంపై అవినీతి, భూకబ్జా, ఫోన్ ట్యాపింగ్ తో పాటు లిక్కర్ స్కామ్ విషయాల్లో అనేక వార్తలు వస్తున్నాయని పేర్కొన్నారు. ఇలాంటి విషయాలు పార్టీ ప్రతిష్టను దిగజార్చాయని చెప్పారు. ఇక నేతల మధ్య సమన్వయం లేదని... ఎవరికి వారే యమునా తీరే అన్నట్లుగా వ్యవహరిస్తున్నారని తెలిపారు. ఇది పార్టీకి మరింత నష్టం చేస్తుందని ఎత్తిచూపారు. ఇలాంటి పరిస్థితుల్లో పోటీ నుంచి విరమించుకోవాలని నిర్ణయించుకున్నాని తెలిపారు.
ఇటీవలే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ను కలిశారు కడియం కావ్య. పోటీ చేసే అవకాశం ఇచ్చినందకు కృతజ్ఞతలు తెలిపినట్లు ప్రకటించారు. ఇంతలోనే పోటీ నుంచి తప్పుకుంటున్న కావ్య ప్రకటన చేయటం…. చర్చనీయాంశంగా మారింది. ఇదే సమయంలో ఆమె రాసిన లేఖలో…. కీలక అంశాలను ప్రస్తావించటంతో పార్టీ మరే ఆలోచనలో ఉన్నారా అన్న చర్చ కూడా మొదలైంది.
కాంగ్రెస్ లోకి కడియం…?
కడియం కావ్య తండ్రి అయిన కడియం శ్రీహరి… ప్రస్తుతం ఘన్ పూర్ ఎమ్మెల్యేగా ఉన్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో సిట్టింగ్ ఎమ్మెల్యే రాజయ్యను కాదని కడియం శ్రీహరికి అవకాశం ఇచ్చింది బీఆర్ఎస్. ఈ ఎన్నికల్లో ఆయన విజయం సాధించారు. పార్టీలో కూడా కీలక నేతగా ఉన్నారు.తాజాగా జరిగిన అసెంబ్లీ సమావేశాల్లోనూ పార్టీ తరపున బలమైన వాయిస్ ను వినిపించారు. అయితే కుమార్తె కావ్య… పోటీ నుంచి తప్పుకోవటం వెనక శ్రీహరి నిర్ణయం ఉంటుందనే భావించవచ్చు. ఈ నేపథ్యంలో…. ఆయన పార్టీ మారే ఆలోచనలో ఉన్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. వరంగల్ ఎంపీ అభ్యర్థిగా ఆయన పేరు ఖరారయ్యే అవకాశం ఉందని లీకులు వస్తున్నాయి. రేపోమాపో ఆయన పార్టీకి రాజీనామా చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. ఆయనతో పాటే కావ్య కూడా కాంగ్రెస్ కండువా కప్పుకుంటారని సమాచారం. అయితే పార్టీ మార్పుపై కడియం శ్రీహరి ఇంకా స్పందించలేదు. ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది ఆసక్తికరంగా మారింది.