Aroori vs Kadiyam : కడియం కావ్య గుంటూరు కోడలు, వరంగల్ తో ఆమెకు సంబంధమే లేదు - ఆరూరి రమేశ్
Warangal Politics : కడియం శ్రీహరి కుటుంబంపై సంచలన వ్యాఖ్యలు చేశారు వరంగల్ బీజేపీ ఎంపీ అభ్యర్థి అరూరి రమేశ్. కడియం కావ్య గుంటూరు కోడలు అని.. వరంగల్ తో ఆమెకు సంబంధమే లేదన్నారు. కడియం శ్రీహరి కుట్రల వల్లే తనలాంటి వారందరూ బలయ్యారని ఆరోపించారు.
Aroori Ramesh Comments On Kadiyam Kavya: కడియం శ్రీహరి కుట్రలే వల్ల మాజీ ఎమ్మెల్యే రాజయ్యతో పాటు తనలాంటి వాళ్లంతా బలయ్యారని బీజేపీ వరంగల్ ఎంపీ అభ్యర్థి అరూరి రమేష్(Aroori Ramesh) సంచలన ఆరోపణలు చేశారు. కడియం శ్రీహరి కూతురు కడియం కావ్య గుంటూరు చెందిన నజీరుద్దీన్ ను వివాహం చేసుకుందని, ఆమెకు వరంగల్ జిల్లాతో సంబంధమే లేదని ఆయన హాట్ కామెంట్స్ చేశారు. దీంతో ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా అరూరి వ్యాఖ్యలపై తీవ్ర చర్చ జరుగుతోంది. హనుమకొండ హంటర్ రోడ్డులోని బీజేపీ ఆఫీస్ లో గురువారం పార్టీ వరంగల్, మహబూబాబాద్ ఎంపీ అభ్యర్థులు అరూరి రమేశ్, సీతారాం నాయక్ తో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అరూరి రమేశ్ మాట్లాడారు. కాంగ్రెస్ వరంగల్ పార్లమెంట్ అభ్యర్థి కడియం కావ్యకు(Kadiyam Kavya), వరంగల్ జిల్లాకు సంబంధం ఏమీ లేదని స్పష్టం చేశారు. కడియం కావ్య గుంటూరుకు చెందిన నజీరుద్దీన్ ను పెళ్లి చేసుకుందని చెప్పారు. గుంటూరు వ్యక్తులకు ఇక్కడ ఓట్లు ఎందుకు వెయ్యాలో చెప్పాలని డిమాండ్ చేశారు. గుంటూరు కోడలు కావాలో.. ప్రజల కష్టసుఖాల్లో తోడుంటే ఓరుగల్లు ముద్దుబిడ్డ కావాలో ప్రజలే ఆలోచించాలని కోరారు.
అందరికీ మోసం చేసిన వ్యక్తి కడియం శ్రీహరి
గడిచిన పదేళ్లలో వర్ధన్నపేట నియోజకవర్గ ప్రజల కష్టసుఖాల్లో తోడున్నానని, అయినా తనను మూడోసారి గెలవకుండా పార్టీలోని కొందరు ద్రోహులే కుట్రలు చేశారని అరూరి రమేశ్(Aroori Ramesh) ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యంగా బీఆర్ఎస్ లో ఉంటూ డిప్యూటీ సీఎం లాంటి ఎన్నో పదవులు అనుభవించిన కడియం శ్రీహరి (Kadiyam Srihari)కుట్రలకు బలయ్యామని, మూడోసారి గెలిస్తే తన మంత్రి పదవికి అడ్డువస్తాననే ఉద్దేశంతో కుట్రలు చేశాడన్నారు. టీడీపీ, టీఆర్ఎస్ లలో పదవులు పొంది, మాదిగలకు అన్యాయం చేశాడన్నారు. ఎస్సీ రిజర్వేషన్ ఫలాలను మాల, మాదిగలకు అందకుండా చేసిన మోసకారి కడియం శ్రీహరి అని మండిపడ్డారు. తాటికొండ రాజయ్య, దయాకర్ తో పాటు తనను బీఆర్ఎస్ నుంచి బయటకు పంపి చివరకు అదే పార్టీకి మోసం చేసిన వ్యక్తి కడియం శ్రీహరి అని ఆరోపించారు. దళితులను ఇబ్బంది పెట్టిన కడియంకు బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉందన్నారు. దేశ రక్షణ, ధర్మం, న్యాయం కోసం మోడీ పనిచేస్తున్నారని, ఆయన టీమ్ లో పనిచేయడానికి తామంతా వస్తున్నామని అరూరి రమేశ్ చెప్పుకొచ్చారు. ప్రపంచ దేశాలన్నీ మోడీ వైపే చూస్తున్నాయని, గ్రామాల నుంచి పట్టణాల వరకు అభివృద్ధి చేసిన ఘనత కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. కోచ్ ఫ్యాక్టరీ, మామునూరు ఎయిర్ పోర్టు, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటుకు ప్రణాళికలు వేశామన్నారు. మాయ మాటలు చెప్పి రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని, పార్లమెంట్ ఎన్నికల్లో ఆ పార్టీకి బుద్ధి చెప్పాలన్నారు.
తెలంగాణ ద్రోహులకు పట్టం కట్టారు: సీతారాం నాయక్
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ (KCR)తెలంగాణ ద్రోహులకు పట్టారని, దొంగలంతా పార్టీలో చేరి నాశనం చేశారని మహబూబాబాద్ ఎంపీ అభ్యర్థి సీతారాం నాయక్ అన్నారు. బీఆర్ఎస్ లో కష్టపడి పనిచేస్తే కేసీఆర్ పక్కన పెట్టారని, మూడు మూడు పదవులు తీసుకొని కేసీఆర్ పక్కన ఉన్నవాళ్లంతా కోట్లు కూడబెట్టారని ఆరోపించారు. కేసీఆర్ దుర్మార్గాలను చూసి అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ కు ఓటు వేశారని, అంతేతప్ప కాంగ్రెస్ చూసి మాత్రం ఓటు వేయలేదన్నారు. రాష్ట్రంలో కరువు రావడానికి కాంగ్రెస్ ప్రభుత్వమే కారణమని విమర్శించారు. సుస్థిర, అవినీతి రహిత పాలన అందిస్తున్న మోడీ నాయకత్వాన్ని దేశ ప్రజలు కోరుకుంటున్నారని, తెలంగాణలో 12 ఎంపీ సీట్లు గెలవబోతున్నామని సీతారాం నాయక్ ధీమా వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో పార్టీ హనుమకొండ, వరంగల్ జిల్లాల అధ్యక్షులు రావు పద్మ, గంటా రవి కుమార్, మాజీ రాజ్యసభ సభ్యుడు, పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యుడు గరికపాటి మోహన్ రావు, పార్లమెంటు ప్రభారి మురళీధర్ గౌడ్ , మాజీ ఎమ్మెల్యే మార్తినేని ధర్మారావు, పార్టీ రాష్ట్ర నాయకులు ఎర్రబెల్లి ప్రదీప్ రావు, మాజీ ఎంపీ చాడ సురేష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.