BRS to BJP: బీజేపీ గూటికి అరూరి రమేశ్.. నేడు అమిత్ షా సమక్షంలో బీజేపీ తీర్ధం పుచ్చుకోన్న బిఆర్‌ఎస్‌ నేత-former mla aruri ramesh will join bjp today in the presence of amit shah ,elections న్యూస్
తెలుగు న్యూస్  /  Elections  /  Former Mla Aruri Ramesh Will Join Bjp Today In The Presence Of Amit Shah

BRS to BJP: బీజేపీ గూటికి అరూరి రమేశ్.. నేడు అమిత్ షా సమక్షంలో బీజేపీ తీర్ధం పుచ్చుకోన్న బిఆర్‌ఎస్‌ నేత

HT Telugu Desk HT Telugu
Mar 13, 2024 08:22 AM IST

BRS to BJP: లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో తెలంగాణ రాష్ట్రంలో రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. వరంగల్‌ జిల్లాలో మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ బీజేపీలో చేరేందుకు సిద్ధం అయ్యారు.

బీజేపీలో చేరేందుకు సిద్ధమవుతున్న ఆరూరి రమేష్
బీజేపీలో చేరేందుకు సిద్ధమవుతున్న ఆరూరి రమేష్

BRS to BJP: బీఆర్ఎస్ పార్టీకి చెందిన నేతలు ఒక్కొక్కరిగా ‘కారు’ దిగి.. కాంగ్రెస్ కండువా కప్పుకుంటుండగా, ఉమ్మడి వరంగల్ లో జిల్లాలో గులాబీ పార్టీ కొద్దికొద్దిగా ఖాళీ అవుతోంది.

ట్రెండింగ్ వార్తలు

కొందరు నేతలు కాంగ్రెస్, బీజేపీ వైపు అడుగులు వేస్తుండగా, తాజాగా వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేశ్ వ్యవహారం మరోసారి తీవ్ర చర్చనీయాంశమైంది. కొద్దిరోజులుగా ఆయన బీజేపీలో చేరుతున్నారనే ప్రచారం జరగగా.. కొద్దిరోజుల కిందట ఆయన ఆ విషయాన్ని కొట్టి పారేశారు.

ఇంతలోనే ఆయన నిర్ణయం మార్చుకుని మళ్లీ కాషాయ కండువా కప్పుకునేందుకు రెడీ అయ్యారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఆధ్వర్యంలో బీజేపీ తీర్థం పుచ్చుకోనున్నట్లు తెలిసింది. పార్టీ వర్గాలు ఇదే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. పార్టీ వరంగల్ జిల్లా అధ్యక్షుడు కారు దిగి కమలం వైపు అడుగులు వేసేందుకు రెడీ కావడంతో ఉమ్మడి వరంగల్ జిల్లాలో తీవ్ర చర్చ సాగుతోంది.

నెల రోజులుగా సస్పెన్స్

తెలంగాణ telangana ఏర్పడిన తరువాత 2014, 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అరూరి రమేశ్ వర్ధన్నపేట నియోజకవర్గం నుంచి బంపర్ మెజారిటీతో గెలుపొందారు. 2023లో జరిగిన ఎన్నికల్లో మూడో సారి పోటీ చేసి, కాంగ్రెస్ అభ్యర్థి కేఆర్ నాగరాజు చేతిలో ఓటమి చవిచూశారు.

హ్యాట్రిక్ కోసం ప్రయత్నించినా విజయం దక్కకపోవడంతో అరూరి రమేశ్ ఢీలా పడ్డారు. అనంతరం బీఆర్ఎస్ నుంచి ఎంపీ టికెట్ కోసం ప్రయత్నాలు చేశారు. టికెట్ దక్కే ఛాన్స్ ఉన్నా.. ఎన్నికలో గెలుపు కష్టమేననే ఉద్దేశంతో ఆయన ప్రత్యామ్నాయ ప్రయత్నాలు మొదలు పెట్టారు.

ఈ క్రమంలోనే ఈ నెల 4, 5 తేదీల్లో ప్రధాన మంత్రి మోదీ తెలంగాణలో పర్యటించగా.. ఆయన సమక్షంలోనే అరూరి పార్టీ మారుతారనే ప్రచారం జరిగింది. కానీ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నుంచి ఒత్తిళ్లు రావడంతో చివరి నిమిషంలో అరూరి వెనుకడుగు వేశారు. ఆ తరువాత హైదరాబాద్ కు వెళ్లిన ఆయన అక్కడి నుంచే తాను పార్టీ మారడం లేదంటూ వీడియో రిలీజ్ చేశారు.

నేడు ఢిల్లీలో బీజేపీలో చేరిక

అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ తో పాటు పార్టీ క్యాడర్ పై ఉన్న తీవ్ర వ్యతిరేకతతో అరూరి ఓటమి పాలుకాగా.. బీజేపీకి క్షేత్రస్థాయిలో ఉన్న ఆదరణ మేరకు ఆ పార్టీలో చేరేందుకు పావులు కదిపారు. కానీ చివరి నిమిషంలో అరూరి రమేశ్ Aruri ramesh వెనక్కి తగ్గడంతో తన అనుచరులు కొంతమంది నిరాశపడ్డారు.

అప్పటికే బీజేపీ నేతలతో టచ్ లోకి వెళ్లిన ఆయన తాజాగా మరోసారి పార్టీ మారే నిర్ణయం తీసుకున్నారు. వారం కిందట పార్టీ మారే నిర్ణయం తీసుకున్న సమయంలో కేసీఆర్, కేటీఆర్ సూచన మేరకు ఎమ్మెల్యే కడియం శ్రీహరి, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య బుజ్జగించే ప్రయత్నాలు చేయగా.. ఇప్పుడు బీఆర్ఎస్ నేతలు ఫోన్ చేసినా అరూరి రమేశ్ లిఫ్ట్ చేయడం లేదని తెలిసింది.

ఇప్పటికే బీజేపీలో చేరేందుకు ముహూర్తం ఫిక్స్ చేసుకోగా.. నేడు మధ్యాహ్నం ఆయన ఢిల్లీకి బయలు దేరనున్నారు. సాయంత్రం కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా Amith Shah ఆధ్వర్యంలో కాషాయ కండువా కప్పుకోనున్నారు. ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీలోని తన అనుచరులకు కూడా సంకేతాలు ఇచ్చినట్లు తెలిసింది.

బీఆర్ఎస్ లో కలవరం

బీఆర్ఎస్ నేతలు అందరూ ఒక్కొక్కరిగా కాంగ్రెస్, బీజేపీ వైపు అడుగులు వేస్తుండగా, పార్టీ పెద్దల్లో కలవరం మొదలైంది. ఇప్పటికే కొందరు మాజీ ఎమ్మెల్యేలు, మున్సిపల్ చైర్మన్లు, కార్పొరేషన్ మేయర్లు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు ఇలా ఎవరికి వారు కాంగ్రెస్ బాట పడుతున్నారు.

తాజాగా అరూరి రమేశ్ లాంటి కీలక నేత కూడా బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి, బీజేపీలోకి చేరనుండటంతో ఉమ్మడి వరంగల్ జిల్లాలో కారు పార్టీ మొత్తం ఖాళీ అవుతున్నట్లు తెలుస్తోంది. మరి ఇంతవరకు ఉన్న పార్టీ క్యాడర్ ను కాపాడుకునేందుకు బీఆర్ఎస్ అగ్రనేతలు ఎలాంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాలి.

(హిందుస్థాన్ టైమ్స్ తెలుగు, వరంగల్ ప్రతినిధి)

WhatsApp channel

సంబంధిత కథనం