Congress candidates list: 43 మంది అభ్యర్థులతో కాంగ్రెస్ రెండో జాబితా; లిస్ట్ లో ప్రముఖులు
Congress candidates list: లోక్ సభ ఎన్నికల్లో పార్టీ తరఫున పోటీ చేయనున్న అభ్యర్థుల రెండో జాబితాను కాంగ్రెస్ పార్టీ మంగళవారం విడుదల చేసింది. ఈ జాబితాలో మొత్తం 43 మంది అభ్యర్థుల పేర్లను ప్రకటించింది. వారిలో గౌరవ్ గొగోయ్ తో పాటు పార్టీ సీనియర్ నేతలు కమల్ నాథ్, అశోక్ గహ్లోత్ ల కుమారులు కూడా ఉన్నారు.
Congress candidates list: లోక్ సభ ఎన్నికల కోసం కాంగ్రెస్ 43 మంది అభ్యర్థులతో రెండో జాబితాను మంగళవారం విడుదల చేసింది. ఈ లిస్ట్ లో పలువురు ప్రముఖుల పేర్లు ఉన్నాయి. మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కమల్ నాథ్ కుమారుడు నకుల్ నాథ్ ను చింద్వారా లోక్ సభ స్థానం నుంచి, రాజస్థాన్ మాజీ ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్ కుమారుడు వైభవ్ గహ్లోత్ ను జలోర్ నుంచి బరిలోకి దింపుతున్నట్లు కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ తెలిపారు.
గౌరవ్ గొగోయ్ స్థానం మార్పు..
అస్సాంలోని జోర్హాట్ నుంచి కాంగ్రెస్ ఎంపీ గౌరవ్ గొగోయ్ పోటీ చేయనున్నారు. గతంలో గౌరవ్ గొగోయ్ అస్సాంలోని కలియబోర్ స్థానం నుంచి గెలుపొందారు. రాబోయే ఎన్నికల్లో ఆయన జోర్హాట్ నుంచి పోటీ చేస్తారని కాంగ్రెస్ తెలిపింది. కొద్ది రోజుల క్రితం బీజేపీ నుంచి కాంగ్రెస్ లోకి ఫిరాయించిన రాహుల్ కస్వాన్ ను రాజస్థాన్ లోని చురు నుంచి బరిలోకి దింపారు. రాజస్థాన్ లోని చురు నుంచి రాహుల్ కస్వాన్ పోటీ చేస్తారని కేసీ వేణుగోపాల్ తెలిపారు. లోక్ సభ ఎన్నికలకు సంబంధించి కాంగ్రెస్ అభ్యర్థుల తొలి జాబితాను ఇప్పటికే ప్రకటించారు. ఇవాళ రెండో జాబితాను ప్రకటించారు. మార్చి 11, మార్చి 12 తేదీల్లో కాంగ్రెస్ సీఈసీ సమావేశమై అస్సాం, మధ్యప్రదేశ్, రాజస్థాన్ ల నుండి సుమారు 43 మంది పేర్ల జాబితాను ఆమోదించింది.
మొత్తం 43 మంది
కాంగ్రెస్ (congress) రెండవ అభ్యర్థుల జాబితాలో అస్సాం నుండి 12 మంది, మధ్యప్రదేశ్ నుండి 10 మంది, రాజస్థాన్ నుండి 10 మంది, గుజరాత్ నుండి ఏడుగురు, ఉత్తరాఖండ్ నుండి ముగ్గురు, డామన్ అండ్ డయ్యూ నుండి ఒకరు ఉన్నారు. 43 మంది అభ్యర్థుల జాబితాలో జనరల్ అభ్యర్థులు 10 మంది, ఇతర వెనుకబడిన కులాలు (ఓబీసీ) 13 మంది, షెడ్యూల్డ్ కులాలు 10 మంది, షెడ్యూల్డ్ తెగలు (ఎస్టీ) 9 మంది, ఒక ముస్లిం అభ్యర్థి ఉన్నారు.
ఏ స్థానంలో ఎవరు?
ఈ ఎన్నికల్లో సిద్ధార్థ్ కుష్వాహా సత్నా నియోజకవర్గం నుంచి, కమలేశ్వర్ పటేల్ సిధి నియోజకవర్గం నుంచి బరిలోకి దిగనున్నారు. ఓంకార్ సింగ్ మార్కమ్ మాండ్లా నుంచి పోటీ చేయనున్నారు. దేవాస్ నుంచి రాజేంద్ర మాలవీయ, ధార్ నుంచి రాధేశ్యామ్ మువేల్, ఖర్గోన్ నుంచి పోర్లాల్ ఖర్టే, బేతుల్ నుంచి రాము టేకం కాంగ్రెస్ తరఫున పోటీ చేస్తున్నారు. కేతన్ దహ్యాభాయ్ పటేల్ ను డామన్ అండ్ డయ్యూ నియోజకవర్గం నుంచి బరిలోకి దింపారు. తారాచంద్ మీనా ఉదయ్ పూర్ స్థానం నుంచి పోటీ చేయనున్నారు.